Share News

గణనాయకా.. వెళ్లిరా

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:09 AM

సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనాలు.. భక్తుల భజనలు, కోలాటాలు, నృత్యాలు.. గణేశ్‌ మహారాజ్‌ కీ జై అనే నినాదాల మధ్య గౌరీ తనయుడు గంగ ఒడికి చేరాడు.

గణనాయకా.. వెళ్లిరా
Hyderabad Ganesh Immersion 2026

  • హైదరాబాద్‌లో ఘనంగా గణేశ్‌ శోభాయాత్ర

  • మధ్యాహ్నానికే గంగ ఒడికి ఖైరతాబాద్‌ గణపతి

  • జనసంద్రమైన హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు

  • 30 వేలమంది పోలీసులు, 20 డ్రోన్లు, షీ టీమ్‌లతో నిఘా

  • రూ.39 లక్షలు పలికిన బాలాపూర్‌ గణేశుడి లడ్డు

  • రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో 13 మంది మృతి: డీజీపీ

(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)

సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనాలు.. భక్తుల భజనలు, కోలాటాలు, నృత్యాలు.. గణేశ్‌ మహారాజ్‌ కీ జై అనే నినాదాల మధ్య గౌరీ తనయుడు గంగ ఒడికి చేరాడు. ఎప్పటిలాగే హైదరాబాద్‌ మహానగరంలో గణేశ్‌ శోభాయాత్ర వేలాది మంది భక్తుల కోలాహలం, కేరింతల మధ్య శుక్రవారం అద్భుతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా విఘ్నేశ్వరుడి వీడ్కోలు యాత్రలు ఎలాంటి విఘ్నాలు లేకుండా ముగిశాయి. బాలాపూర్‌ గణేశుడు ఈసారి కూడా అందరి దృష్టినీ ఆకర్షించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.


ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలాపూర్‌ గణేశుడి లడ్డు వేలంపాటలో ఈసారి రికార్డు స్థాయిలో రూ.39 లక్షలు పలికింది. శోభాయాత్రలో ఖైరతాబాద్‌ మహాగణపతి ప్రత్యేక ఆక ర్షణగా నిలిచాడు. ఈ మహానిమజ్జన కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు చక్కని సమన్వయంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించారు. పోలీసులు భూమార్గంతోపాటు ఆకాశం నుంచి కూడా నిరంతరం నిఘా ఉంచి శోభాయాత్రను ప్రశాంతంగా పూర్తిచేశారు.


ఉరిమే ఉత్సాహం.. సడలని భక్తి పారవశ్యం

గణేశ్‌ శోభాయాత్ర ఆద్యంతం భక్తుల ఉత్సాహం, భక్తిపారవశ్యంతో కొనసాగింది. ఖైరతాబాద్‌ పంచముఖ సంకటహర గణపతి శోభాయాత్ర సమయంలో సాగర తీరం జనసంద్రంగా మారింది. హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌, సఫిల్‌గూడ, ఐడీఏ బొల్లారం తదితర ప్రధాన కేంద్రాలతోపాటు కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలోని 140 చోట్ల గణపతి విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. రాణిగంజ్‌ వైపు నుంచి వచ్చిన 20 అడుగుల విగ్రహం ట్యాంక్‌బండ్‌ ప్రవేశ ద్వారం (కమాన్‌) వద్ద చిక్కుకోవటంతో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.


నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, డీజీపీ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రియాంక ఆల హెలికాప్టర్‌ ద్వారా శోభాయాత్ర, హుస్సేన్‌సాగర్‌ వద్ద నిమజ్జన పర్వాన్ని పరిశీలించారు. గతేడాదితో పోలిస్తే ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర 3.30 గంటలు ఆలస్యంగా ఉదయం 9.35 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.43 గంటలకు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని 4వ నెంబరు క్రేన్‌ వద్ద నిమజ్జనం చేశారు. మహాగణపతి శోభాయాత్రలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మహిళా కానిస్టేబుళ్లతో కలిసి ప్యారడైజ్‌ సినిమాలోని ఆయాషేర్‌ పాటకు స్టెప్పులేశారు.


15 వేలమంది పారిశుద్ధ్య కార్మికుల సేవలు

హుస్సేన్‌సాగర్‌కు వచ్చే భక్తుల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ 600 బస్సులు, రైల్వే శాఖ అదనపు ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు నడిపాయి. మెట్రో రైళ్లు రాత్రి 2 గంటల వరకు నడిచాయి. 303 కి.మీల శోభాయాత్ర మార్గంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించేందుకు సుమారు 15 వేల మంది పారిశుధ్ధ్య కార్మికులు విధులు నిర్వహించారు. ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో 200 మంది గజ ఈతగాళ్లు, బోట్లు అందుబాటులో ఉంచారు. శోభాయాత్ర వేగంగా ముందుకు సాగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.


