Share News

‘హ్యాండ్‌, ఫుట్‌, మౌత్‌’ డిసీజ్‌ పంజా

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:02 AM

నోట్లో పుండ్లు.. చేతులు, పాదాలు, శరీరంపై ఎర్రటి చిన్నచిన్న పొక్కులు.. మలద్వారం వద్ద ర్యాషెస్‌ వస్తాయి! విపరీతమైన దురద..

‘హ్యాండ్‌, ఫుట్‌, మౌత్‌’ డిసీజ్‌ పంజా
HFMD Symptoms in Children

  • నోట్లో పుండ్లు.. శరీరంపై దద్దుర్లు.. తీవ్రమైన దురద, నొప్పి..

  • తిండి తినలేక అవస్థ.. పదిరోజులపాటు ఇబ్బంది

  • నెల శిశువు నుంచి అయిదేళ్ల పిల్లల దాకా దాని బారిన

  • ఓపీకి రోజుకు 5-6 కేసులు వస్తున్నాయంటున్న వైద్యులు

  • వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తగ్గినవారికీ ముప్పు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): నోట్లో పుండ్లు.. చేతులు, పాదాలు, శరీరంపై ఎర్రటి చిన్నచిన్న పొక్కులు.. మలద్వారం వద్ద ర్యాషెస్‌ వస్తాయి! విపరీతమైన దురద. నోట్లో అల్సర్ల కారణంగా ముద్ద మింగలేని, గుటకవేయలేని పరిస్థితి. ..ఐదేళ్లలోపు పిల్లలకు సోకే హ్యాండ్‌, ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ లక్షణాలివి! కొద్దిరోజులుగా రాజధాని హైదరాబాద్‌లో ఈ కేసులు పెరుగుతున్నాయని.. చిన్నపిల్లలను ఈ ఇన్ఫెక్షన్‌ పట్టిపీడిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో ఓపీకి రోజుకు కనీసం ఐదారు కేసులు వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.


నెల మొత్తం మీద దాదాపు వంద వరకు ఈ సమస్యతో వస్తుంటుంటే అందులో పది మంది వరకు అడ్మిషన్‌ అవుతున్నట్లు చెప్పారు. నోట్లో పుండ్ల కారణంగా పిల్లలు ఏం తినలేక, తాగలేక డీహైడ్రేషన్‌ బారిన పడుతుండడంతో వారిని ఆస్పత్రిలో చేర్చుకుని ఐవీ ఫ్లూయిడ్స్‌ పెట్టాల్సి వస్తోందని వైద్యులు వివరించారు. నాలుక, చేతులు, కాళ్లపై నీటి బుడగల మాదిరిగా పుండ్లు ఏర్పడడం, శరీరంపై ఎర్రటి పొక్కులు రావడంతో కొందరు దీన్ని చికెన్‌ పాక్స్‌, మీజిల్స్‌గా పొరబడుతున్నారు. అయితే ఇది చికెన్‌ పాక్స్‌, మీజిల్స్‌ కాదని వైద్యులు చెబుతున్నారు. కొందరి పిల్లలకు శరీరంపై నీటి బుడగల మాదిరిగా వచ్చి.. పెద్దగా అయ్యి, ఆ తర్వాత పగిలి సోన కారుతుందని, దానిద్వారా వైరస్‌ వేరే పిల్లలకు విస్తరించే ముప్పు ఉందని వారు వివరించారు.


వారు తుమ్మినా, దగ్గినా ఇతరులకు వ్యాపిస్తుందని, నోట్లో అల్సర్‌ రూపంలో బాధపెట్టడం వల్ల సొంగ కారుతుందని, దానిని ఇతరులు ముట్టుకుంటే సోకే ముప్పు ఉందంని పేర్కొన్నారు. నెల రోజుల శిశువు నుంచి అయిదేళ్ల పిల్లలలో ఎవరికైనా ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకవచ్చునని, అయితే ఎక్కువగా ఏడాది నుంచి అయిదేళ్లలోపు పిల్లలు వస్తున్నారని వైద్యులు చెప్పారు. పెద్దలకు కూడా సోకుతుందిగానీ.. సాధారణంగా వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల చాలామందికి ఎలాంటి లక్షణాలూ కనపడవని (అసింప్టమాటిక్‌), కొందరిలో మాత్రం తేలికపాటి లక్షణాలు (స్వల్ప జ్వరం, గొంతు నొప్పి, చేతులు, పాదాల్లో చిన్నచిన్న దద్దుర్లు/బొబ్బల వంటివి) కనిపిస్తాయని వైద్యులు వివరించారు.


