Share News

1న ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు నడపాలి

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:25 AM

నవంబరు 1న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనున్న దృష్ట్యా దేశ రాజధానికి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లను నడపాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు.

1న ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు నడపాలి
Telangana Congress

  • రైల్వే జీఎం ఆఫీస్‌కు కాంగ్రెస్‌ శ్రేణులు

  • రైళ్లను నడపలేమన్న రైల్వే అధికారులు

  • రైల్‌ నిలయం వద్ద ఆందోళన.. ఉద్రిక్తత

  • మోదీ, షా కుట్ర వల్లే.. : మహేశ్‌ గౌడ్‌

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌/రెజిమెంటల్‌ బజార్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): నవంబరు 1న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనున్న దృష్ట్యా దేశ రాజధానికి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లను నడపాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సుమారు 150 మంది కార్యకర్తలు సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంకు నుంచి నడుచుకుంటూ రైల్వే జీఎం కార్యాలయానికి వెళ్లారు. రైల్‌ నిలయం గేటు వద్ద ఆర్పీఎఫ్‌ పోలీసులు అనుమతి లేకుండా లోపలికి వెళ్లొందని వారిని అడ్డుకున్నారు.


అయినప్పటికీ మహేశ్‌కుమార్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీలు అనిల్‌కుమార్‌, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీగణేశ్‌, నవీన్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే దానం తదితర నేతలు రైల్వే జీఎం కార్యాలయంలోకి దూసుకెళ్లిపోయారు. దాంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఢిల్లీకి ప్రత్యేక రైళ్లను నడపలేమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ శ్రీవాత్సవ నుంచి సందేశం రావడంతో కాంగ్రెస్‌ నేతలు నిరసనకు దిగారు. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నేతలంతా రైల్వే జీఎం కార్యాలయం ఎదురుగా మెట్లపై ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్‌ పోలీసులతోపాటు సివిల్‌ పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని ఆందోళనకారుల్ని బయటికి పంపించారు.


మహేశ్‌ కుమార్‌తో పాటు మంత్రి పొన్నం, ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌, ఇతర ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ వెళ్లడానికి రెండు ప్రత్యేక రైళ్లు కావాలని వారంరోజుల క్రితం దరఖాస్తు చేస్తే ఇన్నిరోజులు కాలయాపన చేసి చివరికి రైళ్లు ఇవ్వలేమని మోసం చేశారని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుతంత్రంలో భాగంగానే రైల్వే జీఎం రైళ్లను ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు.


నిర్వహణ పరిమితుల వల్లే..: రైల్వే శాఖ

ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయకపోవడానికి నిర్వహణ పరిమితులే కారణమని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. సికింద్రాబాద్‌ నుంచి న్యూఢిల్లీకి రైలు లభ్యత, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, తగిన రేక్‌(కోచ్‌ల సముదాయం), లోకోమోటివ్‌లు, సిబ్బంది, నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి కొంత సమయం పడుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఢిల్లీకి కాంగ్రెస్‌ ఇక్కట్ల యాత్ర..!

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:27 AM