ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై తెలంగాణ సర్కారు కొరడా
ABN , Publish Date - Nov 12 , 2026 | 07:36 PM
ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే ఏజెన్సీ లెసెన్స్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణలో మరో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. M/s డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లైసెన్స్ రద్దు తక్షణమే అమల్లోకి వచ్చేలా కంట్రోలింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
భద్రతా సిబ్బంది నియామకాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీలపై దాడులు చేస్తోంది. ఇటీవలే ఓ ఏజెన్సీ లైసెన్స్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో ఏజెన్సీ అయిన డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. లెసెన్స్ రద్దు ఉత్తర్వులు తక్షణమే అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏడు రోజుల్లో ఒరిజినల్ లైసెన్స్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్‌కు ఆదేశాలు జారీ చేసింది.
లైసెన్స్ రద్దుకు భద్రతా సిబ్బంది నియామకంలో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలే కారణమని కంట్రోలింగ్ అథారిటీ తెలిపింది. పోలీస్ వెరిఫికేషన్ లేకుండానే సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నట్లు.. ఎటువంటి శిక్షణ లేకుండానే సిబ్బందిని విధుల్లోకి పంపినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.
సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, షోకాజ్ నోటీసుకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించినట్లు వారు తెలిపారు. బొల్లారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదేళ్ల చిన్నారి హత్య కేసుతోనూ ఏజెన్సీకి సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో సదరు ఏజెన్సీ నియమించిన సెక్యూరిటీ గార్డుపైన చాలా కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో నేరాలను అరికట్టి.. ప్రజలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు ప్రభుత్వం జారీ చేసిన కీలక ఆదేశాలు:
- లైసెన్స్ పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహించాలి.
- ప్రతి సెక్యూరిటీ గార్డుకు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించాలి.
- శిక్షణ పొందిన, శారీరకంగా ఫిట్‌గా ఉన్న సిబ్బందినే నియమించాలి.
- సిబ్బంది వివరాలు, శిక్షణ, మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు నిర్వహించాలి.
- విధుల్లో ఉన్న సిబ్బందిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు
తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి
పీఆర్పీ.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News