ట్రంప్ ప్రభుత్వం దూకుడు.. పౌరసత్వాల రద్దుకు రంగం సిద్ధం!
ABN , Publish Date - Apr 24 , 2026 | 08:16 AM
అక్రమ మార్గాల్లో పౌరసత్వం పొందిన వారిపై కొరడా ఝళిపించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. 384 మంది పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: వీసాలపై మునుపెన్నడూ చూడని స్థాయిలో ఆంక్షలు విధించిన అమెరికా ప్రభుత్వం తన దృష్టిని పౌరసత్వం రద్దు వైపు మళ్లించింది. విదేశాల్లో జన్మించి, అక్రమమార్గాల్లో యూఎస్ పౌరసత్వం పొందిన వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. పౌరసత్వాల రద్దు (డీనేచురలైజేషన్) కోసం ఇప్పటికే 384 మందిని ప్రభుత్వం గుర్తించినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసే యోచనలో ఉన్న ప్రభుత్వం.. వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రాసిక్యూటర్లకు పెద్ద సంఖ్యలో కేసులు అప్పగించనున్నట్టు సమాచారం.
మీడియా కథనాల ప్రకారం, అమెరికా న్యాయశాఖ సీనియర్ అధికారులు ఇప్పటికే తమ ప్రాంతీయ కార్యాలయాల లిటిగేటర్లతో సమావేశం అయ్యారు. డీనేచురలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నిర్ణయించారు. అయితే, ఈ అంశాలపై యూఎస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. పౌరసత్వం కోల్పోనున్న 384 మంది ఎవరో, వారిని ప్రభుత్వం ఎలా గుర్తించిందో కూడా ఇంకా తెలియాల్సి ఉంది. చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో డీనేచురలైజేషన్ కేసులను పరిశీలిస్తున్నామని న్యాయశాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు. పౌరసత్వ ప్రక్రియను దుర్వినియోగ పరిచిన వారిని ఏరివేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అమెరికా చట్టాల ప్రకారం, విదేశాల్లో పుట్టిన వారూ కొన్ని నిబంధనలకు లోబడి యూఎస్ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఇలాంటి వారు అక్రమాలకు పాల్పడితే తమ పౌరసత్వాన్ని కోల్పోతారు. అయితే, అమెరికాలో జన్మతః పౌరసత్వం పొందిన వారికి డీనేచురలైజేషన్ ముప్పు ఉండదు. పుట్టుకతో పౌరసత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, దాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోలేదని అమెరికా సుప్రీంకోర్టు గతంలో ఒకసారి స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
మొజ్తాబాకు శాస్త్ర చికిత్స అవసరం.. ఇంటర్నేషనల్ మీడియా