కేంద్రం, ఐఐటీ రూర్కీ వైఫల్యం వల్లే జేఈఈ అడ్వాన్స్‌డ్ డేటా లీక్: సీజేపీ
ABN , Publish Date - Jun 05 , 2026 | 06:03 AM
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల పోర్టల్‌లో తలెత్తిన భద్రతాలోపం కారణంగా విద్యార్థుల సమాచారం బహిర్గతం కావడంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ విద్యావ్యవస్థను..
ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ, జూన్ 4: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల పోర్టల్‌లో తలెత్తిన భద్రతాలోపం కారణంగా విద్యార్థుల సమాచారం బహిర్గతం కావడంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ విద్యావ్యవస్థను, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఎంతటి అసమర్థులు నడిపిస్తున్నారో ఈ ఘటన నిరూపిస్తోందని విమర్శించింది. విద్యారంగంలో జవాబుదారీతనాన్ని నిలపడంలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని డిమాండ్ చేసింది. విద్యార్థుల డేటా భద్రత, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా మండిపడ్డారు. సైబర్ భద్రతా ప్రమాణాల లోపం వల్ల దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు బయటకు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ టీ నేజీ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఈ లోపాల్ని గుర్తించి, సమాచారం అందించాడని, ఇది వ్యవస్థను నడిపిస్తున్న వారి మేధస్సుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రపంచ ప్రసిద్ధ ఐటీ నిపుణులను అందించిన దేశంలో, ఓ ప్రాథమిక పోర్టల్‌ను కూడా సురక్షితంగా నిర్వహించలేని అసమర్థత స్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. కాగా, నీట్ రద్దు కావడంతో మనస్తాపానికి గురై నాగపూర్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష చతుర్వేది, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వంట మాస్టర్‌గా చేస్తున్న తండ్రి వద్ద ఉంటూ నీట్ పరీక్షకు సిద్ధమైంది. ఆమె పరీక్ష బాగా రాసినప్పటికీ పేపర్ లీక్, పరీక్ష రద్దు వార్తలతో తీవ్ర మనోవేదనకు గురైంది. ‘మళ్లీ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు. అమ్మ, నాన్న నన్ను క్షమించండి’ అని సూసైడ్ నోట్ రాసి 14 రోజుల క్రితం ప్రాణాలు తీసుకుంది. ఆ నోట్ తాజాగా ఆమె పుస్తకాల్లో లభ్యమైంది. దీనిపై రాహుల్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో విచ్ఛిన్నమైన, అవినీతితో భ్రష్టు పట్టిన వ్యవస్థల పర్యవసానమే ఈ ఘటన అని ఆరోపించారు. కాగా, పదేపదే పరీక్షల రద్దు, పేపర్ల లీకుల వివాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు న్యాయం జరగాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!