పిల్లలకు ఈ సమస్య వచ్చినప్పుడు తట్టు, ఆటలమ్మ అని పొరబడి సంప్రదాయ వైద్యాలతో ఆలస్యం చేయొద్దని.. వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స చేయించాలని సూచించారు. ఈ సమస్య వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుందని, చలికాలం ఆరంభంలో కూడా ఉంటుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వృద్ధులు, గర్భిణులు, హెచ్‌ఐవీ బాధితులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


పరిశుభ్రత పాటించాలి

ఇంట్లో ఎవరికైనా ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకితే.. అది ఇతరులకు వ్యాపించకుండా ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. పిల్లలు వినియోగించే టేబుల్‌, బొమ్మలు, ఇతర వస్తువులను ఎప్పటికప్పుడు తుడవాలి. క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయాలి. ఈ జబ్బు వచ్చిన పిల్లలను ప్రత్యేకంగా ఉంచాలి. ఎవరినీ తాకనివ్వకూడదు. బడికి పంపించకూడదు. ఒక చోట కుదురుగా ఉంచాలి. వారు వేసుకున్న దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికించాలి. పిల్లలు బాత్‌రూమ్‌కు వెళ్లిన ప్రతిసారీ చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పాలి. వారు వెళ్లొచ్చాక బాత్‌రూమ్‌ కడగాలి.


వేగంగా వ్యాపిస్తుంది.. జాగ్రత్త

హ్యాండ్‌, ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఈ వైరస్‌ సోకిన పిల్లల శరీరంపై మొదట చిన్న కురుపుల్లా వచ్చి తర్వాత బుడగలుగా మారుతాయి. దాన్నుంచి స్రావాలు వస్తాయి. ముక్కు నుంచి స్రావాలు, నోటి నుంచి లాలా జలం వస్తుంది. ఇది త్వరగా శరీరంపై విస్తరించే ముప్పు ఉంటుంది. లాలాజలం బయటకు కారడం వల్ల ఇతరులకు సోకే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. వారం రోజులలో వైరస్‌ తీవ్రత తగ్గినప్పటికీ శరీరంపై ఇన్‌ఫెక్షన్‌ ఆనవాళ్లు, మచ్చలు కొన్ని వారాలు, నెలల పాటు ఉండే అవకాశం ఉంటుంది. లక్షణాల ఆధారంగా దీనికి చికిత్స చేస్తాం. ఈ సమస్య వచ్చినవారికి యాంటీబయాటిక్‌ మందులు ఇవ్వక్కర్లేదు. పిల్లల నోటిలో అల్సర్‌ ఏర్పడడం వల్ల ఏం తినలేక, మింగలేక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి.. ఆ పుండ్లు తగ్గడానికి ఓరల్‌ జెల్‌, లూబ్రికేషన్‌ జెల్‌ ఇస్తాం. అలాగే శరీరంపై పొక్కులవల్ల కలిగే దురద, నొప్పి తగ్గడానికి మందులు ఇస్తాం. ఆ సమయంలో ద్రవాహారం ఇవ్వాలి. కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌, మజ్జిగ వంటివి తాగించాలి.

- డాక్టర్‌ సత్యనారాయణ రెడ్డి బత్తుల,

పీడియాట్రిక్‌ ఇంటెన్సివిస్ట్‌, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌


ఈ వార్తలు కూడా చదవండి:

‘కోడ్‌’ కూయక ముందే బదిలీలు?
మెట్రో దిగగానే పాడ్‌ ట్యాక్సీ!
నువ్వు బతికే ఉన్నావా?
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 06:02 AM