ప్రతి ఏడాది ఉగాది రోజున జాబ్ క్యాలెండర్: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:33 PM
విలువలతో జీవనం గడిపేవారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదని... విలువలు లేని చోట ఏమీ మిగలదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విదేశాల్లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు మారారని సీఎం తెలిపారు.
అమరావతి, మార్చి 19: ప్రతి ఏడాది ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలిపారు. విజయవాడ తుమ్మపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలండర్ విడుదల చేశామని చెప్పారు. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో 30607 ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని అన్నారు.
భవిష్యత్తులో పూర్తి సాంకేతికతతో పాలన
మన పండుగలు, ఆచారాల్లోనే సైన్సు ఉందన్నారు సీఎం. వాస్తు లాంటి శాస్త్రాలు, సూర్య నమస్కారం లాంటి ఆచారాలు ఇలాంటివే అని చెప్పుకొచ్చారు. యోగా, నేచురోపతి లాంటి వైద్యం కూడా ప్రకృతి నుంచి వచ్చిందే అని.. ఆరోగ్యం, ఆనందం, సంపద వీటి వల్లే సాధ్యమవుతుందన్నారు. సమీప భవిష్యత్తులో పూర్తి సాంకేతికతతో పాలన జరిగే అవకాశం ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణం.. ఇలా వేర్వేరు పరిస్థితులను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం వచ్చిందన్నారు.
30 ఏళ్ల క్రితమే టెక్నాలజీని ప్రోత్సహించాం
30 ఏళ్లక్రితమే ఐటీ విప్లవాన్ని ఊహించి టెక్నాలజీని ప్రోత్సహించామని... తద్వారా అందరి జీవితాల్లో మార్పు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్లే హైదరాబాద్ నగరం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీగా మారిందన్నారు. ఐటీ జీవనోపాధి ఇచ్చిందన్నారు. ‘మన సంస్కృతీ సంప్రదాయాలు మనకు విలువలు నేర్పుతాయి’ అని అన్నారు. విలువలతో జీవనం గడిపేవారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదని... విలువలు లేని చోట ఏమీ మిగలదని పేర్కొన్నారు. ఇక్కడ ఉండే మనకంటే విదేశాల్లోని తెలుగువారు మన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారని తెలిపారు. విదేశాల్లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు మారారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
2047 నాటికి అగ్రస్థానంలో తెలుగు జాతి
తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉండాలన్నదే తన సంకల్పమన్నారు సీఎం. 2047 నాటికి అగ్రస్థాయి జాతిగా తెలుగు జాతి ఉండాలన్న సంకల్పాన్ని అంతా తీసుకోవాలని అన్నారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ ముఖ్యమైన ముందడుగు వేశామన్నారు. డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వ్యక్తిగత ఔషధాలను కూడా అందించే పరిస్థితి వస్తుందన్నారు. 2024కు ముందు ఐదేళ్లు ఎవరూ సంతోషంగా పండుగలు కూడా జరుపుకునే పరిస్థితి లేదని తెలిపారు. ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసం, దారుణాలు జరిగాయని మండిపడ్డారు. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడి.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఆర్థిక, సామాజిక, ఆరోగ్య భద్రత అందించాలన్నదే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
జనాభాను పెంచేలా చర్యలు
భారత్‌లో ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండే సంప్రదాయం ఉందని... ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. కొందరు స్వార్ధంతో తల్లికి, చెల్లెలికి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు కూడా ఉంటారని.. అందుకే మళ్లీ ఉమ్మడి కుటుంబాలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నామన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీతో మళ్లీ జనాభాను పెంచేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తల్లికి వందనం ద్వారా ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఆర్థిక సహకారం అందిస్తున్నామని అన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు రూ.20 వేల చొప్పున ఇచ్చామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకువచ్చామని తెలిపారు. దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు.
నేను పనిచేసేదే వారి కోసం..
అర్చకులకు రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తున్నామని.. ఇమామ్‌లు, మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నామని సీఎం తెలిపారు. సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేలా పీ4 కార్యక్రమాన్ని తీసుకువచ్చామని తెలిపారు. సంపన్నులైన 10 శాతం మంది.. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మందిని ఆదుకునేలా ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. తాను పనిచేసేది 5 కోట్ల మంది తెలుగు ప్రజల కోసమని... అందరి జీవన ప్రమాణాలు మెరుగుపర్చటం కోసమని స్పష్టం చేశారు సీఎం. సమాజంలో అట్టడుగున ఉండిపోయిన పేదలకు చేయూతనిచ్చి పైకి తీసుకువచ్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు.
ప్రజారాజధాని అమరావతి
సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రంగా ప్రాంతీయ ఎకనామిక్ కారిడార్లు తీసుకువచ్చామని సీఎం తెలిపారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైల్వేలైన్లు అనుసంధానం చేసి లాజిస్టిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఇప్పటి వరకూ రూ.1,943 కోట్లు ఇచ్చామని వివరించారు. గత పాలకులు పైసా కూడా వారికి పరిహారం ఇవ్వలేదని.. అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి కావాలని చెప్పుకొచ్చారు. గోదావరి పుష్కరాలకంటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. తద్వారా కృష్ణా డెల్టాకు, విశాఖకు గ్రావిటీతో నీళ్లు వెళ్తాయని, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఇంకా రూ.5 వేల కోట్ల మేర నిధులు వ్యయం చేయాల్సి ఉందని... నిధులు ఇస్తున్న కేంద్రానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. ‘దేవతల రాజధాని అమరావతి... ఇప్పుడు ఇక్కడ ప్రజారాజధాని అమరావతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం... రూ.55.63 కోట్లు విడుదల
పరాభవ నామ సంవత్సరం అందరికీ మంచి చేయాలి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News