నిత్యం ప్రత్యక్ష నరకం!
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:22 AM
పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సౌజన్య సూసైడ్ నోట్‌లోని సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
సాదిక్ క్రూరుడు.. ఘోరంగా హింసించేవాడు
నా జీవితానికి అండగా ఉంటానంటే నమ్మా..
కొన్ని ప్రైవేట్ విషయాలతో బ్లాక్‌మెయిల్ చేశాడు
ఎదిరించిన ప్రతిసారీ నన్ను తీవ్రంగా కొట్టేవాడు
తట్టుకోలేక చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నా
నా భర్తకు విషపూరిత కెమికల్ ఇచ్చి చంపేశాడు
అతను చనిపోయాక నాపై కంట్రోల్ తీసుకున్నాడు
ఆస్తులు, లాకర్ తాళాలు అన్నీ లాగేసుకున్నాడు
మతం మారాలని ప్రతి నిత్యం నాపై ఒత్తిడి
కాకినాడ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సౌజన్య సూసైడ్ నోట్‌లోని సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సాదిక్ నిత్యం తనను వేధిస్తూ నరకం చూపించేవాడని, అతడి వేధింపులు తట్టుకోలేక చాలాసార్లు చచ్చిపోదాం అని కూడా అనుకున్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. ‘‘సాదిక్ ఖాన్ నాకు నిత్యం ప్రత్యక్ష నరకం చూపేవాడు. కొన్ని ప్రైవేటు వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఎదిరించిన ప్రతిసారీ చాలా తీవ్రంగా కొట్టేవాడు. నా భర్తకు విషపూరిత కెమికల్స్ ఇచ్చి చంపేశాడు. నా భర్త చనిపోయాక మొత్తం నాపై కంట్రోల్ తీసేసుకున్నాడు’’ అంటూ నూకరాజు కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ లెటర్‌లో తన ఆవేదన వెల్లగక్కింది. ఆ లేఖ సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న తన తండ్రి, తల్లి, తనయుడితో కలిపి రాజమహేంద్రవరంలో గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకునే ముందు సౌజన్య స్వదస్తూరితో సూసైడ్ నోట్ రాసి, దాన్ని తన బైక్ డిక్కీలో ఉంచింది. దీన్ని పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. అయితే దీని కంప్యూటర్ ప్రతిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం పోస్ట్ చేశారు. ఈ సూసైడ్ నోట్‌లో సాదిక్ తనను ఏ స్థాయిలో వేధింపులకు గురిచేశాడో సౌజన్య వివరించింది. ‘‘నా కుమారుడికి తన తండ్రితో అటాచ్‌మెంట్ అసలు లేదు, నా భర్త మమ్మల్ని ఎక్కడికీ పెద్దగా పంపేవారు కాదు. కుటుంబసభ్యులతో కలవనిచ్చేవారు కాదు. దీంతో నా కొడుక్కి ఒంటరితనం ఉండేది.
