Share News

స్వచ్ఛ నగరం విశాఖ

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:12 AM

దేశంలోనే పరిశుభ్రతకు పర్యాయపదంగా ఆంధ్రప్రదేశ్‌ నగరాలు నిలిచాయి. పరిశుభ్రత మేనేజ్‌మెంట్‌లో జాతీయ స్థాయిలో ఏపీ నగరాలు తిరుగులేని ఆధిపత్యాన్ని చాటాయి

స్వచ్ఛ నగరం విశాఖ

  • దేశంలోనే అగ్రగామిగా నిలిచిన జీవీఎంసీ

  • మూడో స్థానంలో నిలిచిన గుంటూరు

  • జాతీయ స్వచ్ఛ నగరాల్లో విజయవాడకు మూడో ర్యాంకు

  • రాష్ట్రస్థాయిలో ‘మొదటి స్వచ్ఛ నగరం’గా రాజమండ్రి

  • స్వచ్ఛ షెహర్‌ జోడీల్లో కుప్పం, తిరుపతికి 3వ ర్యాంకు

  • అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దేశంలోనే పరిశుభ్రతకు పర్యాయపదంగా ఆంధ్రప్రదేశ్‌ నగరాలు నిలిచాయి. పరిశుభ్రత మేనేజ్‌మెంట్‌లో జాతీయ స్థాయిలో ఏపీ నగరాలు తిరుగులేని ఆధిపత్యాన్ని చాటాయి. ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛ షెహర్‌’ పోటీల్లో (పది లక్షలపైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో) విశాఖపట్నం సర్వశ్రేష్ఠ ప్రతిభతో దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. విశాఖ బాటలోనే ఇతర నగరాలూ పోటీపడి అత్యుత్తమ ర్యాంకులు సాధించాయి. జాతీయ స్థాయిలో గుంటూరు కార్పొరేషన్‌ (3-10 లక్షల జనాభా కేటగిరీ) మూడో స్థానంలో నిలిచి సత్తాచాటగా, జాతీయ స్వచ్ఛ నగరాల జాబితాలో విజయవాడ 3వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఇక రాష్ట్రస్థాయిలో రాజమండ్రి నగరం ‘మొదటి స్వచ్ఛ నగరం’గా ప్రత్యేక గుర్తింపు పొందగా... పారిశుధ్య భాగస్వామ్య విభాగమైన ‘స్వచ్ఛ షెహర్‌ జోడి’లో కుప్పం, తిరుపతి దేశంలోనే 3వ ర్యాంకులో నిలిచాయి. బుధవారం కేంద్ర పట్టణాభివృద్థి శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నగరాలకు ఈ కార్యక్రమంలో అవార్డులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ సాధించిన అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్థి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, అధికారులు అందుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో అధికారులతో కలిసి ఆ వివరాలను నారాయణ మీడియాకు వివరించారు. రాష్ర్టానికి దక్కిన పురస్కారాలతోపాటు మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్థి కార్యక్రమాల వివరాలను మంత్రి వెల్లడించారు.


25 శాతం పురస్కారాలు ఏపీకే: నారాయణ

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ విశేష ప్రతిభ కనబరిచిందని మంత్రి నారాయణ చెప్పారు. జాతీయ స్థాయిలో ఏకంగా 25 శాతం పురస్కారాలను ఏపీ కైవసం చేసుకుందన్నారు. గతంలో 78 అవార్డులకుగాను ఏపీకి కేవలం ఐదు లభించగా, ఈ ఏడాది ప్రకటించిన 60 పురస్కారాల్లో 6 దక్కాయని చెప్పారు. హిల్‌స్టేషన్లు, రివర్‌ సిటీలు, కోస్టల్‌ సిటీలు తదితర వర్గాల వారీగా ఈ పురస్కారాలను కేటాయించారని తెలిపారు. గతేడాది రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాలకుగాను 39 అవార్డులకు అర్హత సాధించగా 5 మాత్రమే దక్కాయని (సుమారు 12.5శాతం), ఈసారి 24 మున్సిపాలిటీలు పోటీపడి 6 అవార్డులు సొంతం చేసుకున్నాయని వివరించారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుత ప్రగతికి కారణం సీఎం చంద్రబాబేనని, ఆయన కృషితోనే ఇది సాధ్యమైందని నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్రంలో 153 లక్షల టన్నుల లెగసీ చెత్త పేరుకుపోయిందని, తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదే అందులో దాదాపు 85 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించిందని తెలిపారు. మొత్తం 153 లక్షల టన్నుల చెత్తను తొలగించడంతో ఆంధ్రప్రదేశ్‌ నేడు ‘‘లెగసీ ఫ్రీ స్టేట్‌’’గా నిలిచిందన్నారు. ప్రతి ఇల్లు, వంటగది, శౌచాలయాల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేయడానికి ప్రతి పురపాలక సంఘంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, రాబోయే ఆరు నెలల్లో ఇవి పూర్తవుతాయని మంత్రి వివరించారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం మేర పచ్చదనం సాధించాలనే లక్ష్యంతో ప్రతి ఐదు మీటర్లకు ఒక మొక్క నాటేలా ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. పార్కులు, జలాశయాల అభివృద్థికి అధిక ప్రాధాన్యమిస్తూ ‘హ్యామ్‌’ ప్రాజెక్టు కింద రూ.900 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.


విజేతలుగా నిలిచిన నగరాలు ఇవే

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌: స్వచ్ఛ షెహర్‌-1వ ర్యాంక్‌ (పది లక్షలకుపైగా జనాభా కేటగిరీ)

విజయవాడ: జాతీయ స్వచ్ఛ నగరాల జాబితాలో 3వ ర్యాంక్‌

గుంటూరు: స్వచ్ఛ షెహర్‌ - 3వ ర్యాంక్‌

(3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీ)

రాజమండ్రి: రాష్ట్రంలోనే మొదటి స్వచ్ఛ నగరంగా ప్రత్యేక గుర్తింపు (ప్రామిసింగ్‌ స్వచ్ఛ షెహర్‌)

తిరుపతి: స్వచ్ఛ షెహర్‌ జోడి విభాగంలో 3వ ర్యాంక్‌

కుప్పం: స్వచ్ఛ షెహర్‌ జోడి విభాగంలో 3వ ర్యాంక్‌

ఇవి కూడా చదవండి..

వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి

దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 12 , 2026 | 06:17 AM