భూమంతర్‌కాళీకి చెక్
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:06 AM
విశాఖపట్నంలో కోట్లాది రూపాయల విలువైన భూముల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడింది. బూచోళ్లు ఆడిన భూమంతర్‌కాళీకి ఎట్టకేలకు చెక్ పడింది. మధురవాడలోని సర్వే నంబర్ 296లోని మొత్తం 50 ఎకరాల..
విశాఖలో 130 కోట్ల భూదోపిడీకి అడ్డుకట్ట
వెబ్‌ల్యాండ్ నుంచి 296-14 ఎంట్రీ తొలగింపు
అందులో చూపిన భూమి 5.33 ఎకరాలు
దీనిపై తనఖా రిజిస్ట్రేషన్ కూడా రద్దు
మధురవాడలో ఫిజికల్‌గా లేకున్నా రికార్డులు
ఆ తర్వాత సర్పవరంలో తనఖా రిజిస్ట్రేషన్
జూలైలో వెలుగులోకి తీసుకొచ్చిన ‘ఆంధ్రజ్యోతి’
సీఎస్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ చర్యలు
సర్వే నంబర్ 296లోని 50 ఎకరాలకు రక్షణ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో కోట్లాది రూపాయల విలువైన భూముల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడింది. బూచోళ్లు ఆడిన భూమంతర్‌కాళీకి ఎట్టకేలకు చెక్ పడింది. మధురవాడలోని సర్వే నంబర్ 296లోని మొత్తం 50 ఎకరాల భూమి రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది. అక్రమార్కులకు కొమ్ముకాస్తూ 2024 ఎన్నికలకు ముందు అధికారులు వెబ్‌ల్యాండ్‌లో సర్వే నంబర్ 296-14 పేరిట 5.33 ఎకరాలు ఉన్నట్టుగా చేసిన తప్పుడు ఎంట్రీని సర్కారు రద్దు చేసింది. వెబ్‌ల్యాండ్ నుంచి దీన్ని తొలగించింది. మరోవైపు ఫిజికల్‌గా లేని ఈ భూమిని ఉన్నట్టుగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద చేసిన తనఖా రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసింది. దీంతో ప్రూఫ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కింద రికార్డుల్లో భూమిని చూపి, ఆ తర్వాత ఫిజికల్‌గా భూమిని చూపించాలని ఒత్తిడి చేస్తున్న భూమాయగాళ్లకు సర్కారు చెక్ పెట్టింది. రూ.130 కోట్ల విలువైన భూ దోపిడీ జరగకుండా వెబ్‌ల్యాండ్‌ను సరిదిద్దింది.
సర్కారును కదిలించిన ‘ఆంధ్రజ్యోతి’
విశాఖలో గజం భూమి లక్షల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేయడం, రికార్డులు తారుమారు చేయడం చూశాం. కానీ ఇది అలాంటి, ఇలాంటి మోసం కాదు. అసలు లేని భూమిని ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించారు. మధురవాడలోని సర్వే నంబర్ 296లో మొత్తం 50 ఎకరాలు ఉంది. అందులో 13 సబ్‌డివిజన్లు ఉన్నాయి. అంతా ప్రభుత్వ భూమే. అందులో 296-14 అనే ఒక సబ్‌డివిజన్‌ను సృష్టించి, 5.33 ఎకరాలు సూర్యనారాయణ అనే వ్యక్తి పేరిట రికార్డు చేయించారు. ఆ తర్వాత వెబ్‌ల్యాండ్‌లో 1బీలో ఎంట్రీ చేయించారు. ఆ రికార్డు ఆధారంగా సర్వే నంబర్ 296లో ఉన్న భూమిలోనే 5.33 ఎకరాలు ఫిజికల్‌గా పొజిషన్ పొందాలని కుట్రచేశారు. తెరవెనక నుంచి ఓ టీడీపీ నేత, మరో వైసీపీ నేత ఈ కుట్రను నడిపించారు. ఈ భూమంతర్‌కాళీ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయించగా కుట్ర బట్టబయలైంది. వెబ్‌ల్యాండ్‌లో 296-14 ఎంట్రీ అక్రమంగా చేశారని, వెంటనే రద్దు చేసి ఎంట్రీని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖరూరల్ తహశీల్దార్ 2024లోనే నాటి కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆ భూమిపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించాలని కోరారు. అయితే నాటి కలెక్టర్ పట్టించుకోలేదు. ఫలితంగా ఒక కుట్రకు అనుబంధంగా మరో కుట్ర జరిగింది. లేని భూమిని సర్వే నంబర్ 296-14ను తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. అదెలాగంటే.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద విశాఖ రూరల్ మండలం మధురవాడలో ఉన్న భూమిని తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో ఉన్న సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి వ్యవహారం నడిపించారు. రూ.130 కోట్ల విలువైన భూమిని కేవలం 5 లక్షలకు వైసీపీ నేత సన్నిహిత బంధువు పేరిట తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఉదంతాన్ని ‘ఆంధ్రజ్యోతి’ జూలై 13న ‘భూమంతర్‌కాళీ’, జూలై 27న ‘బూచోళ్ల భూమాయ’ శీర్షికలతో వార్తలను ప్రచురించింది. ఆ భూమిని దక్కించుకునేందుకు నేతలు చేసిన ప్రయత్నాలను, అధికారుల సహకారం వెలుగులోకి తీసుకొచ్చింది.