కోచ్ అయిన సాదిక్ నా కొడుకును బాగా ఆడిస్తూ ఎంటర్‌టైన్ చేసేవాడు. ఈ క్రమంలో మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువగా నాతో ఉండరనే విషయం తెలుసుకున్నాడు. కొంతకాలానికి ఇద్దరం స్నేహితులయ్యాం. అలా క్లోజ్ అయ్యాక నా జీవితానికి సపోర్టుగా ఉంటానంటే ఎంతగానో నమ్మాను. కానీ కొన్ని ప్రైవేట్ విషయాలను అడ్డుపెట్టుకుని సాదిక్ నన్ను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. నేను ఎదిరించిన ప్రతీసారీ కొట్టేవాడు. డిప్రెషన్‌లోకి వెళ్లి, చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నా. కానీ నా కొడుకు కోసం ఆగాను. కొంత కాలం తర్వాత విషయం నా భర్తకి చెప్పేశాను. నీ ఆస్తి, విడాకులు ఇచ్చేస్తా నన్ను సాదిక్ నుంచి కాపాడాలని కోరా. కానీ సాదిక్ దాడిలో తీవ్రంగా దెబ్బలు తిని, నా భర్త భయపడిపోయాడు. సాదిక్ నన్ను బెదిరించడానికి నా కొడుకు చదివే స్కూల్‌లో కోచ్‌గా చేరాడు. ఏదైనా తేడా వస్తే నా కొడుకుని కిడ్నాప్ చేస్తానంటూ వీడియో కాల్స్‌తో నన్ను బెదిరించేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్లిపోయా. అలాంటి టైంలో నా భర్తకు అత్యంత విషపూరిత కెమికల్ ఇచ్చి చంపేశాడు. సాదిక్ కన్ను నా ఆస్తిపై ఉందని నాకు ఆలస్యంగా తెలిసింది. నా భర్త చనిపోయాక సాదిక్ నా మీద మొత్తం కంట్రోల్ తీసుకున్నాడు. నా ఇంటి తాళం, నా భర్త ఫోన్, నా ఫోన్, ఎస్‌బీఐ లాకర్ తాళం, మా నాన్న కష్టార్జితమైన ఒక స్థలం (పనసపాడు దగ్గర) ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. నా తండ్రినీ చంపేస్తానన్నాడు. నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ రిస్క్‌లోకి వెళ్లిపోతున్నారు. రోజురోజుకీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. నా భర్త చావుకి న్యాయం జరగాలి. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా. చివరకు నా కొడుకుని టెర్రరిస్టులకు అమ్మేస్తానని తీవ్రంగా బెదిరించేవాడు’’ అని సౌజన్య వివరించారు.
మతం మారాలని టార్చర్
‘‘సాదిక్ నన్ను ఇస్లాంలోకి మారమని ఒత్తిడి చేసేవాడు. రోజూ టార్చర్ చూపించేవాడు. ఇటీవల కూడా మూడు రోజులు కొట్టాడు. ఓసారి సముద్రంలో తోసేశాడు. మళ్లీ వెనక్కి లాగి ఈ సారి రాళ్లపై నుంచి తోసేస్తానని బెదిరించాడు. వాడికి ఎందుకు, ఎలా కోపం వస్తుందో తెలియదు. కానీ ఆ కోపం నరకం కన్నా దారుణంగా ఉంటుంది. నేను వీడి చేతిలో ఎంతో క్షోభ అనుభవించా, తట్టుకోలేకపోతున్నా. సాదిక్ మతం ముసుగులో అక్రమాలు చేస్తున్నాడు. శిక్షణ పేరుతో చాలా మంది పిల్లల్ని క్రూరంగా కొడతాడు’’ అని సౌజన్య పేర్కొన్నారు.
నేనే సైనైడ్ తెప్పించా..
అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) మహంతి కిశోర్ నేతృత్వంలోని పోలీసు బృందం సాదిక్‌ను విచారించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు 14 గంటలకుపైగా సాగిన విచారణలో సుమారు 50 ప్రశ్నల వరకు సంధించినట్లు తెలిసింది. జగదీశ్వరరెడ్డి మరణంలో నీ పాత్ర ఏంటని ఆరాతీశారు. అతడిని చంపేందుకు తానే సైనైడ్ తెప్పించానని సాదిక్ అంగీకరించినట్లు తెలిసింది. సర్పవరం పోలీసులు మధ్యాహ్నం సాదిక్‌ను ప్రత్యేక భద్రత నడుమ వైద్య పరీక్షల కోసం స్థానిక ఏఆర్ పోలీస్ రిజర్వ్ లైన్‌లో ఉన్న యూనిట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత జీజీహెచ్‌కు తీసుకువెళతారని భావించినా.. ఏదైనా చెదురుముదురు ఘటనలు జరిగే ప్రమాదం ఉందని భావించి ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 14న సాదిక్‌కు పెళ్లి సంబంధం రావడం, ఈ నేపథ్యంలో తనకు, సౌజన్యకు మధ్య గొడవ జరిగిందని సాదిక్ పోలీసులతో అన్నట్టు తెలిసింది.
