కాటేదాన్ టు శంషాబాద్ రోడ్..మైలార్‌దేవ్‌పల్లి మీదుగా ఆరు లేన్ల వంతెన
ABN , Publish Date - Jun 05 , 2026 | 07:21 AM
హైదరాబాద్ మహానగరంలో మరో వంతెన నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
రూ.189.68 కోట్లతో నిర్మాణం
విమానాశ్రయానికి రాకపోకలు సులువు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహానగరంలో మరో వంతెన నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్ల మీదుగా రూ.189.68 కోట్లతో ఆరు లేన్ల బై డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఏజెన్సీ ఎంపికకు ఆమోదం తెలుపుతూ గురువారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్మేటీవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీలో)లో భాగంగా నగరంలోని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల రాకపోకలు సాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర జాతీయ రహదారులపైకి చిక్కులు లేని ప్రయాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే హెచ్-సిటీలో కేబీఆర్ పార్కు జంక్షన్, ఫాక్స్ సాగర్ బ్రిడ్జి, గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం మొదలైంది. పంజాగుట్ట ఎన్‌ఎ్‌ఫసీఎల్ జంక్షన్, అల్వీన్ కాలనీ, రసూల్‌పుర జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఏజెన్సీలు ఎంపిక చేశారు.
4.71 శాతం ఎక్కువకు..
కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో కాలగమనంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, లోకల్ ట్రాఫిక్‌తోపాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలతో ఇక్కడి రోడ్లు జామ్‌జాటంగా మారుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రూ.189.68 కోట్లతో మూడు జంక్షన్‌ల వద్ద సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం కోసం వంతెన నిర్మాణం ప్రతిపాదించారు. టెండర్‌లో కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ ఎంపికకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు సంస్థలు బిడ్‌లు దాఖలు చేయగా.. రెండూ ప్రతిపాదిత అంచనా వ్యయం కంటే ఎక్కువ కోట్ చేశాయి. కేఎన్‌ఆర్ 189.68 కోట్లు (4.71 శాతం ఎక్సెస్), ఎన్‌సీసీ లిమిటెడ్ రూ.189.88 కోట్లు (4.82 శాతం) కోట్ చేశాయి.
సాంకేతిక, ప్రైస్ బిడ్‌ను పరిశీలించిన అధికారులు.. వివరాలను జీహెచ్‌ఎంసీ పురపాలక శాఖకు పంపగా ఎల్-1 బిడ్డర్‌గా ఉన్న కేఎన్‌ఆర్ సంస్థ ఎంపికకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు హెచ్-సిటీ నిధులను వెచ్చించాలని, ఎంపికైన సంస్థతో అగ్రిమెంట్ చేసి.. పనులు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వంతెన పూర్తయితే ఫలక్‌నుమా, బహదూర్‌పురా, బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, సంతోష్ నగర్, మిధాని, మందమల్లమ్మ, సైదాబాద్, ఐఎస్ సదన్ తదితర ప్రాంతాల నుంచి వినామాశ్రయానికి రాకపోకలు సులువు కానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News