Share News

20 ఫెర్టిలిటీ, ఐవీఎఫ్‌ కేంద్రాలతో లింకులు

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:38 AM

పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల నుంచి నిరుపేద మహిళలను అక్రమంగా తీసుకొచ్చి.. వారి నుంచి అండాలను సేకరించి ఫెర్టిలిటీ, ఐవీఎఫ్‌ కేంద్రాలకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించారు మల్కాజిగిరి పోలీసులు.

20 ఫెర్టిలిటీ, ఐవీఎఫ్‌ కేంద్రాలతో లింకులు
Hyderabad IVF Scam

  • యూపీ, బిహార్‌ తదితర రాష్ట్రాల నుంచి మహిళల అక్రమ రవాణా

  • ఒక్కసారి అండాలు తీసుకుంటామని చెప్పి రూ.30 వేలకు బేరం

  • ఆరోగ్య పరీక్షలంటూ నెలలోనే పది సార్లు సేకరణ.. 30 లక్షలకు విక్రయం

హైదరాబాద్‌ సిటీ, దిల్‌సుఖ్‌నగర్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల నుంచి నిరుపేద మహిళలను అక్రమంగా తీసుకొచ్చి.. వారి నుంచి అండాలను సేకరించి ఫెర్టిలిటీ, ఐవీఎఫ్‌ కేంద్రాలకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించారు మల్కాజిగిరి పోలీసులు. మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. ముఠా బారి నుంచి 48మంది మహిళలను రక్షించారు. నిందితుల నుంచి హార్మోన్‌ ఇంజక్షన్లు, సిరంజిలు, మాత్రలు, బయోమెడికల్‌ వ్యర్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మానవ అక్రమ రవాణాతోపాటు అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ (ఏఆర్‌టీ) యాక్టు-2021 కింద కేసులు నమోదు చేశారు. బేగంపేట ప్రకాశ్‌నగర్‌, సరూర్‌నగర్‌, గోపాలపురం, ఎర్రగడ్డ ప్రాంతాల్లోని పలు హాస్టళ్లలో జరుగుతున్న ఈ అక్రమ దందా వివరాలను మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి బేగంపేటలోని సీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.


రూ.30 వేలు ఇచ్చి రూ.30 లక్షలు పిండుకుంటున్నారు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అమిత్‌ శర్మ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన నికత్‌ పర్వీన్‌, సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌కు చెందిన రేష్మా ఖాతూన్‌, జెఫ్రీ ప్రదీప్‌, ఎస్‌కే పర్వీన్‌, విజయ్‌ భాగ్యారావు, పంకజ్‌ సోనీ ముఠాగా ఏర్పడ్డారు. తొలుత, పశ్చిమ బెంగాల్‌, యూపీ, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల నుంచి పేద మహిళలను గుర్తిస్తారు. ఓసారి అండాలు తీసుకుని మిమ్మల్ని మళ్లీ జాగ్రత్తగా తీసుకొస్తామని నమ్మబలుకుతారు. అందుకు ఒక్కో మహిళకు రూ.20 వేల నుంచి 30 వేల వరకు చెల్లిస్తామని చెబుతారు. అడ్వాన్స్‌గా రూ.10 వేలు ఇస్తారు. రవాణా ఖర్చులు, వసతి, భోజనం, ఇతర వసతులు కల్పిస్తామని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఒక్కసారి మాత్రమే అండాలు తీసుకుంటామని చెప్తున్న ముఠా సభ్యులు.. ఆరోగ్య పరీక్షలంటూ నమ్మించి హార్మోన్‌ ఇంజక్షన్లు ఇస్తున్నారు. 15 రోజుల్లో ఒక్కసారి మాత్రమే అండాలు సేకరించాల్సిన నిందితులు నెలలో పదిసార్లు సేకరిస్తున్నారు. సేకరించిన అండాలను ఒక్కోసారి రూ.3 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. మొత్తం పదిసార్లు సేకరించి.. రూ.30 లక్షలకు ఐవీఎఫ్‌, ఫెర్టిలిటీ కేంద్రాలకు అమ్ముకుంటున్నారు. ఒక్కో మహిళకు రూ.30 వేలు మాత్రమే ఇచ్చి.. వారి నుంచి వచ్చిన అండాలతో రూ.30 లక్షలు పిండుకుంటున్నారు.


నగరంలో 20 ఫెర్టిలిటీ, ఐవీఎఫ్‌ కేంద్రాలతో లింకులు

అండాలు సేకరిస్తున్న ముఠాకు నగరంలోని 12 ఫెర్టిలిటీ సెంటర్లు, 8 వరకు ఐవీఎఫ్‌ కేంద్రాలతో లింకులున్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు. వారిలో ఎంతమంది ఈ ముఠా నుంచి అండాలు కొనుగోలు చేశారనేది ఇంకా తేలాల్సి ఉందని, అందుకే ఆయా కేంద్రాల పేర్లు వెల్లడించడం లేదని తెలిపారు. త్వరలోనే ఆయా కేంద్రాలపై ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి దాడులు చేస్తామని, అన్ని ఆధారాలు సేకరించి అరెస్టు చేస్తామని తెలిపారు.


బిచ్చగాళ్ల వీర్యం సేకరించిన పంకజ్‌ సోనీ ముఠాతో లింకులు

గతంలో బిర్యానీ, డబ్బు ఆశ చూపించి రోడ్డుపక్కన బిచ్చగాళ్లు, జులాయిల నుంచి వీర్యాన్ని సేకరించిన పంకజ్‌ సోనీతో ఈ ముఠాకు లింకులున్నట్లు పోలీసులు తేల్చారు. అరెస్టైన వారిలో పంకజ్‌ సోనీ కూడా ఉన్నాడు. విచారణ కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు. అంతేనా, మహిళలను అక్రమ రవాణా చేసి వసతి గృహాల్లో పెట్టిన తర్వాత ఈ ముఠా సభ్యులు నకిలీ ఆధార్‌లు సృష్టిస్తున్నారు. వారికి ముందే పెళ్లై పిల్లలున్నట్లు, భర్త అంగీకారంతోనే అండాలు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు పత్రాలు సృష్టించి పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

సరగసిపై ఆరా

పోలీసులు రక్షించిన 48 మహిళల్లో కొంతమంది గర్భవతులుగా ఉన్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. వారిని సరగసీకి ఏమైనా ఒప్పించారా..? లేక సాధారణంగానే గర్భం దాల్చారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి మెడికల్‌ సర్టిఫికెట్స్‌ చూసిన తర్వాత, డీఎంహెచ్‌వో స్థాయి అధికారులతో కలిసి విచారణ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 03:44 AM