రామాంతపూర్ జ్యువెల్లరీ వ్యాపారి కిడ్నాప్ కేసులో 9 మంది నిందితుల అరెస్ట్.. రూ. కోటి స్వాధీనం
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:28 PM
హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్‌లో కిడ్నాప్‌కు గురైన జ్యువెల్లరీ వ్యాపారి శ్రీనివాసరావు కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి మీడియా సమావేశంలో వెల్లడించారు.
హైదరాబాద్, అక్టోబర్ 17: నగరంలోని రామాంతపూర్‌కు చెందిన జ్యువెల్లరీ వ్యాపారి శ్రీనివాసరావు కిడ్నాప్ కేసును చిక్కడపల్లి పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసుకు సంబంధించి 9 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
నగరంలోని రామాంతపూర్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారిని కొందరు నిందితులు 2026 అక్టోబర్ 5న గోల్నాక ఫ్లైఓవర్ సమీపంలో కిడ్నాప్ చేశారు. పోలీసులమని నమ్మించి బాధితుడిని వాహనంలో ఎక్కించుకున్నారు. అనంతరం కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతంలో నిర్భందించారు. బాధితుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి రూ.15 కోట్లు డిమాండ్ చేసి.. వారి నుంచి రూ.1.30 కోట్లు వసూలు చేశారు. అనంతరం బాధితుడిని నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశారు. ఈ మేరకు ఫోన్ సిగ్నల్, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పాత కక్షలతోనే శ్రీనివాసరావును కిడ్నాప్ చేసినట్లు నిందితులు అంగీకరించారు.
కాగా.. నిందితుల నుంచి రూ.1.07 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దానితోపాటు సుమారు 97.09 గ్రాముల బంగారం, 3 గ్రాముల వెండి, బొలెరో, ఎర్టిగా, కియా సెల్టోస్ సహా ఐదు వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. నకిలీ నెంబర్ ప్లేట్లతో వాహనాలు మార్చుతూ పోలీసులకు చిక్కకుండా నిందితులు యత్నించినట్లు తెలిపారు. గతంలోనూ ఈ నిందితులపై కిడ్నాప్, దోపిడీ, మోసం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
ఈ వార్తలూ చదవండి
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. మినీ బస్సు ప్రమాదంలో 8 మంది మృతి..
ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 100వ స్థానం