Share News

ధరణి అక్రమాలు.. 14 మంది అరెస్టు!

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:40 AM

ధరణి పోర్టల్‌లోకి ప్రైవేటు వ్యక్తులు చొరబడి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తోంది.

ధరణి అక్రమాలు.. 14 మంది అరెస్టు!
Dharani Portal Scam

  • నిర్ధారించని సీఐడీ ఉన్నతాధికారులు..

  • డిజిటల్‌ ఫుట్‌ప్రింట్ల ఆధారంగా చర్యలు

  • ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైన వాస్తవాలు..

  • అనధికార లాగిన్లతో భూ యాజమాన్య మార్పిడి

  • రెవెన్యూ అధికారుల అండతోనే దందా!

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లోకి ప్రైవేటు వ్యక్తులు చొరబడి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తోంది. సంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో సీఐడీ అధికారులు సోదాలు జరిపి ఈ అక్రమాలకు బాధ్యులైన 14 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. సీఐడీ ఉన్నతాధికారులు దీనిని నిర్ధారించడం లేదు. ఈ విషయంలో సీఐడీ గోప్యత పాటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే ధరణి ఆపరేటర్లు, బయటి వ్యక్తులు కలిసి ధరణి పోర్టల్‌లో లాగిన్‌ అయి.. భూ యాజమాన్య రికార్డులను మార్చివేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ధరణి అక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్‌ ఎంక్వైరీ టీమ్‌ అధికారులు.. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించారు. ఆడిట్‌లో లభించిన డిజిటల్‌ ఫుట్‌ ప్రింట్ల ఆధారంగా ఏయే కార్యాలయాల్లో ధరణి ఆపరేటర్ల నుంచి ప్రైవేటు వ్యక్తులు లాగిన్‌ అయ్యారు? వారికి సహకరించిన రెవెన్యూ అధికారులు ఎవరు? అనే విషయాన్ని సీఐడీ అధికారులు గుర్తించినట్లు, దాని ఆధారంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.


సోదాల్లో కీలక ఆధారాలు లభ్యం!

ధరణి పోర్టల్‌ డెవలపర్లు, ఆపరేటర్లు, డాక్యుమెంట్‌ రైటర్ల ఇళ్లలోనూ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. టెర్రాసిస్‌ కంపెనీ, క్వాంటెలాలోనూ సీఐడీ అధికారుల టెక్నికల్‌ బృందం సోదాలు నిర్వహించి పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ధరణి పోర్టల్‌ ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ నిర్వహించిన టెర్రాసి్‌సకు అదనంగా రెండేళ్లు పొడిగింపు ఇచ్చిన నేపథ్యంలో వేలల్లో అనధికార లాగిన్‌లు చోటుచేసుకున్నట్లు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు.


వాస్తవానికి టెర్రాసిస్‌కు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బ్లాక్‌చెయిన్‌ పెట్టాల్సి ఉండగా.. టెర్రాసిస్‌ కంపెనీ ఆ పని చేయలేదు. దీంతో లాగిన్‌, ఆథరైజేషన్‌, ట్రాన్సాక్షన్‌ టైమ్‌ అన్నీ మార్చగలిగారని భావిస్తున్నారు. ఏడు నేషనల్‌ స్టాండర్డ్స్‌ను వీరు పాటించలేదని, పేమెంట్‌ గేట్‌వేను సొంత దుకాణంలా వాడుకుని ట్రాన్సాక్షన్‌ ఫీజులను సైతం సకాలంలో ప్రభుత్వానికి టెర్రాసిస్‌ కంపెనీ జమ చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై సీఐడీ అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ధరణి అక్రమాలలో అనేక మంది రెవెన్యూ అధికారుల పాత్రకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సేకరించారు. తహస్దీలార్‌ స్థాయి నుంచి ఆర్‌డీవోలు, జిల్లా కలెక్టర్ల పాత్రపై సీఐడీ విచారణలో కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 03:40 AM