దాదాపు 30 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శుక్రవారం కావటంతో పాతబస్తీలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే సమయంలో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛంగా ఒకరికి ఒకరు సహకరించుకొని పరమత సహనం.. పరస్పర గౌరవం చాటారు. చార్మినార్‌, మొజాంజాహి మార్కెట్‌ మార్గాల్లో మతాలకతీతంగా తాగునీరు, అల్పాహారం అందజేశారు. మహిళలను ఆకతాయిలు వేధించకుండా అడ్డుకొనేందుకు 26 ‘షీ-టీమ్స్‌’ను నియమించారు. 24 డ్రోన్లతో నిరంతరం నిఘా పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించి పర్యవేక్షించారు. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.


బాలాపూర్‌ లడ్డు రూ.39 లక్షలు..

బాలాపూర్‌ లంబోదరుడి లడ్డూ ప్రసాదం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గతేడాది ఈ లడ్డు రూ.35 లక్షలు పలకగా, ఈసారి రూ.39 లక్షలు పలికింది. పోటాపోటీగా సాగిన వేలంలో వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత సామ ప్రణీత్‌రెడ్డి లడ్డూను కైవసం చేసుకున్నారు. అత్తాపూర్‌ గణేశుడి లడ్డూను గుమ్మడి భూపాల్‌ రెడ్డి సోదరులు రూ.13.21 లక్షలకు సొంతం చేసుకున్నారు. మాదాపూర్‌లోని కోహినూర్‌ ఆరో రియాలిటీ గేటెడ్‌ కమ్యూనిటీలో గణేశుడి లడ్డు రూ.30,500,01లు పలికింది. మైహోమ్‌ భుజాలో రూ.25 లక్షలకు ఓ భక్తుడు సొంతం చేసుకున్నాడు. కొండాపూర్‌లోని మైహోం మంగళాలో రూ.21,11,116లకు సాంబశివరావు, నవీన్‌ అనే భక్తులు లడ్డూను దక్కించుకున్నారు.


కేపీహెచ్‌బీ ప్రగతినగర్‌ రఘుపతి కౌంటీలో రూ.13.66 లక్షలు, రాజేంద్రనగర్‌ ల్యాన్‌సమ్‌ అటానియాలో రూ.13.56 లక్షలు, కొండాపూర్‌ ఇండీ్‌సవైవా సిటీలో రూ.13.21 లక్షలు, ప్రగతినగర్‌లో రూ.13 లక్షలకు విఘ్నేశ్వరుడి లడ్డూలను భక్తులు దక్కించుకున్నారు. చేవెళ్ల పట్టణంలోని రచ్చబండ వినాయకుడి లడ్డు రూ.28,11,101 పలికింది. బండ్లగూడ కీర్తి రిచ్‌మండ్‌ విల్లాలో ఈ ఏడాది లడ్డు రూ.1.01 కోట్లు పలికింది. ఈ సొమ్మును ఆర్వీ దియా ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా వివిధ సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు భక్తులు తెలిపారు. గతేడాది ఇక్కడ లడ్డు రికార్డు స్థాయిలో రూ.2.32 కోట్లు పలకగా.. అందులోని రూ.1.66 కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. దియా స్వచ్ఛంద సంస్థ సేవలను అభినందిస్తూ మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ వీడియో సందేశం పంపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అబ్బెందలో గణేశుడి లడ్డూను ఎండీ రహీం అనే ముస్లిం యువకుడు రూ.45 వేలకు దక్కించుకున్నాడు. కంగ్టి మండలం పంచమహల్‌ దామర్‌గిద్దలో మునీర్‌ అనే యువకుడు రూ.12 వేలకు గణపతి లడ్డూను సొంతం చేసుకున్నాడు.


13 మంది మృతి.. 26 మందికి గాయాలు: డీజీపీ

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ విగ్రహాల నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిమజ్జనోత్సవాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.24 లక్షల విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రతిష్ఠించారని తెలిపారు. నిమజ్జనాల బందోబస్తు విధుల్లో.. నిమజ్జన ప్రదేశాల్లో, చెరువుల్లో ప్రమాదవశాత్తు 13 మంది మరణించారని.. 26 మంది గాయపడ్డారని వెల్లడించారు. పలుచోట్ల ఘర్షణలు జరిగినట్లు చెప్పారు.


మొత్తంగా పకడ్బందీ ప్రణాళికతో నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం కార్మికనగర్‌కు చెందిన బీ శివ శుక్రవారం ఖైరతాబాద్‌ చౌరస్తాలో వాహనంపై నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలతో మృతి చెందాడు. నిర్మల్‌ జిల్లా కడెం మండలం కుర్రగూడ గ్రామానికి చెందిన గణేశుడిని శుక్రవారం ఉదయం కడెం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలో నిమజ్జనం చేస్తుండగా చుంచు రమేశ్‌ (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల వద్ద కృష్ణానదిలో గణేశుడి విగ్రహం నిమజ్జనం అనంతరం నదిలో ఈతకు వెళ్లిన హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన ఎస్‌. రాజు ముదిరాజ్‌ (37) అనే వ్యక్తి మరణించాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

వరంగల్‌ కేంద్రంగా బీజేపీ వ్యూహరచన

ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 04:18 AM