Share News

కక్షతోనే సిద్దిపేటలో పనుల నిలిపివేత

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:23 AM

సిద్దిపేటకు మంజూరైన అభివృద్ధి పనులను రాజకీయ కక్షతోనే నిలిపేసిందని బీఆర్‌ఎ్‌సఎల్పీ డిప్యూటీ లీడర్‌ టి.హరీశ్‌రావు ఆరోపించారు.

కక్షతోనే సిద్దిపేటలో పనుల నిలిపివేత
Harish Rao

  • ఇచ్చిన హామీలు నెరవేర్చాక అడుగు పెట్టు

  • సిద్దిపేటలో నేనే స్వాగతించి సన్మానిస్తా

  • సీఎంకు హరీశ్‌ రావు లేఖ

హైదరాబాద్‌/ సిద్దిపేట, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేటకు మంజూరైన అభివృద్ధి పనులను రాజకీయ కక్షతోనే నిలిపేసిందని బీఆర్‌ఎ్‌సఎల్పీ డిప్యూటీ లీడర్‌ టి.హరీశ్‌రావు ఆరోపించారు. వివిధ అభివృద్ధి పనుల కోసం గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేటకు మంజూరైన రూ.1,070 కోట్ల నిధులెప్పుడు విడుదల చేస్తారో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చి సిద్దిపేటలో అడుగు పెడితే తానే స్వయంగా స్వాగతం పలికి సన్మానిస్తానని సీఎం రేవంత్‌కు సవాల్‌ విసిరారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభానికి ఈ నెల 19న సిద్దిపేటకు రానున్న సీఎం రేవంత్‌ రెడ్డికి సోమవారం పలు డిమాండ్లతో హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.


‘2024 మే రెండో తేదీన లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు సిద్దిపేట అభివృద్ధికి సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పంద్రాగస్టుకే రైతు రుణ మాఫీ చేస్తానని మల్లన్న స్వామిపై ప్రమాణం చేసి ఇచ్చారని.. కానీ, సిద్దిపేటలో 22,819 మంది రైతులకు బదులు 20,514 మందికి మాత్రమే రుణ మాఫీ చేశారు. మిగతా రైతులకు ఎందుకు రుణ మాఫీ జరుగలేదు. 2026 మార్చి 22న నర్మెట్టలో పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభానికి వచ్చి 45 రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తానన్న హామీ అమలులో జాప్యం జరుగుతోంది’ అని గుర్తు చేశారు.


దేవుళ్లపై ప్రమాణం చేసి మాట తప్పినందు వల్లే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని ఆరోపించారు. ముచ్చటగా మూడోసారి సిద్దిపేటకు వస్తున్న సీఎం రేవంత్‌.. రాజకీయ కక్షలకతీతంగా వ్యవహరించాలని కోరారు. మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు మద్దతుగా నిరాహార దీక్ష చేసిన రేవంత్‌ రెడ్డి.. సీఎం హోదాలో వారి కోసం ఒక్కనాడైనా ఆలోచించలేదని మండిపడ్డారు. రేవంత్‌తో సహవాస దోషం వల్ల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకే.. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం కట్టారని కేంద్ర జల సంఘం కూడా తేల్చిందన్న సంగతి ఉత్తమ్‌ విస్మరిస్తున్నారన్నారు. వానాకాలంలో 25 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందంటే మీరు చేసిన పాపం కాదా..? అని నిలదీసిన హరీశ్‌.. కృష్ణా జలాల వినియోగంలో కాంగ్రెస్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 05:23 AM