తాజా నిబంధనల మేరకే పదోన్నతులు
ABN , Publish Date - Jun 05 , 2026 | 06:06 AM
ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఏర్పడిన నాటికి ఉన్న నిబంధనల ప్రకారమే తమకు పదోన్నతి...
ఉద్యోగ ఖాళీలు ఏర్పడే నాటికి ఉన్నవి వర్తించవు
ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ విచక్షణాధికారం: సుప్రీం
న్యూఢిల్లీ, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఏర్పడిన నాటికి ఉన్న నిబంధనల ప్రకారమే తమకు పదోన్నతి కల్పించాలని కోరే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. పదోన్నతి ప్రక్రియను పరిశీలించే సమయానికి ఏ నిబంధనలు అమల్లో ఉంటే, వాటి ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలని తేల్చిచెప్పింది. అండమాన్ నికోబార్ పోలీసుశాఖలో అమలైన ప్రమోషన్లకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. అండమాన్ నికోబార్‌లో హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎ్‌సఐగా పదోన్నతి ఇచ్చే విషయం లో.. పదో తరగతి చదివిన వారికి, అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యం ఇస్తామని ప్ర భుత్వం నిబంధన పెట్టింది. దీనివల్ల చదువు తక్కువైనా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్లకు అన్యాయం జరిగి, జూనియర్లు పైకొచ్చారని పలువు రు కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే నిబంధనలను సవరించింది. పరీక్షలన్నీ రద్దు చేసి, కేవలం సీనియారిటీ ఆధారంగానే మొత్తం ప్రమోషన్లు ఇస్తామని 2016లో కొత్త రూల్ తెచ్చింది. అయితే, అప్పటికే ప్రమోషన్లు పొందిన కొందరు హై కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. పాత ఖాళీలకు పాత రూల్స్‌నే పాటించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారణ జరిపింది. ‘2016లో కొత్త నిబంధనలు రావడంతో పాత రూల్స్ రద్దయ్యాయి. కాబట్టి కొత్త నిబంధనల ప్రకారమే ప్రమోషన్ల ప్రక్రియను నిర్వహించాలి. ఉద్యోగులకు 2014లో ఇచ్చిన తాత్కాలిక పదోన్నతులు కోర్టు తీర్పునకు లోబడి ఇచ్చినవి మాత్రమే. వాటి వల్ల ఉద్యోగులకు ఎలాంటి శాశ్వత హక్కులు సంక్రమించవు’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పదోన్నతులకు సంబంధించి ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అవి..
1. శాఖల్లో అంతర్గత మార్పులు లేదా పోస్టుల పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్నప్పుడు ప్రమోషన్లు ఇవ్వాలా? వద్దా? అనేది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
2. ఉద్యోగ ఖాళీలు గతంలో ఎప్పుడో ఏర్పడినంత మాత్రాన పాత రూల్స్ వర్తించవు. పదోన్నతి కల్పించే రోజున ఏ చట్టం, నిబంధనలు అమల్లో ఉంటే వాటినే కచ్చితంగా పాటించాలి.
3. సీనియారిటీ ఆధారంగాఇచ్చే ప్రమోషన్లకు, పరీక్ష లేదా అర్హతల ఆధారంగా ఇచ్చే ‘సెలక్షన్ పోస్టుల’కు వ్యత్యాసం ఉంటుంది. సెలక్షన్ పోస్టుల్లో సీనియారిటీ ఉంటే సరిపోదు, మెరిట్ అత్యంత ముఖ్యం. అయితే, ఈ ఎంపిక విధానాన్ని మార్చే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
4. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటికీ.. అప్పటికే వంద శాతం పూర్తయిన ప్రక్రియలకు మాత్రమే పాత రూల్స్ వర్తిస్తాయి.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!