ముందు చూపుతో నీటి ఎద్దడికి చెక్!
ABN , Publish Date - Jun 04 , 2026 | 10:07 AM
హైదరాబాద్ నగరంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి.
వర్షాలకు ముందే ఇంకుడు గుంతలకు మరమ్మతు
ఆదర్శంగా నిలుస్తున్న పద్మశాలి కాలనీవాసులు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. పలు ప్రాంతాల ప్రజలు నీటికోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతుండగా, భోలక్‌పూర్ పద్మశాలి కాలనీవాసులు ప్రతియేటా వర్షాకాలానికి ముందే ఇంకుడు గుంతలకు మరమ్మతు చేయించుకుంటూ వేసవిలోనూ నీటి ఎద్దడి లేకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పద్మశాలి కాలనీ వెల్ఫేర్‌సొసైటీ పరిధిలో 144 గృహాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. వర్షాకాలనీకి ముందు ఇంకుడుగుంతల మరమ్మతులు చేస్తూ వర్షం నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపడుతున్నారు. గత 30 ఏళ్ల క్రితమే పద్మశాలి కాలనీలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. అలా మొదలై ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టారు.
రెండు రోజులుగా కాలనీవాసులు ఇంకుడు గుంతల మరమ్మతు పనులు చేస్తూ పేరుకుపోయిన మట్టి చెత్తాచెదారంను తొలగిస్తూ వర్షంనీరు భూమిలోకి సాఫీగా పోయేలా పనులు కొనసాగిస్తున్నారు. దీనితో స్థానికంగా ఉన్న బోర్లు ఎండిపోకుండా వాటి నుంచి పుష్కలంగా నీరు వస్తోంది.

ప్రతి ఇంకుడు గుంతకు మరమ్మతు చేయిస్తున్నాం
వర్షం నీరు వృథాగా పోకుండా ప్రతి ఇంటి వద్ద ఉన్న ఇంకుడు గుంతకు మరమ్మతు చేయిస్తున్నాం. వానా కాలంలో వర్షంనీరు రోడ్డుపై వృథాగా పోకుండా భూమిలోకి నేరుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో వేసవి కాలంలో బోర్లు ఎండిపోకుండా పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి.
ఆర్.ఆంజనేయులు, పద్మశాలికాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి
ఈ వార్తలు కూడా చదవండి:
తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..
లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా
Read Latest AP News And Telangana News And International News And Telugu News