పోలీసులకు సహకరించినందుకు నగరవాసులకు నా కృతజ్ఞతలు: సీపీ సజ్జనార్
ABN , Publish Date - Sep 26 , 2026 | 07:53 PM
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు నగర సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26: నగరంలో 48 గంటల పాటు కొనసాగిన గణేశుని శోభాయాత్ర అనంతరం సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో నిమజ్జనానికి మూడు నెలల ముందే కసరత్తు చేశామని సీపీ తెలిపారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది గణేశుని దర్శనానికి గతం కన్నా ఎక్కువమంది భక్తులు తరలివచ్చారన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్‌ను దాదాపు 30 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా.. బాలాపూర్ గణేష్‌ను 15 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో గణేశుని నిమజ్జనానికి 20 వేల మంది హైదరాబాద్ సిటీ పోలీస్‌లతో బందోబస్తు ఏర్పాటు చేశామని.. ఇతర జిల్లాల నుంచి మరో 8 వేల మందికి పైగా అదనపు సిబ్బందిని ఏర్పటు చేశామని సీపీ పేర్కొన్నారు. అంతేకాకుండా.. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, టీజీఎస్పీ బలగాలతో పటిష్ట బందోబస్తును నిర్వహించామన్నారు. ఈ మేరకు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, వైద్యారోగ్య, ఆర్టీసీ శాఖలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. దానితోపాటు పోలీసులకు సహకరించినందుకు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
2027 గణేష్ ఉత్సవాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు: సీపీ సజ్జనార్
వినాయక నిమజ్జన ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేశామన్న సీపీ.. కొన్ని లోపాలను కూడా గుర్తించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది గణేశ్ ఉత్సవాలలో వీటిని సరిచేసుకుంటామన్నారు. 2027 గణేశ్ ఉత్సవాల కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తామని సీపీ వెల్లడించారు. ఈ మేరకు ఈ ఏడాది అనుభవాలపై సంబంధిత అధికారులతో డీ బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
నిమజ్జన కార్యక్రమాలను సీపీ స్వయంగా పరిశీలించారు. ప్రధాన మార్గాలలో స్వయంగా బైక్‌పై తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జనం విజయవంతంగా ముగిసిన సంతోషంలో పోలీసులు సెక్రటేరియట్ వద్ద సంబరాలు చేసుకున్నారు. డీజే పాటలకు పోలీసులు తీన్‌మార్ వేయగా.. సీపీ సజ్జనార్ సైతం తీన్‌మార్ వేయడం విశేషం.
ఇవి కూడా చదవండి...
2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్’ ప్రచారం: మంత్రి దుర్గేష్
దుర్గగుడి ఘాట్‌రోడ్డుకు శాశ్వత రక్షణ చర్యలు.. దసరాకు సురక్షితంగా ఉండేలా ఆదేశాలు
Read Latest AP News And Telangana News And Telugu News