టెలిగ్రామ్ ద్వారా మ్యూల్ ఖాతాల దందా.. హైదరాబాద్‌లో యువకుడి అరెస్ట్
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:36 PM
మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ మోసాలకు సంబంధించిన డబ్బు మళ్లిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టుచేశారు.
హైదరాబాద్, నవంబర్ 21: మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ మోసాలకు సంబంధించిన డబ్బును మళ్లిస్తున్న ఓ గ్యాంగ్ గుట్టురట్టు అయింది. టెలిగ్రామ్ వేదికగా మ్యూల్ ఖాతాలను సేకరించి సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న భూమేశ్ అనే యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ దందా నడుపుతున్న కీలక సూత్రధారి అదరావేణి చందు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
పోలీసుల కథనం ప్రకారం.. భూమేశ్ అనే యువకుడు.. టెలిగ్రామ్ వేదికగా వ్యక్తుల నుంచి డెబిట్ కార్డులను సేకరించి.. మ్యూల్ ఖాతాల ద్వారా డబ్బును విత్‌డ్రా చేసి సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా విత్‌డ్రా చేసిన డబ్బును భూమేశ్.. కరీంనగర్‌కు చెందిన అదరావేణి చందు అనే వ్యక్తికి అందిస్తున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. చందు సూచనలతోనే డెబిట్ కార్డులను సేకరించి, నగదును విత్‌డ్రా చేస్తున్నట్లు వెల్లడించాడు.
ఈ లావాదేవీలు పూర్తయ్యాక డెబిట్ కార్డులను ధ్వంసం చేస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకు 10 నుంచి 12 డెబిట్ కార్డులు సేకరించినట్లు నిందితుడు భూమేశ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు డెబిట్ కార్డులను సేకరిస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఐదు డెబిట్ కార్డులు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. భూమేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచారు. నిందితుడికి ఇతర సైబర్ నేరాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దందాలో సూత్రధారి అదరావేణి చందు పరారీలో ఉన్నడని.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎండిపోతున్న పంటలకు సీతారామ ప్రాజెక్టు జలాలు.. తుమ్మల కీలక ఆదేశాలు
ఇబ్రహీంపట్నంలో దారుణం.. మూడు రోజుల క్రితం కాళ్లు, తాజాగా మనిషి తల లభ్యం
Read Latest Telangana News And Telugu News