హైదరాబాద్‌లో తాగునీటి సమస్య రావొద్దు
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:19 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
క్యూర్ ఏరియాలో ఎస్టీపీలు వందశాతం పనిచేయాలి..
డేటా సెంటర్లకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలి
తాగునీటి సరఫరా, ఎస్టీపీలపై సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం క్యూర్ ఏరియాలో మంచినీటి సరఫరా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీసీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ఏరియాలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వందశాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలన్నారు.
శుద్ధి చేసిన నీటిని సెక్రటేరియట్‌తోపాటు సీఎంవో, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, ఇతర శాఖల కార్యాలయాల్లో పచ్చదనం నిర్వహణ, ఇతర అవసరాలకు వినియోగించేలా చూడాలని సూచించారు. పబ్లిక్ పార్కులు, రోడ్ల శుభ్రతకు కూడా ట్రీటెడ్ వాటర్‌నే వాడాలన్నారు. భవన నిర్మాణంలో శుద్ధి చేసిన నీటినే వాడాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రైవేటు ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని అన్నారు. ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని రెడ్కో ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఎస్టీపీల్లో నీటి శుద్ధికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను పాటించాలని, నీటి నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అన్నారు. ప్రతీ శుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు హైడ్రా పర్యవేక్షించాలన్నారు.
ట్యాంకర్లను ట్రాకింగ్ చేయాలి..
ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాకింగ్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ట్రీటెడ్ వాటర్ కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీపీల నిర్వహణ, ట్రీటెడ్ వాటర్ వినియోగానికి సంబంధించి నవంబరు 1 నుంచి ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, 26 ఎస్టీపీల్లో ట్రీటెడ్ వాటర్‌ను ప్రస్తుతం గ్రీన్ ట్యాంకర్స్ ద్వారా పంపిణీ చేస్తున్నట్టు జలమండలి అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వినియోగదారుల నుంచి కేవలం రవాణా రుసుము మాత్రమే వసూలు చేస్తున్నామని, నీళ్లను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. సమీక్షలో సీఎస్ సంజయ్ జాజు, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ నవీన్ నికోలస్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్లు సృజన, వినయ్‌కృష్ణారెడ్డి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేష్ వి.పాటిల్, పీసీబీ మండలి సభ్యకార్యదర్శి రవి, ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News