ఆన్‌లైన్ ట్రేడింగ్.. డిజిటల్ అరెస్టు పేరిట బురిడీ
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:30 AM
ఓ యువ వ్యాపార వేత్తను ఆన్‌లైన్ ట్రేడింగ్.. 69 ఏళ్ల రిటైర్డు ప్రభుత్వ అధికారిని డిజిటల్ అరెస్టు పేరిట మోసగించి రూ.13,03,30,000 స్వాహా చేసిన సైబర్ మోసగాళ్ల ఉదంతాలు వెలుగు చూశాయి.
రూ.13.03 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
ఓ వ్యాపారి, రిటైర్డు అధికారికి టోకరా
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఓ యువ వ్యాపార వేత్తను ఆన్‌లైన్ ట్రేడింగ్.. 69 ఏళ్ల రిటైర్డు ప్రభుత్వ అధికారిని డిజిటల్ అరెస్టు పేరిట మోసగించి రూ.13,03,30,000 స్వాహా చేసిన సైబర్ మోసగాళ్ల ఉదంతాలు వెలుగు చూశాయి. విజయవంతమైన ఓ యువ వ్యాపార వేత్తకు గత మార్చిలో ఫోన్‌లో పరిచయమైన అర్జున్ అనే వ్యక్తి ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అత్యధిక లాభాలొస్తాయని ఆశ చూపాడు. తొలి రూ.10వేలు పెట్టుబడికి 10 శాతానికి పైగా లాభం రావడంతో అర్జున్‌ను నమ్మిన ఆ వ్యాపారి గత నెల 26వ తేదీ వరకూ 15పై చిలుకు కంపెనీల్లోకి రూ.15,39,04,853 నగదు బదిలీ చేశాడు. ఇందులో విడతల వారీగా రూ.3,07,46,000 ఆయనకు తిరిగిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో గత నెలలో భారీమొత్తం విత్‌డ్రాకు ప్రయత్నిస్తే.. ఆ ఖాతాలు లాక్ అయ్యాయి.
రూ.12.31 కోట్ల డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే.. సైబర్ మోసగాళ్లు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనడంతో మోసపోయినట్లు తెలుసుకున్న వ్యాపారవేత్త.. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. అలాగే, గచ్చిబౌలిలో 69 ఏళ్ల రిటైర్డు ప్రభుత్వ అధికారిని బురిడీ కొట్టించి రూ.72.30 లక్షలు కొట్టేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో డిప్యూటీ డీజీగా రిటైరైన బాధితుడి (69)కి గత నెల 15న వాట్సాప్ కాల్ చేసిన ఓ వ్యక్తి.. బాధితుడిపై ముంబై పోలీసులు మనీ లాండరింగ్ కేసులో అరెస్టు వారంట్ జారీ చేశారని భయ పెట్టాడు. ముంబై పోలీసుల ఎఫ్‌ఐఆర్, ఈడీ పేరుతో అరెస్టు- ఆస్తుల జప్తు ఉత్తర్వులు, ఆర్బీఐ, సుప్రీంకోర్టు పేరిట నకిలీ పత్రా లు పంపి.. మరింత భయ పెట్టాడు.
వాటిని నమ్మి బాధితుడు వీడియో కాల్‌లో చెప్పిన వివరాలతో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పోస్టాఫీసుల్లో ఖాతాలు తెలుసుకున్నారు. తనిఖీ కోసం డబ్బు బదిలీ చేస్తే.. తనిఖీ చేశాక తిరిగి చెల్లిస్తామని నమ్మించారు. చివరకూ ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం ఆభరణాలపై రుణం తీసుకుని ఆమొత్తాన్నీ బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో గత నెల 15 నుంచి ఈ నెల 5 వరకూ విడతల వారీగా రూ.72.30 లక్షలు బదిలీ చేశాడు. చివరికి ఈ నెల 11న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపైనా కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News