Share News

ఆరోగ్యం డిజిటల్‌..!

ABN , Publish Date - Aug 25 , 2026 | 03:55 AM

రాష్ట్రంలోని దాదాపు 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్‌ చేయడం, ప్రతిఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌, కుటుంబ సభ్యులకు హెల్త్‌ ఐడీలు సృష్టించడం సంజీవని ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం..!

ఆరోగ్యం డిజిటల్‌..!

  • పీహెచ్‌సీల్లోనూ టెక్నాలజీ వినియోగం

  • ప్రతి రోగికీ డిజిటల్‌ హెల్త్‌ రికార్డు

  • కాగితంతో పనిలేకుండా రోగులకు చికిత్స

  • పీహెచ్‌సీల్లో ‘ఏఐ-స్ర్కైబ్‌’ సేవలు

  • డాక్టర్లకు సలహాలిచ్చే ఏఐ టూల్స్‌ వినియోగం

  • ఆరు కీలక సేవలతో ‘సంజీవని’ ప్రాజెక్టు

  • 29న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకూ ఆరోగ్యశాఖ మొత్తం డిజిటలైజ్‌ కానుంది. పీహెచ్‌సీ స్థాయి నుంచే పేపర్‌ లెస్‌ వైద్యానికి శ్రీకారం చుడుతూ.. సంజీవని డిజిటల్‌ హెల్త్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ఈ నెల 29న ప్రారంభించనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ద్వారా దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఆరోగ్య సేవలన్నీ డిజిటల్‌ విధానంలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కుప్పంలో విజయవంతమైన పైలట్‌ ప్రాజెక్టు.. రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తే.. ప్రతి ఒక్కరి హెల్త్‌ డేటా డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి రానుంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని దాదాపు 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్‌ చేయడం, ప్రతిఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌, కుటుంబ సభ్యులకు హెల్త్‌ ఐడీలు సృష్టించడం సంజీవని ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం..! రాష్ట్రంలో ఎవరికి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఫోన్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌ చెబితే చాలు.. ఆ రోగి హెల్త్‌ డేటా మొత్తం కంప్యూటర్‌ తెరపై ప్రత్యక్షమయ్యేలా ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును తీర్చిదిద్దింది. తొలుత పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. అనంతరం దశల వారీగా సెకండరీ హెల్త్‌ ఆస్పత్రులు (సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు), బోధనాస్పత్రులకు విస్తరించనున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పంలో సంజీవని ప్రాజెక్టును పైలట్‌గా నిర్వహిస్తున్నారు. ఈ నెల 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తోంది.

ప్రాజెక్టులో ఆరు కీలక సేవలు: సంజీవని ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు కీలక సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలోని ప్రజారోగ్యం మొత్తం ఈ ఆరు సేవల పరిధిలోకి రానుంది. అవి ఏమిటంటే..


  • ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌

  • సిటిజన్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ యాప్‌

  • సెంట్రలైజ్డ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

  • యాంటీనాటల్‌ కేర్‌ సేవలు

  • వర్చువల్‌ పాయింట్‌ ఆఫ్‌ డెలవరీ (వీ-పోడ్‌)

