Share News

కిరాయి ఖాతాలు ఉంటే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 09:52 AM

బ్యాంకుల్లో కిరాయి (మ్యూల్‌) ఖాతాలు ఉంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ బ్యాంకర్లను హెచ్చరించారు.

కిరాయి ఖాతాలు ఉంటే కఠిన చర్యలు
Hyderabad CP V.C. Sajjanar

  • ప్రతీ బ్యాంకు ‘జీరో మ్యూల్‌ ఖాతాలు’ లక్ష్యంగా పనిచేయాలి

  • బ్యాంకు అధికారులతో హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ: బ్యాంకుల్లో కిరాయి (మ్యూల్‌) ఖాతాలు ఉంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ బ్యాంకర్లను హెచ్చరించారు. ప్రతీ బ్యాంకు శాఖలో ‘జీరో మ్యూల్‌ ఖాతాల’ లక్ష్యంగా పని చేయాలని, మ్యూల్‌ ఖాతాలను గుర్తించేందుకు ‘మ్యూల్‌ హంటర్‌’ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. మ్యూల్‌ ఖాతాల నియంత్రణ అంశంపై హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వివిధ బ్యాంకుల అధికారులతో సజ్జనార్‌ గురువారం సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖాతాల పెంపు, టార్గెట్లు కాకుండా బ్యాంకు అధికారులు ఖాతాదారుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. ఏ ఒక్క ఖాతాదారు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా చూడటమే ప్రాథమిక లక్ష్యం కావాలన్నారు. సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్‌ ఖాతాలను అరికట్టేందుకు ‘సేఫ్‌ కస్టమర్‌ ఛాలెంజ్‌’ను బ్యాంకులు స్వీకరించాలని, జీరో మ్యూల్‌ ఖాతాల లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.


city5.2.jpgసైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా అధికారులు తమ బ్రాంచీల పనితీరును అంచనా వేసుకోవాలని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 2లో భాగంగా 850 కేసుల్లో రూ.150 కోట్ల మోసం జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులకు సంబంధించి మ్యూల్‌ ఖాతాలు తెరిచేందుకు సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులను అరెస్టు చేశామని గుర్తు చేశారు. సైబర్‌ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఆపరేషన్‌ ఆక్టోపస్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు.


ఇక, కేవైసీ నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారు తిరిగి బ్యాంకింగ్‌ రంగంలోకి రాకుండా బ్లాక్‌ లిస్ట్‌ చేయాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్న కస్టమర్ల విషయంలో బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ చిన్మయ్‌కుమార్‌ సహా 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి, వెండి ధరలు మరింత పతనం

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2026 | 09:52 AM