నువ్వు బతికే ఉన్నావా?
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:40 AM
తన భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరిన ఓ రైతునుద్దేశించి తహసీల్దార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
పురుగుల మందు తాగలేదా?
ఓ రైతునుద్దేశించి గజ్వేల్ తహసీల్దార్ వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
ఆరు నెలల క్రితం జరిగిన విషయమన్న రైతు
తహసీల్దార్ వల్లే తన భూ సమస్య పరిష్కారమైందని రైతు వెల్లడి
రైతుతో చనువుతోనే మాట్లాడానన్న తహసీల్దార్
గజ్వేల్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తన భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరిన ఓ రైతునుద్దేశించి తహసీల్దార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు ఏసును ఉద్దేశించి ఆ మండల తహసీల్దార్ స్వామి, ‘బతికే ఉన్నావా నువ్వు? పురుగుల మందు తాగలేదా?’ అంటూ వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో తహసీల్దార్ తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ఆ వీడియో ఇప్పటిది కాదని, తహసీల్దార్‌కు, తనకు మధ్య ఆ సంభాషణ ఆరు నెలల క్రితం జరిగిందంటూ రైతు ఏసు శనివారం ఓ వీడియో విడుదల చేశారు. తహసీల్దార్ స్వామి చొరవ తీసుకొని తన సమస్యను పరిష్కరించారని తెలిపారు. ఏసు కుటుంబ సభ్యులకు చెందిన భూమి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో పోతుండగా.. ఆరు నెలల క్రితం క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించడానికి తహసీల్దార్ స్వామి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా రైతు ఏసు ఆయన వద్దకు వచ్చి.. తన భూమికి సంబంధించి బంధువులతో సమస్య ఉందని, దానిని పరిష్కరించాలని కోరారు. లేదంటే పురుగుల మందు తాగడం తప్ప తనకు మరో మార్గం లేదంటూ వాపోయారు.
అనంతరం తహసీల్దార్ స్వామి తన కార్యాలయంలో మక్తమాసాన్‌పల్లి రైతులతో మాట్లాడుతున్న సమయంలో.. ఏసు మాటలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే 30 ఏళ్ల గొడవకు తహసీల్దారే పరిష్కారం చూపారని, ఆయన వల్లే తమకు భూసేకరణ పరిహారం డబ్బులు వచ్చాయని ఏసు తెలిపారు. మరోవైపు తనకు రైతులంటే అమితమైన ప్రేమ ఉందని, ఆ రైతుతో ఉన్న చనువుతో అలా అన్నానే తప్ప.. వేరే ఉద్దేశం లేదని తహసీల్దార్ స్వామి తెలిపారు. దగ్గరుండి ఆయన సమస్య పరిష్కరింపజేశానన్నారు. కాగా, తాము నేరుగా రైతుల సమస్యల్ని పరిష్కరిస్తుండడంతో.. కొందరు వ్యక్తులు తమకు గిట్టుబాటు కావడం లేదన్న అక్కసుతో ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. వీడియోలో కొంత భాగాన్ని మాత్రమే కట్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వాతావరణ మార్పులతో ప్రమాదంలో ప్రజారోగ్యం
విద్యా వ్యాపారం వల్లే పేదరికం
Read Latest AP News And Telangana News And International News And Telugu News