  • ఏఐ-స్ర్కైబ్‌

ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌

సంజీవని ప్రాజెక్టులో ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ చాలా కీలకం. దీన్ని ఇప్పటికే ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ రికార్డ్‌ (అభా)తో అనుసంధానం చేశారు. ఎవరైనా చిన్న అనారోగ్య సమస్యతో పీహెచ్‌సీకి రాగానే అతనికి ఒక డిజిటల్‌ హెల్త్‌ రికార్డును సృష్టిస్తారు. ఆ రోగి ఫోన్‌ లేదా ఆధార్‌ నంబర్‌తో అభా ఐడీని తెరిచి డిజిటల్‌ హెల్త్‌ రికార్డులను దానికి లింక్‌ చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆరోగ్యశాఖ 5.2 కోట్ల మందికి అభా ఐడీలు సృష్టించారు. వాటి ఆధారంగా పీహెచ్‌సీ స్థాయిలోనే డిజిటల్‌ ఓపీని సృష్టించి.. దాన్ని నర్సు వద్దకు పంపిస్తారు. ఆ రోగి నర్సు వద్దకు వెళ్లగానే.. బీపీ, ఎత్తు, బరువు, శరీర ఉష్ణోగ్రత వంటి వివరాలు ఎంటర్‌ చేసి.. వాటిని కంప్యూటర్‌లోనే డాక్టర్‌కు పంపిస్తారు. అనంతరం రోగి నేరుగా డాక్టర్‌ వద్దకు వెళ్లి... తన అనారోగ్య సమస్యను వివరిస్తాడు. డాక్టర్‌ కంప్యూటర్‌లోనే రోగి వివరాలు చూసుకుని, ఆయన చెప్పిన వివరాల ప్రకారం అతనికి మందులు ఇవ్వడం లేదా రక్త పరీక్షలు, వైద్య పరీక్షలను సూచించడం చేస్తారు. రోగికి నిర్వహించే రక్త, వైద్య పరీక్షల రిపోర్టులు కూడా కంప్యూటర్‌ ద్వారా డిజిటలైజ్‌ చేస్తారు. ఇదంతా ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ప్ల్లాట్‌ఫామ్‌ సేవల కిందకి వస్తుంది.


కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌..

సెంట్రలైజ్డ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారానే సంజీవనిలో మెజారిటీ సేవలు ప్రజలకు అందించనున్నారు. ఈ సెంటర్‌కు ఒక యూనిక్‌ నంబర్‌ను కేటాయిస్తారు. కంట్రోల్‌ సెంటర్‌లో వైద్యులు, నర్సులు, కేర్‌ కో-ఆర్డినేటర్లను అందుబాటులో ఉంచుతారు. రోగులు ఎవరైనా ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఈ కంట్రోల్‌ సెంటర్‌ను స్పందించవచ్చు. అనారోగ్య సమస్య చిన్నదైతే తొలుత కేర్‌ కో-ఆర్డినేటర్‌ స్థాయిలో సలహా ఇస్తారు. కాస్త పెద్ద సమస్య అయితే నర్సు అందుబాటులోకి వచ్చి వారికి వైద్య సలహాలు ఇస్తారు. సమస్య తీవ్రమైనదైతే నేరుగా డాక్టర్‌ లైన్‌లోకి వస్తారు. రోగి సమస్య గుర్తించి మెరుగైన సలహాలిస్తారు. అప్పటికీ రోగి సంతృప్తి చెందకపోతే వెంటనే స్థానిక ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి రోగి వెసులుబాటును బట్టి అపాయిట్‌మెంట్‌ ఇస్తారు. ఆ వివరాలు రోగి ఫోన్‌కు పంపిస్తారు. ఆ రోగి ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే వరకూ ఈ సెంటర్‌ నుంచి ఫాలోఅప్‌ చేస్తూనే ఉంటారు.

వర్చువల్‌ పాయింట్‌ ఆఫ్‌ డెలివరీ..

వర్చువల్‌ పాయింట్‌ ఆఫ్‌ డెలివరీ (వీ-పోడ్‌) అనే మరో కొత్త సేవను సంజీవని ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎవరైనా రోగి పీహెచ్‌సీ లేదా సీహెచ్‌సీకి వెళ్లిన సమయంలో అక్కడి వైద్యులకు రోగికి స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలు అవసరమని గుర్తిస్తే.. వెంటనే వర్చువల్‌ విధానంలో బోధనాస్పత్రిలో లేదా జిల్లా ఆస్పత్రిలోని స్పెషాలిటీ వైద్యులు లైన్‌లోకి తీసుకుంటారు. వారు నేరుగా రోగితో నేరుగా మాట్లాడారు. సమస్యను గుర్తించి వెంటనే మందులు ఇవ్వడం లేదా.. వైద్య పరీక్షలకు సంబంధించిన సూచనలు ఇవ్వడం చేస్తారు. అవసరమైతే తాము ఉన్న ఆస్పత్రికి రావాలని రోగికి సూచిస్తారు. పీహెచ్‌సీలో అప్పటికే రూపొందించిన డిజిటల్‌ హెల్త్‌ రికార్డుల్లోని వివరాలను స్పెషాలిటీ వైద్యులు తమ వద్ద కంప్యూటర్‌లో చూసుకునే విధంగా డీ-లింక్‌ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. స్పెషాలిటీ వైద్యుడి సూచన మేరకు రోగి అక్కడికి వెళ్లాలనుకుంటే పీహెచ్‌సీ వైద్యులు వెంటనే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సమాచారం అందిస్తారు. అక్కడి సిబ్బంది రోగికి ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ చేస్తారు.


