మూడో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె..
ABN , Publish Date - Apr 24 , 2026 | 09:10 AM
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు. అన్ని జిల్లాల్లో బస్సులన్నీ డిపోలకే పరిమితం చేశారు. దాదాపు 10 వేల బస్సులను నిలిపివేసిన కార్మికులు రోడ్లపై బైఠాయిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో మూడు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేక సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు నిన్న పలువురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు. అందులో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిచెందాడు. బస్ స్టేషన్ ఆవరణలో నిరసన తెలుపుతూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు డ్రైవర్. బాధితుడిని హైదరాబాద్ కంచన్‌బాగ్ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజాము 2:30 గంటల ప్రాంతంలో మరణించాడు. దీనిపై ఆర్టీసీ జేఏసీ భగ్గుమంది. ప్రాణాలు పోతున్నా తమ సమస్యలు తీర్చడం లేదని మండిపడింది.
ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. డ్రైవర్ మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కార్మిక సంఘం నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు సమావేశం కానున్నారు. వారి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చూపనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..