మెట్రో దిగగానే పాడ్ ట్యాక్సీ!
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:57 AM
మెట్రో రైలు దిగిన ప్రయాణికుడు కిందికి రాకుండానే, స్టేషన్ నుంచే డ్రైవర్ లేని ‘పాడ్ ట్యాక్సీ’ ఎక్కి నేరుగా ఆఫీసుకు చేరే వ్యవస్థకు ప్రణాళిక సిద్ధమైంది.
ఐటీ కారిడార్, సచివాలయం పరిధిలో 40.82 కి.మీ. నెట్‌వర్క్
2050 నాటికి రోజుకు 20 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా
ముఖ్యమంత్రి రేవంత్‌కు సాధ్యాసాధ్యాల నివేదిక...
పీపీపీలో అమలు యోచన
వ్యయం, చార్జీలు, గడువుపై ఇంకా రాని స్పష్టత
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): మెట్రో రైలు దిగిన ప్రయాణికుడు కిందికి రాకుండానే, స్టేషన్ నుంచే డ్రైవర్ లేని ‘పాడ్ ట్యాక్సీ’ ఎక్కి నేరుగా ఆఫీసుకు చేరే వ్యవస్థకు ప్రణాళిక సిద్ధమైంది. ఐటీ కారిడార్, సచివాలయం, పరిసరాల్లో మొత్తం 40.82 కిలోమీటర్ల పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్) నెట్‌వర్క్‌ను ప్రతిపాదిస్తూ రూపొందిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికను హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. పీపీపీ పద్ధతిలో దీన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
మూడు నెలలు అధ్యయనం చేసిన లీ అసోసియేట్స్ సంస్థ 44.62 కి.మీ., 56.98 కి.మీ. ఆప్షన్లను పరిశీలించి, రెండింటిని కలిపిన 40.82 కి.మీ. ‘హైబ్రిడ్’ నెట్‌వర్క్ అనుకూలమని తేల్చింది. ఇందులో కూకట్‌పల్లి-రాయదుర్గం జోన్‌లో 7.62 కి.మీ., రాయదుర్గం-నాలెడ్జ్ సిటీ జోన్‌లో 12.83 కి.మీ., రాయదుర్గం/హైటెక్ సిటీ- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జోన్‌లో 14.01 కి.మీ., సచివాలయం-ఎన్టీఆర్ మార్గ్ కారిడార్‌లో 6.36 కి.మీ. ఉంటాయి. 2030 నాటికి 34.66 కి.మీ., 2040కి 39.36 కి.మీ, 2050కి పూర్తి నెట్‌వర్క్ అన్నది ప్రతిపాదన.
రోజువారీ ప్రయాణికుల సంఖ్య 2030లో 5.42 లక్షలు, 2040లో 15.47 లక్షలు, 2050లో 20.31 లక్షలకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం 69 కి.మీ. మెట్రో రైలులో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తుండడం గమనార్హం. 2050 అంచనాలో సచివాలయం కారిడార్ వాటా 43,300 మాత్రమే. దేశంలో తొలి పాడ్‌ట్యాక్సీ ప్రాజెక్ట్ ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో నిర్మాణంలో ఉంది. 8.85 కి.మీ. మార్గాన్ని రూ.1,016 కోట్లతో పీపీపీ పద్ధతిలో చేపట్టారు. హైదరాబాద్ ప్రాజెక్ట్ వ్యయం, చార్జీలు, నిర్మాణ గడువు ఇంకా వెల్లడి కాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘కోడ్’ కూయక ముందే బదిలీలు?
ఎక్సైజ్ శాఖకు మళ్లీ ఆయుధాలు
నువ్వు బతికే ఉన్నావా?
Read Latest AP News And Telangana News And International News And Telugu News