Share News

‘బంగారం’లాంటి కట్టుకథ!

ABN , Publish Date - Jun 05 , 2026 | 06:40 AM

దేశంలోనే ప్రముఖమైనదిగా గుర్తింపు పొందిన కంపెనీల్లో అదీ ఒకటి. దానిలో అంతర్భాగంగా సింగపూర్‌లో మరో కంపెనీ. దాని కింద స్విట్జర్లాండ్‌లో ఇంకో కంపెనీ. బంగారం శుద్ధి చేయడం...

‘బంగారం’లాంటి కట్టుకథ!

  • ఐదేళ్లలో రూ.15 లక్షల కోట్లు ‘నకిలీ’ వ్యాపారం

  • భారీగా బంగారం శుద్ధి, ఎగుమతి అంటూ మసిపూసి మారేడుకాయ చేసిన రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌

  • స్టాక్‌ మార్కెట్లో ఎగబడిన ఇన్వెస్టర్లు

  • కంపెనీలో పది శాతం షేర్లు కొన్న ఎల్‌ఐసీ

  • సాధారణ మదుపరి ఫిర్యాదుతో సెబీ దర్యాప్తు

  • వ్యాపారానికి ఆధారాలే లేవని తేల్చిన అధికారులు

  • తప్పుడు పత్రాలు, రికార్డులతో భారీగా ఆదాయాన్ని చూపినట్టు గుర్తింపు

  • 90 శాతం మేర పడిపోయిన షేరు ధర

  • ఎల్‌ఐసీకి సుమారు రూ.3 వేల కోట్ల నష్టం

  • గుజరాతీ మూలాలున్న బెంగళూరు వాసి రాజేశ్‌ మెహతా స్థాపించిన సంస్థ

న్యూఢిల్లీ, జూన్‌ 4: దేశంలోనే ప్రముఖమైనదిగా గుర్తింపు పొందిన కంపెనీల్లో అదీ ఒకటి. దానిలో అంతర్భాగంగా సింగపూర్‌లో మరో కంపెనీ. దాని కింద స్విట్జర్లాండ్‌లో ఇంకో కంపెనీ. బంగారం శుద్ధి చేయడం, ఎగుమతి చేయడమే పని.. ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం.. ఈ వివరాలు చూసి స్టాక్‌ మార్కెట్లో దుమ్మురేగింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. షేరు ధర పెరుగుతూ పోయింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ కూడా ఆ కంపెనీలో సుమారు 10శాతం షేర్లు కొన్నది.. కానీ ఈ బుడగ ఒక్కసారిగా పగిలిపోయింది. ఆ కంపెనీ వ్యాపారాన్ని కృత్రిమంగా పెంచి చూపిందని, లక్షల కోట్ల వ్యాపారమంతా బోగస్‌ అని బయటపడింది. షేరు ధర క్రమంగా 90శాతం మేర పడిపోయింది. ఎల్‌ఐసీ ఏకంగా సుమారు రూ.3 వేల కోట్లు నష్టపోయింది. సాంకేతికంగా అదంతా ప్రజల సొమ్ము.. అంటే ప్రజలే నష్టపోయారు. ఇంతగా బోల్తా కొట్టించిన ఆ కంపెనీ గుజరాత్‌ మూలాలున్న బెంగళూరు వాసి రాజేశ్‌ మెహతా స్థాపించిన ‘రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈఎల్‌)’. దేశంలో కంపెనీలు, స్టాక్‌ మార్కెట్ల వ్యవహారాలను పర్యవేక్షించే ‘సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా)’ తాజాగా ఈ వ్యవహారం పూర్తి వివరాలను బయటపెట్టింది. సెబీ పూర్తికాల సభ్యుడు కమలేశ్‌ చంద్ర వర్షిణి ఈ మేరకు 109 పేజీల మధ్యంతర నివేదిక విడుదల చేశారు. రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ గత ఐదేళ్లలో ఏకంగా రూ.15 లక్షల కోట్ల వ్యాపారం చేసినట్టు కట్టుకథలు అల్లిందని వెల్లడించారు. సెబీ దర్యాప్తు పూర్తయితే.. భారత కార్పొరేట్‌ చరిత్రలోనే విలువపరంగా ఇది అతిపెద్ద కుంభకోణంగా నిలుస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నేళ్లుగా ఈ బాగోతం జరుగుతుంటే.. సెబీగానీ, ఇతర నియంత్రణ సంస్థలుగానీ గుర్తించకపోవడం, ఎల్‌ఐసీ గుడ్డిగా అందులో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెబీ నివేదికలోని వివరాల ప్రకారం..