యాంటీనాటల్‌ కేర్‌ అండ్‌ ఎన్సీడీ..

సంజీవనిలో మరో కీలక విధానం యాంటీనాటల్‌ కేర్‌ సేవలు. గ్రామాలు, పట్టణాల్లోని గర్భిణులు, బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారితో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది నిత్యం టచ్‌లో ఉంటారు. తల్లీబిడ్డల ఆరోగ్య పర్యవేక్షణే లక్ష్యంగా గర్భిణులకు ఫోన్‌చేసి నెలవారీ చెక్‌పలు చేయించుకుంటున్నారా..? రిపోర్టులు ఎలా ఉన్నాయి..? పీహెచ్‌సీల్లో సేవలు బాగానే ఉన్నాయా..? పెద్దాస్పత్రికి వెళ్లేందుకు వైద్యుల అపాయింట్‌మెంట్‌ ఇప్పించమంటారా..? అని అడుగుతారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారితో కూడా కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది మాట్లాడతారు. సమయానికి వైద్యుల వద్దకు వెళ్లారా... లేదా..? మందులు తీసుకున్నారా..? లేదా..? అని తెలుసుకుంటారు. ఇలా జ్వరం బాధితుడి దగ్గర నుంచి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారి వరకూ ప్రతి రోగితోనూ మాట్లాడి.. వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తారు.

దేశానికే ఆదర్శం..

దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రారంభించిన డిజిటల్‌ హెల్త్‌ సేవలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఐదేళ్లకు రూ.370 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఆరోగ్య రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలవనుంది. టాటా సంస్థతో సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే కుప్పంలో విజయవంతమైంది. దీంతో ఈ నెల 29న సంజీవని డిజిటల్‌ ఆరోగ్య ప్రాజెక్టును సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు శనివారం ప్రారంభమైనప్పటికీ మూడు నెలల తర్వాతే సంజీవని ద్వారా డిజిటల్‌ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.


‘ఏఐ- స్క్రైబ్’ సేవలు..

డిజిటల్‌ సేవల్లో ‘‘ఏఐ స్ర్కైబ్‌’’ అద్భుతం..! ఇది వైద్యులు, ఇతర సిబ్బందిపై ఉన్న పని భారాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. రోగి డిజిటల్‌ ఓపీ తీసుకుని వైద్యుల వద్దకు వెళ్లాగానే అక్కడున్న కంప్యూటర్‌లో అతనికి సంబంధించి హెల్త్‌ డేటా మొత్తం వైద్యులకు కనిపిస్తుంది. ఈ సమయంలో రోగి చెప్పే అనారోగ్య సమస్యలు, తన ఇబ్బందలను వైద్యుడితో పాటు ఏఐ కూడా విం టుంది. ఆ వివారల ఆధారంగా అతని సమస్య ఏమిటి.. ఏ చికిత్స చేయాలి..? ఏ మందులు ఇవ్వాలి...? ఏ ఏ వైద్య, రక్త పరీక్షలు చేయాలి.. అనే వివరాలు మొత్తం ఏఐనే వైద్యుడికి సూచిస్తుంది. వైద్యుడు ఏఐ ఇచ్చిన సమాచారాన్ని క్రాస్‌ చెక్‌ చేసుకుని రోగికి మందులిచ్చే విధంగా ఏఐ-స్ర్కైబ్‌ సేవలు ఉపయోగపడతాయి.

సిటిజన్‌ హెల్త్‌ యాప్‌..

సంజీవని ప్రాజెక్టులో భాగంగా ‘సిటిజన్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ యాప్‌’ను ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలదరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తారు. అనారోగ్య సమస్యలు లేని వారు కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. ఈ యాప్‌ ద్వారా ఎవరైనా వైద్యులను సంప్రదించవచ్చు. ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా, ప్రభుత్వాస్పత్రికి సంబంధించిన వైద్యుల అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు.

Updated Date - Aug 25 , 2026 | 03:56 AM