సూసైడ్ నోట్‌లోని అంశాలపై దర్యాప్తు: ఎస్పీ
సాదిక్‌ను కోర్టుకు తరలించే ముందు కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నూకరాజు కుటుంబానికి, ఆయన కుమార్తె సౌజన్యతో సాదిక్‌కు ఉన్న సంబంధం, వారిని ఎలా వేధించింది.. ఇలా పలు విషయాలను వివరించారు. రెండేళ్లుగా సాదిక్, సౌజన్యలు సన్నిహితంగా ఉంటున్నారని ఎస్పీ తెలిపారు. ఇస్లాం మతంలోకి మారాలని సౌజన్యను సాదిక్ ఇబ్బంది పెట్టినట్టుగా సమాచారం ఉందని, దానిపైనా కేసు నమోదు చేశామన్నారు. మృతుల మరణ వాంగ్మూలంలో రాసిన విషయాలు, నూకరాజు కుటుంబసభ్యులకు నిందితుడి బెదిరింపులు తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. మొబైల్ ఫోన్‌లు, డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ పుటేజీ, కాల్‌డేటా, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నామన్నారు. ‘రాజమండ్రి రెండో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్న నూకరాజు, ఆమె కుమార్తె రాసిన సూసైడ్ నోట్లలో.. తమ చావుకి సాదిక్‌నే కారణమని, అతడి వేధింపుల వల్లే తామంతా ఆత్మహత్య చేసుకుంటున్నామని, తన భర్త జగదీశ్వరరెడ్డిని సాదిక్ కెమికల్ పాయిజన్ ఇచ్చి చంపాడని ప్రస్తావించారు. వాటి ఆధారంగా జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కరరెడ్డి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 17న ఫిర్యాదు చేశారు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత నిందితుడి ఆచూకీ కోసం జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) మహంతి కిశోర్ కుమార్ ఆద్వర్యంలో ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ బృందాలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ చేరుకుని, స్థానిక పోలీసుల సహకారంతో ఈనెల 22న నౌచండి పోలీసుస్టేషన్ పరిసర ప్రాంతంలో సాదిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం మీరట్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచి, ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని కాకినాడ తీసుకొచ్చారని ఎస్పీ వివరించారు. నిందితుడిని పట్టుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందాలను ప్రశంసించారు.
నా కుమారుడి మృతిలో నా కోడలి పాత్ర ఉంది!సౌజన్య మామ భాస్కరరెడ్డి సంచలన ఆరోపణ
రావులపాలెం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): తన కుమారుడు జగదీశ్వరెడ్డి మృతి కేసులో సాదిక్‌తో పాటు తన కోడలి పాత్ర కూడా ఉందని సౌజన్య మామ భాస్కరరెడ్డి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తన కుమారుడిని సాదిక్ హత్య చేశాడని, అతనికి వేరే వాళ్లు సహకరించారని ఆయన ఆరోపించారు. సోమవారం భాస్కరరెడ్డి మాట్లాడుతూ తన కోడలి పాత్ర కూడా ఉందని చెప్పడం సంచలనంగా మారింది. అలాగే తన మనవడు రియాన్ష్‌రెడ్డికి కూడా సాదిక్ కారణంగా ప్రాణహాని ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. రియాన్ష్‌కు ఏదైనా పాయిజన్ ఎక్కించారేమోనని తెలుసుకునేందుకు రక్తపరీక్షలు చేయించేందుకు సిద్ధ్దమవుతున్నామని తెలిపారు. సాదిక్ వద్ద ఉన్న తన కుమారుడి ఆస్తులను తన మనవడికి అప్పగించేలా చేయాలని కోరారు.