Chain Snatching: చైన్ స్నాచింగ్స్ కలకలం.. భయాందోళనలో జనం
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:49 PM
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్ ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
మల్కాజ్‌గిరి, జనవరి17 (ఆంధ్రజ్యోతి): మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్(Chain Snatching) ఘటనలు కలకలం రేపుతున్నాయి. చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో.. ఇటీవల వెలుగుచూసిన పలు ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బంగారు గొలుసులు లాక్కుని పరారవుతున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళలే లక్ష్యంగా..
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. హయత్ నగర్ అంజనాద్రి నగర్‌లో విజయ అనే మహిళ మెడలో 3.3తులాల పుస్తెలతాడును దొంగలు లాకెళ్లారు. నాగోల్ బ్లైండ్స్ కాలనీలో మనమ్మ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లిపోయారు. చైతన్యపురి ఆర్కేపురంలో ఆదిలక్ష్మి అనే మహిళ మెడ నుంచీ 1.5 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. వరుస చైన్ స్నాచింగ్ చోరీలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితులు ఒంటరిగా నడుస్తున్న మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో.. రద్దీ తక్కువగా ఉన్న రహదారులపై ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వేగంగా వచ్చి, ఒక్కసారిగా గొలుసు లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు.
వరుస ఘటనలు...
మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుసగా చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కావడం పోలీసులను అప్రమత్తం చేసింది. కొన్ని రోజుల వ్యవధిలోనే పలు ఘటనలు జరగడంతో ఇది ఒకే గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానికుల్లో భయాందోళన..
ఈ ఘటనలతో స్థానిక మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మార్నింగ్ వాక్స్, దేవాలయ దర్శనాలు, మార్కెట్‌కు వెళ్లే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది స్థానికులు పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు..
ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద ద్విచక్ర వాహనాలు, వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు.
సీసీటీవీ ఆధారంగా..
పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ కెమెరాలు కీలకంగా మారాయి. ఈ ఘటన జరిగిన సమయాల్లో రోడ్లపై ఉన్నసీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ.. దుండగుల రాకపోకల మార్గాలను పరిశీలిస్తున్నారు. ఈ ఫుటేజీ ఆధారంగా నిందితుల స్కెచ్ తయారుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చైన్ స్నాచింగ్ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిందితులు ఒకే గ్యాంగ్‌కు చెందిన వారా? ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయా? అన్న అంశాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసుల్లో పురోగతి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
పోలీసుల సూచనలు..
చైన్ స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. మహిళలు ఒంటరిగా వెళ్లే సమయంలో బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండటం మంచిదని తెలిపారు. రోడ్డుపై నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ద్విచక్ర వాహనాలు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టగలమని పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆ నలుగురు సీఎంలపై మంత్రి తుమ్మల ఇంట్రస్టింగ్ కామెంట్స్..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు బ్రేక్
Read Latest Telangana News And Telugu News