పరాభవ నామ సంవత్సరం అందరికీ మంచి చేయాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:41 AM
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నమైనవి అని సీఎం తెలిపారు.
విజయవాడ, మార్చి 19: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని.. పులుపు, తీపి, వగరు, చేదు, కారం వంటి రుచులు ఉంటాయన్నారు. జీవితంలో కష్టసుఖాలు, ఆనంద దుఃఖాల్లాగే ఈ రుచులన్నీ కలగలిసి ఉంటాయని వివరించారు.
ఈ ఏడాది అంతా మంచి జరగాలని అందరం కోరుకుంటున్నామని సీఎం తెలిపారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వేడుకగా ఉగాది జరుపుకుని పంచాంగ శ్రవణం చేస్తారని తెలిపారు. ఈ సంవత్సరం 38 మందికి కళారత్న అవార్డులు, 122 మందికి ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని.. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం. తెలుగు సంస్కృతి వినూత్నమైనది, పండుగలు విభిన్నమైనవి.. ప్రకృతిని ఆరాధించడం, ఆరోగ్యకర జీవన విధానానికి ప్రతీకలుగా ఉంటాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
సంక్రాంతి మొదలుకొని అన్ని పండుగలకు విశిష్టత ఉందన్నారు సీఎం. మన పండుగలు ఆరోగ్యకర జీవన శైలిని ప్రతిబింబిస్తాయని.. నేల, ప్రకృతి, నీటిని పూజిస్తామని చెప్పారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయని తెలిపారు. నీటి పరిరక్షణ కోసం 'నీటి భద్రత' విధానాన్ని తీసుకొచ్చామని అన్నారు. తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, పర్యావరణం కోసం నీరు అవసరమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వలు ఉన్నాయన్నారు. మే 15 నుంచే సాగుకు నీరు విడుదల చేస్తామని, నారు మళ్లు వేసుకోవాలని ముందుగానే చెప్పిన ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
విజయవాడలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఆ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం... రూ.55.63 కోట్లు విడుదల
Read Latest AP News And Telugu News