జీహెచ్‌ఎంసీలో ఎలక్ట్రిక్ కార్లు
ABN , Publish Date - May 30 , 2026 | 07:33 AM
ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.
45 వాహనాల కొనుగోలు ప్రతిపాదనకు ఓకే
పర్యావరణ హితం.. ఇంధన ధరల పెరుగుదల వల్లే..
స్టాండింగ్ కమిటీ ఆమోదం
ఎంఎంసీలో 30 అంశాలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ సిటీ: ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు, పాలక మండలి ఏర్పాటైన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ల కోసం ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ట్రై కార్పొరేషన్ల ప్రత్యేకాధికారి జయేష్‌రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అద్దె, డ్రైవర్ కమ్ ఓనర్(డీసీఓ) ప్రాతిపదికన వినియోగిస్తున్న కార్ల స్థానంలో మొదటి దశలో 45 విద్యుత్ కార్లు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు.
కమిషనర్, అదనపు, జోనల్, డిప్యూటీ కమిషనర్ల కోసం కొత్తగా కొనుగోలు చేయనున్న కార్లు వినియోగించనున్నారు. గతంలోనే ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినా.. పలు కారణాలతో కార్యరూపం దాల్చలేదు. వీధి దీపాల నిర్వహణపై భారీగా ఫిర్యాదులు, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, ఇతర పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణకు 10 మంది ఎలక్ర్టికల్ ఇంజనీర్లను డిప్యూటేషన్‌పై తీసుకోవాలనే ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది.
చిల్లా నుంచి భవానీ నగర్ వరకు రూ.3.85 కోట్లతో 60 అడుగుల రోడ్డు విస్తరణ, బడాబజార్ నుంచి మౌలాకా చిల్లా వరకు రూ.5.99 కోట్లతో 40 అడుగుల రహదారి విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంబర్‌పేట అలీ కేఫ్ వద్ద భూగర్భ విద్యుత్ కేబుల్ మార్పు, రూ.5.90 కోట్లతో స్టిల్ట్ ప్లస్ రెండు అంతస్తులుగా జల్‌పల్లి సర్కిల్ కార్యాలయ భవనం నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. అమీర్‌పేట మైత్రివనం జంక్షన్‌లో దివంగత ఎన్‌టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తగిన ఆదేశాలు జారీ చేయాలనే ప్రతిపాదనను ఆమోదించారు.
ఎంఎంసీలో 30 అంశాలపై..
మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లో 30 అంశాలపై స్టాండింగ్ కమిటీలో చర్చించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేకాధికారి జయేష్ రంజన్, కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే
15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44శాతం మద్యం ప్రియులే
Read Latest AP News And Telangana News And International News And Telugu News