24/7.. ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్!
ABN , Publish Date - Jul 09 , 2026 | 10:37 AM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లు-2026లో నైట్ ఎకానమీ(రాత్రి వేళ ఆర్థిక కార్యకలాపాలు)కి చట్టబద్ధత కల్పించనున్నారు.
క్యూర్ బిల్లులో ‘నైట్ ఎకానమీ‘కి చట్టబద్ధత!
నగర ఆర్థిక వ్యవస్థకు ఊపు
ఉపాధి, పర్యాటకం, వ్యాపారాభివృద్ధికి ప్రత్యేక జోన్లు
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు
తనిఖీలకు, ప్రజారోగ్య భద్రతకు ప్రత్యేక నిబంధనలు
హైదరాబాద్ సిటీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లు-2026లో నైట్ ఎకానమీ(రాత్రి వేళ ఆర్థిక కార్యకలాపాలు)కి చట్టబద్ధత కల్పించనున్నారు. హైదరాబాద్‌ను 24/7 ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. మొత్తం ప్రాంతాన్ని లేదా ఎంపిక చేసిన ప్రాంతాలను నైట్ ఎకానమీ జోన్‌గా ప్రకటించవచ్చు. ఏయే వ్యాపారాలు నిర్వహించవచ్చో, అవి ఏ సమయాల వరకు పనిచేయవచ్చో ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్దేశిస్తుంది. రెస్టారెంట్లు, హోటళ్లు, రిటైల్ దుకాణాలు, షాపింగ్ కేంద్రాలు, వినోద సంస్థలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటక కార్యకలాపాలు, రాత్రి మార్కెట్లు, ఈవెంట్లు తదితర రంగాలకు ఈ విధానం వర్తించే అవకాశం ఉంది.
లైసెన్స్ తప్పనిసరి
నైట్ ఎకానమీ పరిధిలో కార్యకలాపాలు నిర్వహించే ప్రతీ సంస్థ కమిషనర్ నుంచి లైసెన్స్ లేదా అనుమతి పొందాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు కార్పొరేషన్ నిర్ణయించే ఫీజును చెల్లించాలి. వ్యాపారం స్వభావం, సంస్థ పరిమాణం, సేవల రకం, వృత్తి ఆధారంగా వేర్వేరు కేటగిరీలకు వేర్వేరు ఫీజులను నిర్ణయించే అధికారం కార్పొరేషన్‌కు ఉంటుంది. నిబంధనలను పాటించకపోయినా, క్యూర్ చట్టం, నిబంధనలు లేదా బై-లాలను ఉల్లంఘించినా కమిషనర్ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు.
నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు కమిషనర్ లేదా ఆయన నియమించిన అధికారులకు అనుమతి ఉంటుంది. తనిఖీకి ముందు నోటీసు ఇవ్వడంతో పాటు యజమాని లేదా ప్రతినిధి సమక్షంలోనే తనిఖీ నిర్వహించాలి. ప్రజారోగ్యానికి లేదా ప్రజా భద్రతకు తక్షణ ప్రమాదం ఉందని కమిషనర్ భావిస్తే ముందస్తు నోటీసు లేకుండానే తనిఖీలు నిర్వహించే వెసులుబాటు బిల్లులో కల్పించారు. తనిఖీలో ఉల్లంఘనలు బయటపడితే లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు. చట్టంలో పేర్కొన్న జరిమానాలను కూడా విధించవచ్చు.
భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
నైట్ ఎకానమీ జోన్ల అమలులో ప్రజారోగ్యం, ప్రజాభద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, శబ్ధకాలుష్య నియంత్రణ, అత్యవసర సేవలు, పరిశుభ్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బిల్లు స్పష్టం చేస్తోంది. ఒకవైపు నగర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు మరోవైపు పౌరుల జీవన నాణ్యతకు భంగం కలగకుండా సమతుల్య విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
దుబాయ్, సింగపూర్ తరహాలో..
ప్రపంచంలోని దుబాయ్, సింగపూర్, లండన్ వంటి నగరాల తరహాలో హైదరాబాద్‌లో కూడా రాత్రి వేళల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడులు పెరుగుతాయని సర్కారు భావిస్తోంది. పర్యాటక రంగం విస్తరించడంతో పాటు లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, హాస్పిటాలిటీ, రిటైల్, వినోద, రవాణా, ఫుడ్ సర్వీస్ రంగాలకు ఈ విధానం ఊతమివ్వనుంది.
సడలింపులు.. ప్రోత్సాహకాలు..
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల్లో ఉన్న పని వేళలకు ప్రభుత్వం అవసరమైతే సడలింపులు లేదా పొడిగింపులు ఇవ్వవచ్చు. అలాగే నైట్ ఎకానమీ జోన్లలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశం కూడా బిల్లులో కల్పించారు. ఈ వెసులుబాట్లు పూర్తిగా షరతులకు లోబడి ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News