పాక్‌లో చర్చలు.. పెద్ద తప్పే చేశాము: ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు
ABN , Publish Date - Apr 24 , 2026 | 09:18 AM
పాక్‌లో యూఎస్‌తో చర్చల సందర్భంగా తమ అణు కార్యక్రమం ప్రస్తావనకు అంగీకరించి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డామని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు మహమూద్ నవాబియన్ అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ వేదికగా అమెరికాతో జరిగిన చర్చల్లో తాము పెద్ద తప్పిదమే చేశామని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు మహమూద్ నబావియన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు. పాక్ వేదికగా ఇరాన్ తన అణు కార్యక్రమంపై యూఎస్‌తో చర్చించడం వ్యూహాత్మక తప్పిదమని వ్యాఖ్యానించారు. ఈ చర్యతో అమెరికాకు పైచేయి లభించినట్టైందని అన్నారు. శుద్ధి చేసిన యూరేనియం నిల్వల్లో 60 శాతాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేసే అవకాశం యూఎస్‌కు లభించిందని అన్నారు. రాబోయే 20 ఏళ్ల పాటు ఎలాంటి అణు కార్యక్రమాలూ చేపట్టవద్దని షరతు పెట్టిందని అన్నారు. అయితే, తాము ఈ డిమాండ్స్‌కు ఏ మాత్రం అంగీకరించలేదని కూడా చెప్పారు.
ఇరాన్‌తో చర్చలపై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న ఒత్తిడి తనపై లేదని చెప్పారు. అమెరికాకు ఆమోదయోగ్యమైన డీల్‌ను మాత్రమే కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. కానీ ఇరాన్‌కు మాత్రం ఇలాంటి స్వేచ్ఛ లేదని చెప్పుకొచ్చారు.
ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ జలసమాధి అయ్యాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధ విమానాలను టార్గెట్ చేసే ఆయుధాలు, రాడార్ వ్యవస్థలు కూడా ధ్వంసమైపోయాయని తెలిపారు. ఇరాన్ కీలక నాయకులు అనేక మంది మరణించారని చెప్పారు. తాము విధించిన దిగ్బంధనం కట్టుదిట్టమైనదని, గాలి కూడా చొరబడలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇరాన్ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని అన్నారు. డీల్ కుదుర్చుకునేందుకు ఇరాన్‌కు ఎక్కువ సమయం లేదని హెచ్చరించారు. ఇంతగా పతనమైన ఇరాన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్ ప్రభుత్వం దూకుడు.. పౌరసత్వాల రద్దుకు రంగం సిద్ధం!
మొజ్తాబాకు శాస్త్ర చికిత్స అవసరం.. ఇంటర్నేషనల్ మీడియా