Share News

కోరినంత ఉపాధి!

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:50 AM

ఎల్‌నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా సన్నద్ధమవుతోంది. గ్రామీణ స్థాయి నుంచీ ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

కోరినంత ఉపాధి!
El Nino drought preparedness

  • ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయి నుంచీ ముందస్తు చర్యలు

  • జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని

  • ఎక్కువ వేతనాలు ఇస్తే..

  • దానికి తగ్గట్టు మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధుల రాక

  • ఒక్కో గ్రామానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు సమకూరే అవకాశం

  • వాటితో గ్రామాల్లో వసతులు, అభివృద్ధి భూగర్భజలాల పెంపుకు చర్యలు

  • ఎంపీడీవోల ఆధ్వర్యంలో కమిటీలు అలసత్వం వహిస్తే సర్పంచ్‌లకు నోటీస్‌లు

  • పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా సన్నద్ధమవుతోంది. గ్రామీణ స్థాయి నుంచీ ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పెంచాలని, జాబ్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి పనిచూపాలని పంచాయతీరాజ్‌ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఉపాధి కూలీలు పెరిగితే.. వేతనాల చెల్లింపుల ఆధారంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కూడా పెరుగుతుందని పేర్కొంది. దానితో అభివృద్ధి పనులకు నిధుల సమస్య కూడా ఉండదని స్పష్టం చేసింది. గ్రామాల్లో ఉపాధి పనులకు, పశు సంపదను కాపాడేందుకు, తాగు, సాగునీటి వనరుల సంరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేసింది.


దీనికి సంబంధించి బుధవారం పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 12 వేల మంది సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. నీటి సమస్య, కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి పనులు వేగవంతం చేయడంతోపాటు చెరువుల పునరుద్ధరణ, భూగర్భజలాల పెంపు, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామీణ ప్రజలకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు.


గరిష్ఠ స్థాయిలో ఉపాధి కల్పించండి...

రాష్ట్రంలోని 12,516 పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభమయ్యాయని, మిగతా 244 పంచాయతీల్లోనూ వెంటనే చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అక్టోబరు 27న ఉపాధి పనులకు రికార్డు స్థాయిలో 3,97,788 మంది కూలీలు హాజరయ్యారని.. ఈ సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. ఫామ్‌పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఉపాధి పథకం ద్వారా వచ్చే నిధులు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలని సూచించారు. ఒక్కో గ్రామానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు సమకూరే అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో అలసత్వం వహించే సర్పంచులకు నోటీసులు ఇస్తామన్నారు. ఇక మంత్రి సీతక్క పలువురు సర్పంచులతో మాట్లాడి గ్రామాల్లో జరుగుతున్న పనుల వివరాలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయని గుర్తు చేశారు. జీపీఎ్‌సఏపీ పోర్టల్‌లో ప్రతి గ్రామ పంచాయతీ వివరాలు ఉన్నాయని, ఆ వ్యవస్థను ఉపయోగించుకొని పనుల ప్రణాళికలు, అమలు, పర్యవేక్షణ మెరుగుపర్చాలని సూచించారు.


ఎంపీడీవో నేతృత్వంలో మండల స్థాయి కమిటీలు

ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే సమస్యలపై ముందస్తు అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టేందుకు మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ బుధవారం జీవో 579 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంపీడీవో చైర్మన్‌గా పంచాయతీరాజ్‌, సాగునీరు, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లోని ఏఈలు, మండల వ్యవసాయ అధికారి, పశువైద్య అధికారి, ఉద్యానవన అధికారి సభ్యులుగా ఉంటారు. మండల పరిషత్‌ అధికారి(ఎంపీవో) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి ఇతర శాఖల అధికారులను కమిటీలో చేర్చే అధికారాన్ని ఎంపీడీవోకు ఇచ్చారు. ఈ కమిటీ గ్రామాల్లో అవసరాలను గుర్తించడం, చేయాల్సిన పనులకు అంచనాలు సిద్ధం చేయడం, వివిధ శాఖల అనుమతులు పొందిన పనులు అమలు చేయడం వంటివి ప్రధాన బాధ్యతలని పేర్కంది.


ఈ కమిటీలు రాష్ట్రవ్యాప్తంగా 35,959 చిన్న నీటి వనరులపై దృష్టిపెట్టాలని సూచించింది. మహిళా సంఘాల సహకారంతో ఆయా పంచాయతీల పరిధిలోని చెరువుల్లో నీటి లభ్యత ఆధారంగా పశుగ్రాసం పెంచాలని సూచించింది. తీవ్ర వర్షాభావ ప్రాంతాల్లో పశువుల తాగునీటి తొట్టెల నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించేలా వీలైనన్ని ఎక్కువ పనులు చేపట్టాలని సూచించింది. పనిదినాలు, వేతనాల చెల్లింపులపై నిరంతరం సమీక్ష చేయాలని పేర్కొంది. ఈ కమిటీలు ప్రతి వారం జిల్లా కలెక్టర్లకు పనుల పురోగతిపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. అన్ని మండలాల్లో సమన్వయ కమిటీల ఏర్పాటు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. కమిటీల పనితీరును సమీక్షించాలని ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

రేషన్‌ బియ్యం.. బ్రాండెడ్‌ దందా

జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్‌!

పంటల ధరలు పైపైకి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 04:04 AM