హైడ్రాలో ఉద్యోగాల కోసం వస్తే అవమానిస్తారా.. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందే: హరీశ్ రావు
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:23 PM
హైడ్రా డ్రైవర్ పోస్టుల భర్తీకి వచ్చిన నిరుద్యోగులను అవమానించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 8: హైడ్రాలో డ్రైవర్ పోస్టుల భర్తీకి వచ్చిన నిరుద్యోగులను అవమానించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. విద్యార్థులు, నిరుద్యోగులు అంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అంటూ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ.. 32 నెలలు దాటినా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.
హరీశ్ రావు పోస్ట్..
‘విద్యార్థులు, నిరుద్యోగులు అంటే మీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి? అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు. ఇది నిరుద్యోగుల తప్పా? లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన మీ ప్రభుత్వం తప్పా? ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులను ముఖ్యమంత్రి స్థాయిలో ‘క్రిమినల్ వేస్ట్’ అని అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం చూస్తుంటే ‘యథా రాజా.. తథా అధికారులు’ అన్న సామెత గుర్తుకొస్తోంది. అధికారుల నోటివెంట ఇలాంటి మాటలు రావడం మరింత బాధాకరం. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారినే అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు?అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 32 నెలలు దాటింది, ఆ హామీ ఏమైంది?’ అని ప్రశ్నించారు.
‘రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఇలా క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా? నీ రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్. నీ జాబ్ క్యాలెండర్ బోగస్. నిరుద్యోగులకు నువ్వు ఇచ్చిన హామీలు బోగస్. మీ పాలనలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో నిరాశ పెరుగుతోంది. నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడంతో పీజీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్య చదివిన యువత కూడా చిన్నచిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం.. జాబ్స్ ఇవ్వడం లేదు. భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఏకంగా విద్యార్థులపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి.. నిరుద్యోగులు మీపై జాలి అడగడం లేదు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతున్నారు. ఉద్యోగం అడగడం నేరం కాదు. ప్రశ్నించడం నేరం కాదు. ప్రభుత్వాన్ని నిలదీయడం నేరం కాదు. ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించడం నేర్చుకోవాలి. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. వారిని అవమానించినందుకు విద్యార్థి, నిరుద్యోగలోకానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి’ అంటూ ఎక్స్‌లో హరీశ్ రావు పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాలు.. పోటెత్తిన నిరుద్యోగులు.. తోపులాట
మృత్యువుతో పోరాడుతున్న ప్రియాంక.. నేడు కీలక పరీక్ష చేయనున్న వైద్యులు
Read Latest Telangana News And Telugu News