Share News

అక్రమ అండాల సేకరణ.. కేసులో ఎవరి వాటా ఎంత?

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:00 AM

మానవ అండాల అక్రమ దందా కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

అక్రమ అండాల సేకరణ.. కేసులో ఎవరి వాటా ఎంత?
Human Egg Donation Scam

  • దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

  • నేటి నుంచి 5 రోజులపాటు నిందితుల విచారణ

  • 5 రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు

  • నిందితులకు ఫెర్టిలిటీ సెంటర్లతో లింకులపై ఫోకస్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మానవ అండాల అక్రమ దందా కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను హైదరాబాద్‌కు అక్రమంగా తరలించి, వారి నుంచి అండాలను సేకరించి ఫెర్టిలిటీ, ఐవీఎఫ్‌ కేంద్రాలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 8 మంది నిందితులను అరెస్టు చేసి.. 48 మంది మహిళలను ఆ ముఠా బారి నుంచి కాపాడారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడానికి నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని బేగంపేట, సరూర్‌నగర్‌ పోలీసులు కోరగా.. సికింద్రాబాద్‌ న్యాయస్థానం ఐదు రోజులు పోలీస్‌ కస్టడీకి బుధవారం అనుమతిచ్చింది.


దీంతో వారిని పోలీసులు నేటి నుంచి విచారించనున్నారు. ఈ దందాలో ఎన్ని ఫెర్టిలిటీ, ఐవీఎఫ్‌ కేంద్రాలకు సంబంధం ఉంది..? ఇప్పటివరకు ఎంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు? ఎన్ని అండాలను సేకరించారు..? ఎంత సంపాదించారు? హార్మోన్‌ ఇంజక్షన్లు ఎంతమందికి ఇచ్చారు..? వాటిని ఎవరు సరఫరా చేస్తున్నారు..? అనే అంశాలను నిగ్గుతేల్చనున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్‌శర్మ, పశ్చిమబెంగాల్‌కు చెందిన నిక్కత్‌ పర్వీన్‌, సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌కు చెందిన రేష్మా ఖాతూన్‌, జెఫ్రీ ప్రదీప్‌, ఎస్‌కే పర్వీన్‌, విజయ్‌ భాగ్యారావు, పంకజ్‌ సోనీలు ముఠాగా ఏర్పడి అక్రమ అండాల దందా కొనసాగించారు. బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల నుంచి పేద మహిళలకు డబ్బు ఆశ చూపించి హైదరాబాద్‌కు తీసుకొచ్చేవారు. ఈ ముఠాకు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


ఒక్కసారి మాత్రమే అండాలు సేకరిస్తామని నమ్మించి తీసుకొచ్చి.. బాధిత మహిళలకు హార్మోన్‌ ఇంజక్షన్లు ఇచ్చి ఒక్క నెలలో పదిసార్లు అండాలు సేకరించినట్లు గుర్తించారు. సేకరించిన ప్రతిసారి ఆ అండాలను రూ.3 లక్షలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలా ఒక్కో మహిళ ద్వారా సుమారు రూ.27 లక్షలు కొల్లగొట్టినట్లు అనుమానిస్తున్నారు. బాధితులకు మాత్రం రూ.10 నంచి రూ.20 వేలు మాత్రమే ఇచ్చేవారని గుర్తించారు. నిందితులతో నగరంలోని 20 ఐవీఎఫ్‌, ఫెర్టిలిటీ సెంటర్లకు సంబంధాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. బేగంపేట సరూర్‌నగర్‌, ఎర్రగడ్డ ప్రాంతాల్లోని మహిళా వర్కింగ్‌ హాస్టళ్లలో బాధితులను ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుల్లో కొందరు యువతులు గర్భవతులుగా ఉన్నట్లు సమాచారం. వారిని సరోగసీకి ఒప్పించారా..? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు

ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్‌ సమ్మిట్‌ 2.0

వరి పంట తప్ప..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 05:00 AM