ఏపీకి ఎంతిస్తే..మాకూ అంతే నీరివ్వాలి!
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:14 AM
కృష్ణా జలాలను ఏపీకి ఎంత కేటాయిస్తే.. అంతే మొత్తంలో తమకూ కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. దీంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు..
అక్టోబరు దాకా తాగునీటికి 47 టీఎంసీలు కోరిన ఆంధ్ర
ఈ ఏడాదికి 112 టీఎంసీలు డిమాండ్ చేసిన తెలంగాణ
తమ వాటాను రిజర్వాయర్లలో నిల్వ చేయాలని వినతి
ఆ రాష్ట్ర వాదన సమ్మతం కాదని ఏపీ స్పష్టీకరణ
వచ్చే నెల 4కి వాయిదా వేసిన కేఆర్‌ఎంబీ
అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలను ఏపీకి ఎంత కేటాయిస్తే.. అంతే మొత్తంలో తమకూ కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. దీంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ భేటీ అర్ధంతరంగా వాయిదాపడింది. సోమవారం హైదరాబాద్ జల సౌధలో కేఆర్‌ఎంబీ చైర్మన్ సుభ్రాంశు బిశ్వాస్, ఏపీ ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ రమేశ్‌కుమార్ సమావేశమయ్యారు. అక్టోబరు దాకా తాగునీటి అవసరాలకు 47 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే 70 శాతం కృష్ణా జలాలను తమకు కేటాయించాలని.. ఏపీకి 30 శాతమే ఇవ్వాలని తెలంగాణ పట్టుబట్టింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున 50 శాతం తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు తెలిపింది. తాము 3-4 నెలలకు అవసరాలకు నీటి లెక్కలు వేయబోమని.. ఏడాదికి అవసరమయ్యే 112 టీఎంసీలను తమకు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేసింది. తమకు కేటాయించిన జలాలను ‘డిమార్కేషన్’ చేసి జలాశయాల్లో నిల్వ చేయాలని బోర్డును కోరింది. తెలంగాణ డిమాండ్లను ఏపీ తోసిపుచ్చింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. ఎగువన భారీ వర్షాలు లేని నేపథ్యంలో శ్రీశైలం. నాగార్జునసాగర్ డ్యాంలలోకి ఈ ఏడాది భారీ ప్రవాహాలు రాలేదని.. అందుచేత ఖరీఫ్ పంటలకు సాగునీరివ్వలేమని బోర్డు ముందే తేల్చిచెప్పింది. అందుబాటులో ఉన్న జలాలను 2027 మే నెల వరకూ తాగునీటి అవసరాలకు మాత్రమే కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఇందుకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. కేఆర్‌ఎంబీకి ఇండెంట్ సమర్పించాయి.
ఏపీ ఇండెంట్ ఇదీ.. తాగునీటి అవసరాల కోసం అక్టోబరు దాకా 47 టీఎంసీలు కావాలని బోర్డు త్రిసభ్య కమిటీని ఏపీ కోరింది. ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 22 టీఎంసీలు, శ్రీశైలం నుంచి హంద్రీ-నీవా కాలువ ద్వారా 10 టీఎంసీలు, నాగార్జునసాగర్ కుడి కాలువ కింద 7 టీఎంసీలు, ఎడమ కాలువ నుంచి ఒక టీఎంసీ, కృష్ణా డెల్టా సిస్టమ్‌కు 6 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తిచేసింది. ఇందుకు బోర్డు సూత్రప్రాయంగా అంగీకరించింది. తమకు ఏడాదికి సరిపడా 112 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. అయితే జలాశయాల్లో ఉన్న నీటిని తాగు అవసరాల కోసం కృష్ణా ట్రైబ్యునల్ కేటాయించిన దామాషా మేరకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ తేల్చిచెప్పింది. బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు చేసిన వాదనలను ఆ రాష్ట్రం కేఆర్‌ఎంబీ భేటీలో ప్రస్తావించడాన్ని గట్టిగా వ్యతిరేకించింది. కేటాయింపులపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చైర్మన్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా వేశారు. అప్పటిదాకా తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం జలాశయం నుంచి ప్రస్తుత దామాషాలోనే రెండు రాష్ట్రాలకూ విడుదల చేయాలని ఆదేశించారు.