Share News

4,962 ఎకరాల సేకరణ

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:02 AM

హైదరాబాద్‌ మహానగరానికి మరో మణిహారంగా భావిస్తున్న రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

4,962 ఎకరాల సేకరణ

  • ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం కోసం 90 గ్రామాల్లో..

  • అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోనే 1,869 ఎకరాలు

  • 201 కి.మీ. రోడ్డు నిర్మాణం.. 14,577 కోట్ల అంచనా

  • భూముల పరిహారానికి అదనపు కేటాయింపులు

  • వికారాబాద్‌లో భూ సేకరణ నోటిఫికేషన్‌ జారీ

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

హైదరాబాద్‌ మహానగరానికి మరో మణిహారంగా భావిస్తున్న రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దక్షిణ భాగంలో ఆరు జిల్లాల పరిధిలో 201 కి.మీ. పొడవైన ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు. దీంట్లో భాగంగా 90 గ్రామాల్లో 4,962.42 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే వికారాబాద్‌ జిల్లాలో జారీ కాగా ఒకటి రెండు రోజుల్లో మిగతా జిల్లాల్లో నోటిఫికేషన్ల జారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణ బాధ్యతలను హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడర్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) పర్యవేక్షించనుంది.


హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రిక్విజిషనింగ్‌ అథారిటీగా వ్యవహరిస్తోంది. దక్షిణ భాగం భూసేకరణకు హెచ్‌ఎండీఏ జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ (క్యూర్‌), ఎస్టేట్‌ ఆఫీసర్‌ భూసేకరణ ప్రతిపాదనలను కలెక్టర్లకు పంపారు. కలెక్టర్లు భూసేకరణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా భూసేకరణ అధికారులను, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ పక్రియ చేపట్టారు. రెండో విడత దక్షిణ భాగం పనులు ఇప్పుడు ప్రారంభం కానున్నాయి.


దీంట్లోభాగంగా హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలోని సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు 201 కి.మీ. పనులు చేపడతారు. గతంలో దక్షిణ భాగంలో 181.87 కి.మీ.ల పొడవైన రోడ్డు నిర్మాణం జరపాలని నిర్ణయించగా ఇప్పుడు దీనిని 201 కి.మీ.లకు పెంచారు. 100 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం రూ.14,557 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. భూసేకరణ కోసం అదనంగా నిధులు కేటాయిస్తున్నారు. భూములు కోల్పోతున్న వారికి ఇచ్చే పరిహారానికి సంబంధించిన నిధులు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.


కాగా, భూసేకరణను జాతీయ రహదారుల చట్టం కింద కాకుండా రాష్ట్ర భూసేకరణ చట్టం కింద జరుపుతున్నారు. ఈ చట్టంలోని 2, 3 అధ్యాయాల నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో గ్రామాల్లో సామాజిక ప్రభావ అధ్యయనం, నిపుణుల కమిటీ మదింపు వంటి దశలు లేకుండానే నేరుగా భూసేకరణ చేస్తున్నారు. దక్షిణ ప్రాంత రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ట్రాఫిక్‌ సర్వే కూడా పూర్తి చేసి వివరాలను కేంద్ర రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వశాఖకు పంపించారు.


రంగారెడ్డిలో అత్యధికం.. సంగారెడ్డిలో అతి తక్కువ

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగంలో 201 కి.మీ.ల రోడ్డు నిర్మాణం కోసం 4,962.42 ఎకరాలను సేకరిస్తున్నారు. అంటే ప్రతి కిలోమీటర్‌కు దాదాపు 25 ఎకరాల భూమి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 1869.30 ఎకరాలు సేకరిస్తున్నారు (ఇది మొత్తం భూమిలో 37.7ు). ఏడు మండలాలు 28 గ్రామాల పరిధిలో ఇది జరగనుంది. అతి తక్కువగా సంగారెడ్డి జిల్లాలో 327.09 ఎకరాలు (6.6ు) సేకరిస్తున్నారు. దక్షిణ భాగం రీజినల్‌ రింగురోడ్డు పరిధిలోని జిల్లాలు.. రంగారెడ్డి, వికారాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి.


దక్షిణ భాగం ఆర్‌ఆర్‌ఆర్‌.. జిల్లాల వారీగా భూసేకరణ

జిల్లా

పొడవు

(కి.మీ.లు)

మండలాలు

గ్రామాలు

ఎకరాలు

రంగారెడ్డి

75.67

7

28

1,869.30

వికారాబాద్‌

41.20

4

23

1,016.27

నల్లగొండ

33.16

4

14

818.36

మహబూబ్‌నగర్‌

22.11

1

11

544.10

భువనగిరి

15.66

2

07

387.30

సంగారెడ్డి

13.20

2

07

327.09

మొత్తం

201

20

90

4,962.42


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 04:03 AM