వాతావరణ మార్పులతో ప్రమాదంలో ప్రజారోగ్యం
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:24 AM
వాతావరణ మార్పులు 21వ శతాబ్దంలో మానవ ఆరోగ్యానికి అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారుతున్నాయి. ఒకచోట తీవ్రమైన ఎండలు, మరో చోట కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు..
ఎల్‌నినోతో ఎండలు, వరదలు, కరువు ముప్పు
గర్భిణులు, తల్లులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం
ఈ పరిణామాలతో పేద దేశాల ప్రజలకే నష్టం
‘ది లాన్సెట్’లో అధ్యయన ఆధారిత లేఖలో వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వాతావరణ మార్పులు 21వ శతాబ్దంలో మానవ ఆరోగ్యానికి అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారుతున్నాయి. ఒకచోట తీవ్రమైన ఎండలు, మరో చోట కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు.. ఇంకొన్ని ప్రాంతాల్లో కరువు కరాళ నృత్యం.. ఇలా ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ప్రజారోగ్య వ్యవస్థలపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం మరింత బలపడే అవకాశాల నేపథ్యంలో దక్షిణార్ధ గోళంలో తీవ్ర ఉష్ణ తరంగాలు, కరువు, వరదలు సంభవించే ప్రమాదం పొంచి ఉందని ‘ది లాన్సెట్’లో ప్రచురితమైన అధ్యయన ఆధారిత లేఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ పరిణామాలు గర్భిణులు, తల్లులు, చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు అంటువ్యాధుల వ్యాప్తి ముప్పు ను పెంచుతాయని హెచ్చరించింది. ప్రస్తుత వాతావరణ సంక్షోభాన్ని వెంటనే అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు, దాని సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సమస్యలుగా మాత్రమే చూడలేమని స్పష్టం చేసింది. ఈ విపత్తులు ఒక ప్రాంతానికే పరిమితం కావడం లేదని, ఒక దేశంలో ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే.. మరో దేశంలో ఆహార భద్రత, తాగునీరు, పారిశుధ్యం, వైద్య ేసవలపై ప్రభావం పడే పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించింది.
ఎల్‌నినోతో పెరగనున్న ముప్పులు..
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎల్‌నినో ప్రభావం కూడా కీలకంగా మారింది. దీని ప్రభావం ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా ఉండదని, కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం ఏర్పడితే.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయని లాన్సెట్ కథనం వెల్లడించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రజారోగ్యానికి అదనపు సవాళ్లను విసురుతున్నాయని తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను భరించడంలో దేశాల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నాయని పేర్కొంది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు తక్కువ బాధ్యత వహించే అనేక అల్పాదాయ దేశాల ప్రజలే ఈ పరిణామాల వల్ల అధిక నష్టాలను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. వాతావరణ మార్పులను నియంత్రించేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలుగా చర్చలు, ఒప్పందాలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చర్యలు ఆశించిన స్థాయిలో లేవని కథనం విమర్శించింది. రాజకీయ పరిణామాల కారణంగా గతంలో సాధించిన పురోగతి కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది.
ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలి
వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు మరింత సమన్వయంతో వ్యవహరించాలని లాన్సెట్ కథనం పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలో అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (పీహెచ్‌ఈఐసీ)ని ప్రకటించే విధానాన్ని వాతావరణ సంక్షోభానికి కూడా వర్తింపజేయాలని ప్రతిపాదించింది. ఇప్పుడు సభ్యదేశాలు అధికారికంగా ఈ విధానాన్ని ప్రారంభించే దిశగా చర్య లు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఎబోలా సంబంధిత ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వనరులపై ఒత్తిడి ఉన్నప్పటికీ, వాతావరణ సంక్షోభాన్ని నిర్లక్ష్యం చేయలేమని కథనం పేర్కొంది. విపత్తులు తారస్థాయికి చేరాక స్పందించడం కంటే, ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి నివారణ చ ర్యలు చేపట్టడమే పీహెచ్‌ఈఐసీ వంటి వ్యవస్థల అసలు ఉద్దేశమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సమన్వయంతో చ ర్యలు తీసుకుంటే నష్టాన్ని ఇప్పటికీ తగ్గించవచ్చని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘పాలమూరు-రంగారెడ్డి’లో మరో ముందడుగు
మంత్రాల నెపంతో తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
విద్యా వ్యాపారం వల్లే పేదరికం
Read Latest AP News And Telangana News And International News And Telugu News