Share News

రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Mar 19 , 2026 | 01:15 PM

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.

రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, మార్చి 19: ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నామన్నారు.


దేశంలోనే రైతుల విషయంలో అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించడం మనకు గర్వకారణమని తెలిపారు. తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే అని.. అందుకే రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని సీఎం వెల్లడించారు. రూ.18 వేల కోట్లు రైతుభరోసా కోసం ఖర్చు చేశామని తెలిపారు. ఈ నెల 22న మరోసారి రైతుభరోసా నిధులను విడుదల చేయబోతున్నామని చెప్పారు. ధరణి భూతాన్ని తరిమేసి భూ భారతితో భూసమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.


ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

పరాభవ నామ సంవత్సరం అందరికీ మంచి చేయాలి: సీఎం చంద్రబాబు

ప్రతి ఏడాది ఉగాది రోజున జాబ్ క్యాలెండర్: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 01:50 PM