శ్రీశైలంలో 166 టీఎంసీలు
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:18 AM
శ్రీశైలం డ్యాంకు పది రోజులుగా వరద ప్రవాహం పెద్దగా లేకపోవడం, వచ్చిన నీటిని విద్యుదుత్పాదనకు, తాగునీటి అవసరాల కోసం కాలువలకు విడుదల చేస్తుండడంతో..
కాలువలు, ఎడమ గట్టు విద్యుదుత్పాదనకు 35,315 క్యూసెక్కుల వినియోగం
జూరాల నుంచి బాగా తగ్గిన ప్రవాహం
శ్రీశైలం/విజయపురిసౌత్/అచ్చంపేట, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాంకు పది రోజులుగా వరద ప్రవాహం పెద్దగా లేకపోవడం, వచ్చిన నీటిని విద్యుదుత్పాదనకు, తాగునీటి అవసరాల కోసం కాలువలకు విడుదల చేస్తుండడంతో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడం లేదు. ప్రస్తుతం నీటి నిల్వలు 166.705 టీఎంసీలు ఉన్నాయి. సోమవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి 7,134 క్యూసెక్కులు సహా 27,639 క్యూసెక్కులు విడుదల కాగా.. సాయంత్రం శ్రీశైలానికి 18,522 క్యూసెక్కులు వచ్చి చేరింది. కుడిగట్టు కేంద్రంలో ఏపీ విద్యుదుత్పత్తి నిలిపివేయగా.. ఎడమ కట్టున తెలంగాణ కొనసాగిస్తోంది. ప్రాజెక్టులు, కాలువలకు తాగునీటి కోసం, విద్యుదుత్పాదనకు 35,315 క్యూసెక్కులను వినియోగించారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 875.50 అడుగులు, గరిష్ఠ సామర్థ్యం 215.807 టీఎంసీలకు 166.705 టీఎంసీల నీటినిల్వ నమోదైంది. ఎగువన ఆలమట్టి డ్యాంకు ఇన్‌ఫ్లో తగ్గింది. సోమవారం 28,028 క్యూసెక్కులు రాగా.. 21,325 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. 123.081 టీఎంసీల గరిష్ఠ నిల్వకు గాను ప్రస్తుతం 121.260 టీఎంసీలు ఉన్నాయి. నారాయణపూర్ గరిష్ఠ సామర్థ్యం 33.313 టీఎంసీలు కాగా.. సోమవారం 33.220 టీఎంసీలున్నాయి. డ్యాంలోకి 20,951 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 20,402 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు తుంగభద్ర డ్యాం గరిష్ఠ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. సోమవారం 94.819 టీఎంసీలకు చేరింది. పూర్తిగా నిండేందుకు ఇంకా 11 టీఎంసీలు అవసరం. అయితే 8981 క్యూసెక్కుల స్వల్ప ప్రవాహం మాత్రమే వస్తుండగా.. కాలువకు 8779 క్యూసెక్కులను వదులుతున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సోమవారం 178.27 టీఎంసీల నీరుంది. ఎగువ నుంచి 6236 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 4236 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 28.31 టీఎంసీలున్నాయి. లీకుల ద్వారా 400 క్యూసెక్కులు విడుదలవుతోంది.