సాధారణ ఇన్వెస్టర్‌ ఫిర్యాదుతో..

బెంగళూరు కేంద్రంగా పనిచేసే రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈఎల్‌) సంస్థ బంగారం శుద్ధి, ఎగుమతుల వ్యాపారం నిర్వహిస్తుంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 మధ్య ఏటా రెండున్నర లక్షల కోట్ల రూపాయలకుపైగా.. మొత్తంగా రూ.15.15 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్టు ఆ సంస్థ లెక్కలు చూపింది. అందులో సుమారు 98శాతం ఆదాయం విదేశాల్లోని తమ అనుబంధ సంస్థల ద్వారా వచ్చిందని తెలిపింది. సెబీ, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు, ఇన్వెస్టర్లు, షేర్‌ హోల్డర్లకు ఆ వివరాలను అందజేసింది. కంపెనీ షేర్లు ఉన్న ఒక సాధారణ ఇన్వెస్టర్‌ ఆ వివరాలను పరిశీలించి... రూ.29.14 కోట్ల వాణిజ్య బకాయిలను రెండేళ్ల నుంచీ పెండింగ్‌గా చూపించడంపై అనుమానంతో 2024 మార్చి 11న సెబీకి ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన సెబీ.. అదే ఏడాది అక్టోబరు 23న ఒక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆదాయం లెక్కల్లో అవకతవకలు కనిపిస్తున్నాయని దర్యాప్తు బృందం పేర్కొనడంతో.. 2024 డిసెంబరు 3న బీడీఓ ఇండియా అనే ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ సంస్థకు విచారణ బాధ్యత అప్పగించింది. ఈ విచారణను అడ్డుకునేందుకు రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థ చేయని ప్రయత్నం లేదు. స్విట్జర్లాండ్‌లోని తమ అనుబంధ కంపెనీ వల్కాంబి వ్యాపారం వివరాలను అక్కడి చట్టాల ప్రకారం వెల్లడించడానికి వీల్లేదంటూ సహాయ నిరాకరణ చేసింది.

గొలుసుకట్టుగా డొల్ల కంపెనీలతో..

రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ యాజమాన్యం భారత్‌లోని రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈఎల్‌)కు అనుబంధంగా సింగపూర్‌లో ఆర్‌ఈఎల్‌ సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటు చేసింది. దానికి ఎలాంటి ఆదాయమూ లేదు, ఏ కార్యకలాపాలూ లేవు. ఈ సంస్థకు అనుబంధంగా స్విట్జర్లాండ్‌లో గ్లోబల్‌ గోల్డ్‌ రిఫైనరీస్‌ (జీజీఆర్‌) కంపెనీని ఏర్పాటు చేసింది. ఇది కూడా నేరుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించదు. కాకపోతే జీజీఆర్‌ పేరిట స్విట్జర్లాండ్‌కు చెందిన వల్కాంబి రిఫైనరీ (బంగారం శుద్ధి) సంస్థను కొనుగోలు చేసి నిర్వహిస్తున్నారు. రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రధాన సంస్థ భారత్‌లో కాస్త కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. ఆదాయం వచ్చే ప్రధాన అనుబంధ సంస్థ వల్కాంబి ఒక్కటే. మొత్తం రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఆదాయంలో 98శాతం వల్కాంబి నుంచే వచ్చినట్టు చూపడం గమనార్హం. అలాంటి కంపెనీ వివరాలను సెబీకి ఇవ్వకుండా నిరాకరించింది. అయితే.. సెబీ విచారణ బృందం అందుబాటులో డాక్యుమెంట్లు, ఇతర మార్గాల ద్వారా దర్యాప్తు జరిపి కంపెనీ బాగోతమంతా తేల్చి.. తాజాగా మధ్యంతర నివేదికను విడుదల చేసింది.


ఆదాయం గోరంత చూపింది కొండంత..

