మూలకుపడిన స్మార్ట్‌కార్డులు
ABN , Publish Date - Nov 12 , 2026 | 08:10 AM
హైదరాబాద్ జిల్లాలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది లబ్ధిదారులు పోర్టబిలిటీ కింద ఒక చోట రేషన్ సరుకులు తీసుకుంటుండగా, వారికి సంబంధించిన కార్డులు మరో చోట ఉంటున్నాయి.
రేషన్ ఇక్కడ.. కార్డులు అక్కడ..
తీసుకోవడానికి వెళ్లని లబ్ధిదారులు
పంపిణీలో కొందరు డీలర్ల అలసత్వం
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ జిల్లాలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది లబ్ధిదారులు పోర్టబిలిటీ కింద ఒక చోట రేషన్ సరుకులు తీసుకుంటుండగా, వారికి సంబంధించిన కార్డులు మరో చోట ఉంటున్నాయి. ఫలితంగా రూ.లక్షలు వెచ్చించి ప్రింటింగ్ చేయించిన కార్డులు షాపుల్లో మూలకుపడ్డాయి. కొందరు డీలర్లు సైతం తమ వద్ద ఉన్న కార్డులను పంపిణీ చేయడంలో అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్టు కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో ముద్రించడంతో పాటు కార్డుపై క్యూఆర్ కోడ్‌ను పెట్టింది. కార్డులు అందుబాటులోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా.. ఇంకా పంపిణీ ప్రక్రియ పూర్తిస్థాయిలో చేయని పరిస్థితి నెలకొంది.
ఇంకా 25 శాతం పెండింగ్‌లోనే..
జిల్లాలోని 16 మండలాల పరిధిలోని 683 రేషన్ దుకాణాలున్నాయి. ఇందులో భాగంగా కార్డుల్లోని లెక్కల ప్రకారం మొత్తం 8,43,048 మంది లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులను ప్రింట్ చేయించారు. ఈ క్రమంలో తొలుత సర్కిళ్లలోని సహాయ పౌరసరఫరాలశాఖ అధికారి కార్యాలయాన్ని సంప్రదించి అక్కడ అవసరమైన ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఇతర పత్రాలను సమర్పించి స్మార్ట్‌కార్డులను పొందాలని అధికారులు సూచించారు. అక్కడి ఆఫీసుకు వెళ్లి తీసుకోవడంలో చాలామంది ఆసక్తి చూపించకపోవడంతో కొన్ని రోజుల క్రితం వాటిని సంబంధిత డీలర్లకు అప్పగించారు. డీలర్ల నుంచి కార్డులు తీసుకెళ్లాలని సూచించినప్పటికీ ఇంకా కొందరు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
పోర్టబిలిటీ కింద (ఇతర రేషన్ దుకాణాల నుంచి సరుకులు) తీసుకుంటున్న వారు తమ సొంత షాపుల వద్దకు వెళ్లకపోవడంతో కార్డులు వృథాగా పడి ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని మొత్తం 8,43,048 కార్డుల్లో ఇప్పటివరకు 6,28,000 పంపిణీ చేయగా.. మరో 2,15,048 కార్డులు (25శాతం) పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముషీరాబాద్, ఆసి్‌ఫనగర్, గోల్కొండ, బండ్లగూడ, బహదూర్‌పురా, చార్మినార్, నాంపల్లి మండలాల్లోని లబ్ధిదారులు ఉన్నట్లు తెలిసింది.
డీలర్లు సైతం..
కార్డులను పంపిణీ చేయడంలో కొంతమంది డీలర్లు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పరిధిలోని లబ్ధిదారులకు ఇవ్వాల్సిన కార్డులను తమ వద్దే ఉంచుకోవడంతో వాటికోసం కొందరు నిత్యం తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి దుకాణాలు మూసి ఉండగా.. మరోసారి సరుకుల పంపిణీలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారని పలువురు వాపోతున్నారు.
కార్డులు తీసుకెళ్లాలి
స్మార్ట్ రేషన్‌కార్డులను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటివరకు కార్డులు పొందని వారు తమకు సంబంధించిన రేషన్ దుకాణాలకు వెళ్లి తీసుకోవాలి.
శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు.. క్యూలైన్ శిలాతోరణం వరకు..
క్యూర్ పరిధిలో 8 క్లౌడ్ కిచెన్ల లైసెన్స్‌లు రద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News