Share News

‘మెట్రో’లో ఆకతాయిల హల్‌చల్‌

ABN , Publish Date - Aug 26 , 2026 | 07:46 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో నడుస్తున్న మెట్రో రైళ్లలో కొంతమంది ఆకతాయిలు హల్‌చల్‌ చేస్తున్నారు.

‘మెట్రో’లో ఆకతాయిల హల్‌చల్‌
Hyderabad Metro Rail

  • ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తన

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో నడుస్తున్న మెట్రో రైళ్లలో కొంతమంది ఆకతాయిలు హల్‌చల్‌ చేస్తున్నారు. ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పలు సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆకాశమార్గంలో నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో వ్యవస్థను మరింతగా విస్తరించేందుకు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా.. కొంతమంది ఆకతాయిలు చేస్తున్న పనులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


చర్యలు తీసుకుంటున్నా..

కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌(సీబీటీసీ) లాంటి అధునాతన పద్ధతిలో రైళ్లు నడుస్తుంటాయి. ఇందులో లోకో పైలెట్లు ఉన్నప్పటికీ వారు కేవలం ప్రయాణికులు మెట్రోలో ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు మాత్రమే గమనిస్తుంటారు. సెన్సార్‌ విధానంతో డోర్ల లాకింగ్‌లో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా.. అనే విషయాలను పరిశీలిస్తుంటారు. మిగతా ఆపరేషన్‌ అంతా ఆటోమేటిక్‌గా జరుగుతుంటుంది. బోగీలోకి ఎక్కిన తర్వాత ఆకతాయిల అసభ్య ప్రవర్తనతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఘటనలపై మెట్రో అధికారులకు ఫిర్యాదు చేస్తుండడంతో పోలీసుల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొంతమంది ఆకతాయిలు తాము మారబోమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.


city1.jpgజరిగిన సంఘటనలు

  • 2023 ఆగస్టు 25న ప్రకాష్ నగర్‌ స్టేషన్‌లో సీల్‌చేసిన మద్యం సీసాలతో ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. గమనించిన మెట్రో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌పై దాడి చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు.

  • 2026 జూన్‌ 1న నాగోల్‌ నుంచి రాయదుర్గంకు వెళ్తున్న రైలులో ఓ ప్రయాణికుడు మెట్రో కిటికీ, సీటు మధ్య కాలు పెట్టి ప్రయాణికులు కూర్చోకుండా ఇబ్బంది పెట్టాడు. అభ్యంతరం వ్యక్తం చేసిన వారితో వాగ్వాదానికి దిగాడు. దీనిపై మెట్రో అధికారులు అతడికి రూ.250 జరిమానా విధించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


  • ఎల్‌బీనగర్‌ నుంచి ఎర్రగడ్డ వెళ్తున్న మెట్రోలో ఓ యువతి పట్ల ఈనెల 23న ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అతడిపై మెట్రో సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


చర్యలు తీసుకోవాలి

మెట్రోలో కొందరు ఆకతాయిలు ప్రవర్తిస్తున్న తీరు మహిళా ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. రైళ్లలో సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే మెట్రో ప్రతిష్టకు భంగం వాటిల్లుతోంది. మెట్రో ఉన్నతాధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలి.

  • కేఎస్‌ ప్రదీప్‌, మెట్రో ప్రయాణికుల సంఘం నాయకుడు


ఈ వార్తలు కూడా చదవండి:

కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 07:46 AM