2020-2021 నుంచి 2024-25 మధ్య రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈఎల్‌) చూపిన ఆదాయంలో రూ.15,15,385 కోట్లు బోగస్‌ అని సెబీ నివేదికలో పేర్కొంది. కంపెనీ టర్నోవర్‌ను భారీగా చూపేందుకు.. కావాలని కొన్ని కంపెనీలకు వేల కోట్ల అమ్మకాలు జరిపినట్టు, దాదాపు అదే స్థాయిలో వాటి నుంచి కొనుగోలు చేసినట్టు (రౌండ్‌ ట్రిప్పింగ్‌) ఆర్‌ఈఎల్‌ లెక్కల్లో చూపిందని వివరించింది. ఎఫ్యూయెంట్‌ షేర్స్‌ అండ్‌ స్టాక్స్‌ కంపెనీకి కోట్ల రూ.11,487 కోట్ల అమ్మకాలు జరిపినట్టు, ఆ కంపెనీ నుంచి రూ.11,488 కోట్ల కొనుగోళ్లు జరిపినట్టు ఆర్‌ఈఎల్‌ రికార్డులో చూపారని... కానీ తాము ఆ లా వాదేవీలేమీ చేయలేదని ఎఫ్యూయెంట్‌ సంస్థ స్పష్టం చేసిందని సెబీ పేర్కొంది. ఆర్‌ఈఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ రాజేశ్‌ మెహతా వ్యక్తిగత ఖాతా నుంచి జరిపిన బంగారం డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ లావాదేవీలను కంపెనీ లావాదేవీలుగా రికార్డు చేశారని తెలిపింది. అంతేకాదు దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో రూ.1,035 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చూపిందని, దానికి ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆర్‌ఈఎల్‌ చైర్మన్‌, ప్రమోటర్‌ రాజేశ్‌ మెహతాపై చర్యలు చేపట్టింది. ఆయన కంపెనీ షేర్లలో ఎలాంటి లావాదేవీలు జరపకుండా నిషేధించింది.


ఎల్‌ఐసీ కొనుగోళ్లపై అనుమానాలు!

రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీలో ఎల్‌ఐసీ ఏకంగా 10.8శాతం వాటాకు సమానమైన షేర్లు కొనుగోలు చేసింది. షేరు ధర పడిపోతున్నా విక్రయించకుండా ఉండిపోయింది. దీనితో ఈ వ్యవహారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019 అక్టోబరు- 2021 మే మధ్యకాలంలో ఒక్కో షేరుకు రూ.700-1,000 మధ్య సుమారు 3.19 కోట్ల షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. 2023లో ఒక దశలో రూ.1,029కు చేరి జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకాయి. కానీ ఎల్‌ఐసీ విక్రయించి లాభం పొందలేదు. మరోవైపు 2019లో రూ.1,861 కోట్లుగా ఉన్న రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ నిర్వహణ లాభం ఏటేటా తగ్గిపోతూ వచ్చింది. 2025 నాటికి రూ.285 కోట్లకు పడిపోయింది. పైగా ఆ సంస్థ లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నట్టు చూపినా.. అందులో మిగిలే లాభం 0.1 శాతం కంటే తక్కువే. అంటే కోటి రూపాయల వ్యాపారంలో రూ.10వేల కంటే తక్కువే లాభం అన్నమాట. దీనితో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు గానీ, పెద్ద పెట్టుబడిదారులుగానీ రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థ షేర్లను కొనలేదు. కానీ కొనుగోలు చేసే కంపెనీల షేర్ల ఎంపిక కోసం పటిష్ఠమైన పరిశోధన బృందం ఉందని చెప్పుకొనే ఎల్‌ఐసీ మాత్రం వేల కోట్ల రూపాయల షేర్లు కొన్నది. 2023 అక్టోబరులో రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ షేరు ధర గరిష్ఠంగా రూ.1,029కి చేరింది. అప్పుడు కంపెనీ మార్కెట్‌ విలువ రూ.30,000 కోట్లకుపైగా ఉండేది. ఇప్పుడా షేరు రూ.103.92కు, కంపెనీ విలు వ రూ.3,070 కోట్లకు పడిపోయింది. ఎల్‌ఐసీ వద్ద ఉన్న ఈ కంపెనీ షేర్ల విలువ రూ. 3,280 కోట్ల నుంచి రూ.330 కోట్లకు తగ్గిపోయింది. అంటే ఎల్‌ఐసీకి సుమారు రూ.3 వేల కోట్ల నష్టం.

మేం ఏ తప్పూ చేయలేదు : రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌

సెబీ నివేదిక నేపథ్యంలో.. తాము ఏ తప్పూ చేయలేదంటూ రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ఆదాయ లెక్కలన్నీ సరైనవేనని.. ఆదాయాన్ని అధికంగా చూపామనడం నిజం కాదని పేర్కొంది. తమకు, సెబీకి మధ్య సమాచారం లోపం, గందరగోళం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టు కనిపిస్తోందని తెలిపింది. సెబీ విడుదల చేసినది మధ్యంతర నివేదికేనని, నిర్ణయమేదీ తీసుకోలేదని గుర్తు చేసింది.

ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 05 , 2026 | 06:40 AM