అక్రమాలపై విచారణ
‘ఆంధ్రజ్యోతి’లో రెండోసారి వార్త ప్రచురితమైనరోజే జూలై 27న ప్రభుత్వం స్పందించింది. వార్తల్లోని అంశాలు, 296-14 వెబ్‌ల్యాండ్ ఎంట్రీ, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద తనఖా రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై వెంటనే వాస్తవిక నివేదిక సమర్పించాలని, పూర్తి విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను ఆదేశించారు. ఈ నేపఽథ్యంలో సీసీఎల్‌ఏ, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీలు ఈ అంశంపై వేర్వేరుగా విచారణ జరిపించారు. ఇటు వెబ్‌ల్యాండ్ ఎంట్రీ, అటూ తనఖా రిజిస్ట్రేషన్ పత్రాలను తెప్పించుకొని ఉన్నతాధికారులు పరిశీలించారు. 2024లో నాటి విశాఖ రూరల్ తహశీల్దార్ జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖను కూడా తెప్పించుకొని పరిశీలించినట్లు తెలిసింది. లేని భూమిని వెబ్‌ల్యాండ్‌లో సృష్టించడమనేది ముందస్తు కుట్రని అధికారులు గుర్తించారు. అదే భూమిని ఫిజికల్‌గా తమకు చూపించాలని అధికారులపై ఒత్తిడి తేవాలని, రాజకీయ ఒత్తిళ్లు కూడా తీసుకురావాలని అక్రమార్కులు చేసిన ప్రయత్నాలను నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో మధురవాడలోని సర్వే296-14 పేరిట ఉన్న ఎంట్రీ అక్రమమని గుర్తించి దాన్ని రద్దుచేశారు. 1బీ రిజిస్టర్ నుంచి ఎంట్రీని తొలగించారు. వెబ్‌ల్యాండ్‌లోని రిజిస్టర్‌ను కూడా తాజాపరిచారు. దీంతో 296 సర్వే నంబర్‌లో మొత్తం 13 సబ్‌డివిజన్‌లకే పరిమితమైంది. అదంతా ప్రభుత్వ భూమే. ఇక రిజిస్ట్రేషన్ శాఖ కూడా తనఖా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు తెలిసింది.
కొమ్ముకాసిన వారిపై చర్యలేవీ?
‘ఆంధ్రజ్యోతి’ వార్తలతో కదిలిన ఉన్నతాధికారులు భూ అక్రమాలపై చర్యలు తీసుకున్నారు. మరి అక్రమార్కులకు కొమ్ముకాస్తూ లేని భూమిని వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలేవీ? ఎనీవేర్ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలేవీ? దీనికి రెవెన్యూ శాఖ నుంచి సమాధానం లేదు. 2024లో నాటి విశాఖ రూరల్ తహశీల్దార్ భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు రాసిన లేఖ విషయం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చేదాకా కలెక్టర్ స్పందించలేదు. ఈ ఉదాసీన వైఖరిని ఇలాగే వదిలేస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.