మూలాలను కూల్చేస్తున్నారు
ABN , Publish Date - Jun 05 , 2026 | 06:11 AM
దేశంలో కీలకమైన సామాజిక, ఆర్థిక రక్షణలను కేంద్ర ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో కూల్చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. జాతీయ ప్రాధాన్యతల కంటే అమెరికా...
సామాజిక, ఆర్థిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
దేశంలో ఆర్థిక సునామీ రాబోతోంది
అమెరికా ప్రయోజనాలే మోదీకి ముఖ్యం
ఉత్తరాఖండ్ సభలో రాహుల్ గాంధీ ధ్వజం
డెహ్రాడూన్, జూన్ 4: దేశంలో కీలకమైన సామాజిక, ఆర్థిక రక్షణలను కేంద్ర ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో కూల్చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. జాతీయ ప్రాధాన్యతల కంటే అమెరికా ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల మన దేశంలో ఆర్థిక సునామీ వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ‘పరివర్తన కోసం శంఖనాదం’ పేరుతో జరిగిన సభలో గురువారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. సామాన్య ప్రజల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆర్థిక పునాదులను మోదీ, అమిత్ షా బృందం ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. మొదటగా కుటుంబాల పొదుపు, ప్రజలు దాచుకున్న బంగారం తగ్గిపోయిందన్నారు. జీఎస్టీ మూలంగా టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్‌తో సహా ఇతర చిన్న, మధ్యస్థ స్థాయి వ్యాపారాలను నాశనం చేశారని అన్నారు. ఇక మూడో విషయంగా విదేశీ పాలసీని ప్రస్తావించారు. అమెరికా చెప్పిన దేశాల నుంచే ప్రస్తుతం చమురు కొనగలుగుతున్నారని రాహుల్ అన్నారు. అమెరికాకు దాసోహం అయిపోయి వ్యవసాయాన్ని, విద్యా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం వల్ల భారత్ వంటి దేశాల్లో ఆర్థిక సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయినా మోదీ అమెరికాతో పాటు మనదేశానికి చెందిన బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. ఇక చివర విషయంగా.. రైతుల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఉత్తరాఖండ్‌లో పాలన జరుగుతోందని విమర్శించారు. సహజవనరుల లబ్ధిని స్థానికులకు చెందనివ్వకుండా బయట శక్తులు దోచుకుంటున్నాయని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి కాపాడలేకపోతున్నారని అన్నారు. వచ్చే ఏడాదిలో జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధత కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనడానికి పంత్‌నగర్ ఎయిర్‌పోర్టు నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరిన రాహుల్ గాంధీ, వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి పంత్‌నగర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఫోన్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. మైక్ దగ్గర పెట్టిన ఫోన్ సరిగా వినబడక సభికులు ఇబ్బంది పడ్డారు. తాను మళ్లీ అల్మోరా వస్తానని అక్కడి ప్రజలకు రాహుల్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!