Share News

కరువుకు మీరే కారకులు!

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:13 AM

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై బుధవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది.

కరువుకు మీరే కారకులు!
Telangana all party meeting

  • అఖిలపక్ష సమావేశంలో అధికార, విపక్షాల పరస్పర విమర్శలు

  • కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదన్న బీఆర్‌ఎస్‌

  • ఎన్‌డీఎస్ఏ వద్దన్నందునే బ్యారేజీల్లో నీటిని నిల్వచేయలేదన్న మంత్రి ఉత్తమ్‌

  • అన్ని పార్టీల సహకారంతో కరువును ఎదుర్కొంటామన్న డిప్యూటీ సీఎం భట్టి

  • కరువుపై ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన ప్రణాళిక లేదని బీజేపీ విమర్శ

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై బుధవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. కరువుకు మీరంటే మీరే కారణమని అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేసుకున్నారు. ఎల్‌నినోపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ బుధవారం సచివాలయంలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. భట్టి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరితోపాటు కాంగ్రెస్‌ పార్టీ తరఫున అంజన్‌కుమార్‌ యాదవ్‌, కోదండరెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, ఎల్‌.రమణ, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, సీపీఎం కార్యదర్శి జాన్‌ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌, సమాజ్‌వాదీ పార్టీ నేతల ప్రొ.సింహాద్రి, ఆర్జేడీ నాయకురాలు శోభా యాదవ్‌, బీఎస్పీ నేత శ్రీరామ్‌ కృష్ణ, ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హేమ సుదర్శన్‌ హాజరయ్యారు.


బీఆర్‌ఎస్‌ నాయకులు వినోద్‌కుమార్‌, నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ... వర్షాకాలంలో కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తే ప్రస్తుత కరువు కాలంలో ఉపయోగపడేదని అన్నారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి, రిజర్వాయర్లలో ఎందుకు నిల్వ చేయలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ విమర్శలను మంత్రి ఉత్తమ్‌ తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ హయాంలోనే కూలిందని తెలిపారు. కాళేశ్వరానికి బదులు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీటి నిల్వకు ఎన్‌డీఎ్‌సఏ అనుమతించలేదని తెలిపారు. అన్ని తప్పులు మీరు చేసి, మమ్మల్ని అంటే ఎలా అని నిలదీశారు. కృష్ణా నీటిని ఎక్కువగా తెలంగాణే వాడుకుందని తెలిపింది. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి తెలంగాణ 127.57 టీఎంసీలు వాడుకోగా, ఏపీ 72.237 టీఎంసీలు వాడుకుందన్నారు. నాగార్జునసాగర్‌ నుంచి తెలంగాణ 41.908 టీఎంసీలు వాడుకోగా, ఏపీ 17.207 టీఎంసీలు వాడుకుందని చెప్పారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ... ఎన్‌డీఎస్ఏ ఎక్కడా నీటిని నిల్వ చేయవద్దని చెప్పలేదని స్పష్టంచేస్తూ ఆ సంస్థ నివేదికలోని ఒక పేరాను చదివి వినిపించారు. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిందే తప్ప...ఎలాంటి కరువు సహాయక చర్యలు చేపడుతుందో చెప్పలేదని మండిపడ్డారు.


ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది: భట్టి

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడిన వర్షాభావ, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని భట్టి తెలిపారు. కరువు పరిస్థితులపై కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపించామని, అవసరమైతే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రావాల్సిన సహాయంపై విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. అన్ని పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సీపీఎం నేతలు జాన్‌ వెస్లీ, నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సమగ్ర కరువు నివారణ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని కోరారు. 365 మండలాలనే ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని, కానీ... రాష్ట్రమంతటా కరువు ఉందని తెలిపారు.


రైతులు నష్టపోయిన వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.30 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని.. రైతులు, డ్వాక్రా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు. రేషన్‌ కార్డుల ద్వారా ప్రస్తుతం ఇస్తున్న సన్న బియ్యం కోటాను 6 కేజీల నుంచి 12 కేజీలకు పెంచాలని.. కారం, ఉప్పు, కందిపప్పు, చింతపండు, వంటి 8 రకాల సరుకులను పూర్తి ఉచితంగా, పాలు, గుడ్లు, టీపొడి, చక్కెర, కొబ్బరినూనె, గోధుమలు, మినప పప్పు వంటివాటిని సబ్సిడీపై అందించాలని సూచించారు. కరువు నివారణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని సీపీఐ నేతలు కూనంనేని, పల్లా వెంకట్‌రెడ్డి సూచించారు. కౌలు రైతులను గుర్తించి, పంట నష్ట పరిహారం ఇవ్వాలని, 14 రకాల నిత్యావసర వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా అందించాలని కోరారు. విద్యుత్‌, నీటి సరఫరా, వ్యవసాయం, నిత్యావసర సరుకుల సమస్యలపై దృష్టి సారించాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కోరినంత ఉపాధి!

జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్‌!

పంటల ధరలు పైపైకి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 04:14 AM