గంగమ్మ ఒడికి పార్వతీ తనయుడు
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:29 PM
వినాయక నిమజ్జన వేడుకలు నగరంలో బుధవారం రాత్రి భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- అంగరంగ వైభవంగా గణేశ్ నిమజ్జనం
- పోటెత్తిన భక్తజనం
- గడియారం చౌరస్తాలో గణపతి విగ్రహాలకు స్వాగతం
- డీజే సౌండ్లతో దద్దరిల్లిన పాలమూరు
- పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వినాయక నిమజ్జన వేడుకలు నగరంలో బుధవారం రాత్రి భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరు కున్నారు. వీధి వీధినా ఏర్పాటు చేసిన వినాయక మండపాల నుంచి గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను ట్రాక్టర్లు, డీసీఎంలపై సుందరంగా అలంకరించి నగరంలోని వీధుల్లో భక్తుల భజనలు, కోలాటాలు, నృత్యాల మధ్య ఊరేగింపుగా గడియారం చౌరస్తాకు చేరుకున్నాయి. గడియారం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టేజీపై నుంచి గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్ష, కా ర్యదర్శులు మద్దియాదిరెడ్డి, బాలయ్య వినాయక విగ్రహాలకు స్వాగతం పలికారు. ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచందర్‌రెడ్డి, మేయర్ గుమ్మాల్ మమత, టీపీసీసీ కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్ పలు మండపాలలోని గ ణేశ్‌లను దర్శించుకుని పూజలు నిర్వహిం చారు. వన్‌టౌన్, రామయ్యబౌలీ, రాజేంద్ర నగర్, బ్రాహ్మణవాడి, కాశీకాపుడి, పాన్‌చౌరస్తా, రాంమందిర్ చౌరస్తా, వీరన్నపేట, బండ్లగేరి, ఏనుగొండ, అప్పన్నపల్లి ప్రాంతాల్లో నిమజ్జన వేడుకులను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు, మునిసిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వ యంతో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుంగా నిమజ్జనం జరిగే వీధులకు వాహనాలను అనుమతించలేదు. ఇతర వీధులకు ట్రాఫిక్‌ను మళ్లించారు.
నిమజ్జన ప్రాంతాల్లో భద్రత..
గణేశ్ నిమజ్జనం సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెరువుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. చిన్న గణపతులను నిమజ్జనం చేసేందుకు పంచవటి విద్యాలయం, అప్పన్నపల్లి వద్ద బేబీ ఫాండ్లను ఏర్పాటు చేశారు. పెద్ద వినాయకులు బీచుపల్లి ఇతర ప్రాంతాలకు తరలించారు.
జడ్చర్ల : జడ్చర్ల మునిసిపాలిటీలో ప్రతి ష్ఠించిన వినాయకుడిని మునిసిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నీళ్ల తొట్టిలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, మునిసిపల్ కమి షనర్ గిరీశ్ సిబ్బందితో కలిసి నిమజ్జనం చేశారు. నాగసాల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పరిశీలించారు. నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయక విగ్రహాలను విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని నేతాజీచౌరస్తా వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువకులు, చి న్నారులతో పాటు కోలాటాలతో మహిళలు నృత్యాలు చేశారు. నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ జానకి పర్యవేక్షించారు. అదనపు ఎ స్పీ, మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల సీఐ కమలాకర్, నాగార్జునగౌడ్, ఎస్‌ఐలు జయప్రసాద్, మల్లేష్‌లతో పాటు 30 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.