ఎప్పటికి పూర్తయ్యేనో?
ABN , Publish Date - Aug 25 , 2026 | 01:19 AM
అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణకు సంబంధించి ప్రధానమైన అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్ వంతెన పనులు మందకొడిగా సాగుతున్నాయి.
మందకొడిగా అచ్యుతాపురం- అనకాపల్లి రోడ్డు విస్తరణ
కొనసా..గుతున్న ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం
మొదలుకాని అప్రోచ్ రోడ్ల పనులు
టీడీఆర్ బాండ్లకు నిర్వాసితుల విముఖత
కోర్టుకెళ్లడంతో పలుచోట్ల అసంపూర్తిగా రహదారి విస్తరణ పనులు
గడువులోగా పూర్తికావడం అసాధ్యమన్న అభిప్రాయం
అచ్యుతాపురం రూరల్, ఆగస్టు 24 (ఆంధ్యజ్యోతి):
అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణకు సంబంధించి ప్రధానమైన అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్ వంతెన పనులు మందకొడిగా సాగుతున్నాయి. పిల్లర్ల స్పాన్‌లపై ప్రీఫ్యాబ్రికేటెడ్ సిమెంట్ గడ్డర్ల ఏర్పాటు పనులు అనుకున్నంత వేగంగా సాగడంలేదు. సుమారు మూడు నెలల క్రితం మొదలుపెట్టిన ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ప్రస్తుతం సిమెంట్ గడ్డర్లపై శ్లాబ్ పనులు జరుగుతున్నాయి. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్లు నిర్మాణ పనులు ఇంకా మొదలుకాలేదు. ఇక్కడ జరుగున్న పనులను పరిశీలిస్తే.. వచ్చే ఏడాది మార్చి చివరినాటికి వంతెనతోపాటు రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. 2025 మార్చి 19న అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్ 2027 మార్చినాటికి పూర్తిచేయాలి. అచ్యుతాపురం మండల పరిధిలో హరిపాలెం వద్ద సాగునీటి కాలువపై వంతెన నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. వివిధ రకాల కల్వర్టులు సగం మేర పూర్తయ్యాయి. రోడ్డు విస్తరణ కోసం సేకరించే స్థలాలు, భూములకు నష్టపరిహారం బదులు టీడీఆర్ బాండ్లు ఇస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పగా.. పలువురు స్థలాలు ఇవ్వడానికి ముందుకు రాకుండా, నష్టపరిహారాన్ని నగదు రూపంలో ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా ప్రదేశాల వద్ద రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వ స్థలాలు వున్నచోట, టీడీఆర్ బాండ్లకు నిర్వాసితులు అంగీకరించినచోట మాత్రమే రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. మొత్తం మీద 13 కిలోమీటర్ల మేర సీసీ డ్రైన్లు నిర్మించాల్సి వుండగా, ఇంతవరకు 270 మీటర్లు మాత్రమే నిర్మించారు.
ఫ్లైఓవర్ వంతెన పనుల్లో జాప్యం
అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మోసయ్యపేట, అచ్యుతాపురం గ్రామ పంచాయతీల పరిధిలో 1.2 కిలోమీటర్ల మేర రోడ్డులో 900 మీటర్ల ఫ్లైఓవర్ వంతెన వుంది. ఇప్పటివరకు గడ్డర్ల నిర్మాణం 55 శాతం పూర్తవగా, పీయర్ కాప్ నిర్మాణం 68 శాతం పూర్తయ్యింది. గడ్డర్లపైన శ్లాబు పనులు 10 శాతం మాత్రమే పూర్తయ్యాయి. .