Share News

ఢిల్లీకి కాంగ్రెస్‌ ఇక్కట్ల యాత్ర..!

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:22 AM

ఇండీ కూటమి నవంబరు 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఓట్‌ బచావో, దేశ్‌ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి క్షేత్రస్థాయి కాంగ్రెస్‌ నేతలు ఉత్సాహం చూపిస్తున్నా.. ప్రయాణానికి ఏర్పాట్లలో టీపీసీసీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఢిల్లీకి కాంగ్రెస్‌ ఇక్కట్ల యాత్ర..!
Congress Delhi Vote Bachao rally

  • ప్రత్యేక రైళ్లకు నో చెప్పిన రైల్వేశాఖ..

  • ఆకాశాన్నంటిన విమాన చార్జీలు

  • చివరకు బస్సుల్నే నమ్ముకున్న టీపీసీసీ

  • జిల్లాకు రెండు చొప్పున బస్సులు

  • పార్టీ అనుబంధ సంఘాలకు మరికొన్ని..

  • 30న ఉదయం బయలుదేరనున్న

  • వంద బస్సులు.. 31 సాయంత్రానికి ఢిల్లీకి

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇండీ కూటమి నవంబరు 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఓట్‌ బచావో, దేశ్‌ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి క్షేత్రస్థాయి కాంగ్రెస్‌ నేతలు ఉత్సాహం చూపిస్తున్నా.. ప్రయాణానికి ఏర్పాట్లలో టీపీసీసీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పరిస్థితులను అంచనా వేయడంలో పొరపాట్ల కారణంగా ఆసక్తిగల నాయకులు బస్సుల్లో గంటల తరబడి ఇక్కట్ల యాత్ర చేయాల్సి వస్తోంది. ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో ర్యాలీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏఐసీసీ.. తెలంగాణ నుంచి ఈ కార్యక్రమంలో 15 వేల మంది హాజరు కావాలంటూ టార్గెట్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు, విమానాల ద్వారా నాయకులను ఢిల్లీకి పంపాలని పార్టీ నేతలు భావించారు. జిల్లాల వారీగా ఢిల్లీకి వచ్చే నాయకుల జాబితా పంపాలని డీసీసీ అధ్యక్షులను టీపీసీసీ చీఫ్‌ ఆదేశించారు కూడా. అయితే ప్రత్యేక రైళ్లు కేటాయించేందుకు రైల్వేశాఖ నిరాకరించింది.


ఢిల్లీ టికెట్‌కు డిమాండ్‌ పెరగడంతో.. విమానాయాన సంస్థలు టికెట్‌ ధరలను అమాంతం పెంచేశాయి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి విమాన టికెట్‌ రూ.20 వేలకు పైమాటే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక వైపున రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కేటాయించడానికి నిరాకరించడం, మరోవైపున విమానం టికెట్‌ ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయంగా బస్సులనే నమ్ముకోవాల్సిన పరిస్థితి టీపీసీసీ నేతలకు ఏర్పడింది. అయితే తెలంగాణ నుంచి ఢిల్లీకి బస్సు ప్రయాణం 36 గంటలకు పైగా ఉండటంతో పేర్లు నమోదు చేసుకున్నవారిలో ఎంతమంది వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. చేసేది కూడా ఏమీ లేకపోవడంతో బస్సుల ద్వారానే నాయకులను ఢిల్లీకి పంపాలన్న నిర్ణయానికి టీపీసీసీ వచ్చింది. పార్టీ జిల్లా స్థాయిలో మండల, బ్లాకు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, పీసీసీ సభ్యులు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారి కోసం జిల్లాకు రెండు బస్సులను ఏర్పాటు చేస్తోంది. అలాగే పార్టీ అనుబంధ సంఘాలకు కొన్ని బస్సుల్ని కేటాయించింది. ఈ నెల 30న ఉదయం రాష్ట్రం నుంచి వంద బస్సుల వరకు ఢిల్లీకి బయలుదేర నున్నాయి. ఈ బస్సులు ఈ నెల 31న సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటాయని, ఆ రోజు రాత్రి నేతలు ఢిల్లీలో బస చేసి.. మరుసటి రోజున జరిగే ర్యాలీలో పాల్గొంటారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. నాయకుల ప్రయాణం, వసతి ఏర్పాట్ల కోసం ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎంపీలతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే.


టార్గెట్లో సగమే..!

నేతల ఢిల్లీ యాత్ర కోసం టీపీసీసీ ఏర్పాటు చేసిన వంద బస్సు ల్లో బస్సుకు 40 మంది చొప్పున 4 వేల మంది మాత్రమే ప్రయాణించే వీలుంది. అన్ని గంటల ప్రయాణం పట్ల నాయకులు నిరాసక్తత ప్రదర్శిస్తే ఆ సంఖ్య ఇంకా తగ్గేందుకు ఆస్కారం ఉంది. అయితే పార్టీ ఎంపీలు, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు ఢిల్లీకి ఇప్పటికే ఫ్లైట్లు బుక్‌ చేసుకున్నారని, కొంతమంది నేతలు సాధారణ రైళ్లలో రిజర్వేషన్లూ చేయించుకున్నారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఏఐసీసీ పెట్టిన టార్గెట్‌ను చేరుకోవడం సాధ్యం కాదంటున్నారు. ర్యాలీ నాటికి టార్గెట్లో సగం మందే చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

యువకులు బస్సుల్లో వస్తే బాగుంటుంది: మహేశ్‌గౌడ్‌

ఢిల్లీకి బస్సు ప్రయాణం 30 గంటలకు పైగా పట్టే అవకాశం ఉన్నందున.. యువకులు బస్సుల్లో వస్తే బాగుంటుందంటూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సూచన చేశారు. ఢిల్లీ టూర్‌పై డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్ల చైర్మన్‌లతో బుధవారం జూమ్‌ ద్వారా ఆయన సమావేశమయ్యారు. ఇందులో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:18 AM