Share News

సన్న బియ్యం ధరలపై హరీశ్ ఫైర్.. నాలుగు నెలల్లో 25 శాతం పెరిగాయంటూ విమర్శలు

ABN , Publish Date - Oct 05 , 2026 | 03:15 PM

తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాన్యుడిపై పెను భారం పడుతోందన్నారు.

సన్న బియ్యం ధరలపై హరీశ్ ఫైర్.. నాలుగు నెలల్లో 25 శాతం పెరిగాయంటూ విమర్శలు
Harish Rao

హైదరాబాద్, అక్టోబర్ 5: రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ధరల పెరుగుదలతో సామాన్యుడిపై పెను భారం పడుతోందన్నారు. వెంటనే ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వాహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఉత్పత్తి పెరిగితే బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్నంటుతున్నాయని మాజీ మంత్రి ప్రశ్నించారు.


హరీశ్‌ రావు పోస్ట్..

‘సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి .. రేవంత్ సర్కార్ నేల చూపులు చేస్తోంది. నిత్యవసర ధరల నియంత్రణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. సామాన్యుడిపై పెనుభారం పడుతుంటే పౌరసరఫరాల శాఖ మొద్దు నిద్రలో ఉంది. వెంటనే ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలి. నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణం. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారు. సన్నబియ్యం ధరలు కేవలం నాలుగు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా? రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం... మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి.. బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి?’ అని ప్రశ్నించారు.


‘మీరు ఇస్తున్న సన్నబియ్యం పథకం సఫలం అయితే, ఎందుకు బియ్యం ధరలు అదుపు తప్పుతున్నాయి? మీరు ఇస్తున్న నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాక మరేమిటి? ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు ఎమ్‌ఎస్‌పీ(MSP) పేరిట దక్కుతున్నది నామమాత్రపు ధర. కానీ మధ్య దళారులుకు దక్కుతున్నది క్వింటాకు రూ.8000 పై మాటే. రైతుకు గిట్టుబాటు ధర లేదు.. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు.. లాభపడుతున్నది మాత్రం మధ్య దళారులు? కళ్లముందే ఈ తతంగం అంతా జరుగుతుంటే, ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు? బియ్యం మాత్రమే కాదు.. ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లినూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165 ధరలు అడ్డగోలుగా పెరిగితే సామాన్య కుటుంబం ఎలా బతకాలి? వంటింటి బడ్జెట్ తారుమారవుతున్నా.. పౌరసరఫరాల శాఖ ఏం చేస్తోంది? ధరల పర్యవేక్షణ గాలికి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం కాదు.. వెంటనే చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై తక్షణం నిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. సన్నబియ్యం సహా నిత్యావసరాల ధరలకు వెంటనే అడ్డుకట్ట వేసి, సామాన్యుడిపై పడుతున్న భారం నుంచి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ ఎక్స్‌లో హరీశ్ రావు పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే శాశ్వతం.. కొత్త ప్లాన్‌తో రూ.400 కోట్లు ఆదా

గోల్డ్ షాప్‌లో భారీ చోరీ.. రూ.2 కోట్ల వజ్రాల అపహరణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 03:34 PM