Share News

కాలుష్యం నుంచి గోదావరికి విముక్తి

ABN , Publish Date - May 30 , 2026 | 06:06 AM

కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ‘స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు’ పేరిట డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు.

కాలుష్యం నుంచి గోదావరికి విముక్తి

  • కార్యాచరణ ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

  • ‘స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

  • మురుగు రహితంగా 262 గ్రామాలు

  • శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి పట్టణ మురుగు

  • కాలుష్య పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌లు

  • పారిశ్రామిక కాలుష్యంపై నిరంతర పర్యవేక్షణ

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ‘స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు’ పేరిట డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. పుష్కరాల నిర్వహణకు ఆరు జిల్లాల పరిధిలో గుర్తించిన 262 గ్రామ పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దడంతోపాటు గోదావరి నదిలో కాలుష్య కారక వ్యర్థాల విడుదలను నిలువరించేందుకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణతోపాటు పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణకు ఆర్టీజీఎస్‌ తరహా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, నిరంతర ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్‌ రూముల్లో ప్రాంతాల వారీగా స్ర్కీన్లు ఏర్పాటు చేసి, వాటిని సీసీ కెమేరాలకు అనుసంధానించాలని ఆదేశించారు. దీని పర్యవేక్షణ బాధ్యతను ప్రధాన నదుల కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన అత్యున్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌కు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైతే వీబీజీ రాంజీ, స్వచ్ఛాంధ్ర, కాలుష్య నియంత్రణ మండలి నిధులను కూడా వినియోగించుకుని, పుష్కరాల నాటికి 262 గ్రామాలను మురుగు విడుదల రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. ఆరు జిల్లాల పరిధిలోని కొన్ని మున్సిపల్‌ పట్టణాల నుంచి రోజుకు 104 మిలియన్‌ లీటర్లు, గ్రామీణ ప్రాంతాల 8.38 మిలియన్‌ లీటర్లు మురుగు, ఆంధ్రపేపర్‌ మిల్స్‌ నుంచి రోజుకు 32 మిలియన్‌ లీటర్ల వ్యర్ధాలు, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా నుంచి 13.24 మిలియన్‌ లీటర్ల ఆక్వా కాలుష్యం గోదావరిలో కలుస్తున్నదని అధికారులు వివరించారు.


గృహ వినియోగ మురుగు నీటి నిర్వహణకు వీబీజీ రాంజీ పథకం కింద మ్యాజిక్‌ డ్రెయున్ల నిర్మాణం చేపట్టాలని పవన్‌ సూచించారు. బ్లాక్‌ వాటర్‌ నిర్వహణకు సామాజిక ఇంకుడు గుంతల తరహా నిర్మాణాలు చేపట్టాలన్నారు. కాలువలు, డ్రెయిన్ల ద్వారా మురుగును నేరుగా గోదావరి నదిలోకి విడుదల కాకుండా పంచాయతీ సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల నుంచి విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలోకి విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో మురుగునీటి శుద్ధ కేంద్రాలు చేపట్టాలని, ఇప్పటికే గోదావరి కాలుష్య నియంత్రణ కోసం పీసీబీ నుంచి మంజూరు చేసిన రూ.100కోట్లతోపాటు స్వచ్ఛాంధ్ర నిధులు వాడుకుంటూ దశల వారీగా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌పై దశల వారీగా నిషేధాన్ని అమలు చేయాలని గోదావరి ప్రాంత మున్సిపాలిటీలను ఆదేశించారు. గోదావరిలో కలుస్తున్న కాలుష్యంపై నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు.

Updated Date - May 30 , 2026 | 06:07 AM