Share News

హెచ్‌ఎండీఏ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తం

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:16 AM

మూసాపేట ట్రక్‌ పార్క్‌ భూమిని అమ్మొద్దంటూ విపక్ష నేతలు చేపట్టిన హెచ్‌ఎండీఏ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.

హెచ్‌ఎండీఏ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తం

  • ట్రక్‌ పార్క్‌ భూమిని అమ్మొద్దని విపక్ష నాయకుల డిమాండ్‌

  • తోపులాటతో గందరగోళం.. పలువురి అరెస్టు

  • విపక్ష నేతల అరెస్టులను ఖండిస్తున్నాం: కేటీఆర్‌

  • కాంగ్రెస్‌ అధిష్ఠానం జోక్యం చేసుకోవాలి: హరీశ్‌

కూకట్‌పల్లి/బాలనగర్‌/అమీర్‌పేట, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మూసాపేట ట్రక్‌ పార్క్‌ భూమిని అమ్మొద్దంటూ విపక్ష నేతలు చేపట్టిన హెచ్‌ఎండీఏ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ నేతలతోపాటు కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్ల ప్రతినిధులు బుధవారం అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భారీగా తరలివచ్చారు. ట్రక్‌ పార్క్‌ భూములు అమ్మొద్దంటూ నినాదాలు చేశారు. నాయకులు, కార్యకర్తలను బారికేడ్ల వద్దే పోలీసులు అడ్డుకోగా.. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఒక సందర్భంలో అక్కడ తోపులాట చోటు చేసుకోవడం.. గందరగోళానికి దారి తీసింది. ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని సమీప పోలీసుస్టేషన్లకు తరలించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, పలువురు వామపక్ష నేతలను మధురానగర్‌ పోలీసు స్టేషన్‌కు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు తదితరులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలించారు.


అనంతరం పోలీసుస్టేషన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ మాట్లాడుతూ ట్రక్‌ పార్క్‌కు సంబంధించిన 3.15 ఎకరాల భూమిని 1980-81లో నాటి ప్రభుత్వం సేకరించిందని గుర్తు చేశారు. ఆ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలే తప్ప.. అమ్మకానికి పెట్టాలనుకోవడం సరికాదన్నారు. ట్రక్‌ పార్క్‌ భూముల అమ్మకాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ గొంతులు నొక్కినా.. ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తామని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రె్‌సకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన విపక్ష నేతలను అరెస్టు చేయడం కాంగ్రెస్‌ నిరంకుశ వైఖరికి నిదర్శనమని, ఈ చర్యను ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు.


ప్రజా సమస్యలపై గొంతెత్తిన నేతలను పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటని ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. ట్రక్‌ పార్క్‌ భూములు వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి అని, ఆ భూములను వేలం వేయొద్దని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించొద్దని ఢిల్లీలో రాహుల్‌గాంధీ నీతులు చెప్తుంటే, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి భూములు వేలం వేస్తుండడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ట్రక్‌ పార్క్‌ వేలాదిమంది జీవితాలు, జీవనోపాధితో ముడిపడిన అంశమని, ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దని ఎక్స్‌ వేదికగా ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 05:18 AM